Mithun Reddy SIT Case: మద్యం కుంభకోణంలో ఎంపీ మిధున్ రెడ్డిని( MP Mithun Reddy) అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీఎమ్ఓ మాజీ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. వీరంతా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులు. అందుకే వీరిని ముందుగా అరెస్టు చేశారు. ఇప్పుడు తర్వాత వంతు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అని ప్రచారం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ప్రత్యేక దర్యాప్తు బృందం పావులు కదుపుతోంది. ఒకవేళ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని అరెస్టు చేస్తే మాత్రం.. ఏపీ పొలిటికల్ వర్గాల్లో పెను సంచలనమే.
కీలక నిందితుల అరెస్ట్
ప్రస్తుతం మద్యం కుంభకోణంపై సిట్( special investigation team) దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం ఈ స్కామ్ లో 45 మంది నిందితులను గుర్తించారు. కానీ కీలక నిందితులుగా అనుమానిస్తూ ప్రస్తుతానికి 11 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఎంపీ మిధున్ రెడ్డిని టార్గెట్ చేసుకుంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు, సన్నిహితుడు కావడంతో ఫుల్ ఫోకస్ పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. దాదాపు రూ.3200 కోట్ల స్కాం ఇది. ఇందులో మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అంటూ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. తాజాగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ సమయంలో కూడా పూర్తి ఆధారాలు సమర్పించడంతో.. కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వలేదు. దీంతో అరెస్టు భయంతో ఉన్న మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read: Botsa vs Ashok Gajapathi: బొత్స కుటుంబంలో చీలిక!
ఆదిలోనే పిటీషన్..
మద్యం కుంభకోణంలో( liquor scam ) మిధున్ రెడ్డి పేరు మీడియాలో బయటకు వచ్చిన క్రమంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అప్పటికి నిందితుల జాబితాలో మిధున్ రెడ్డి పేరు లేదు. పేరు లేనందున మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని.. విచారణకు పిలవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆ తరువాత మిథున్ రెడ్డిని నిందితుల జాబితాలో చేర్చడంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. అయితే హైకోర్టులో బెయిల్ పిటిషన్ రద్దు కావడంతో ఇప్పుడు మిధున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
సుప్రీం’ లో షాక్ తప్పదా?
ప్రస్తుతం మిథున్ రెడ్డి విదేశాలకు వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలకు( airports ), పోర్టులకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు చూస్తే మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు సేకరించింది సిట్. హైకోర్టు మాదిరిగా సుప్రీంకోర్టులో వాటిని చూపిస్తే బెయిల్ పిటిషన్ రద్దయ్యే అవకాశం ఉంది. అది జరిగిన మరుక్షణం సిట్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకోనుంది. మొత్తానికైతే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోందన్నమాట.