Botsa vs Ashok Gajapathi: బొత్స కుటుంబంలో చీలిక వచ్చిందా? ఆధిపత్య పోరు ప్రారంభం అయ్యిందా? వచ్చే ఎన్నికల్లో తలో దారిన వెళ్ళనున్నారా? విజయనగరం పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆ కుటుంబానికి చెందిన ఓ నేత రాజకీయ చిరకాల ప్రత్యర్థిని ప్రశంసించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల గోవా గవర్నర్గా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు( Ashok gajpati Raju ) నియమితులైన సంగతి తెలిసిందే. ఆయన నియామకంతో టిడిపి కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సీనియారిటీతోపాటు సిన్సియారిటీకి సరైన గౌరవం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అశోక్ గజపతిరాజుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అనూహ్యంగా తన చిరకాల ప్రత్యర్థి అయిన బొత్స కుటుంబం నుంచి ఓ మాజీ ఎమ్మెల్యే అశోక్ గజపతి రాజుకు అభినందనలు తెలపడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
బొత్స కుటుంబ హవా
విజయనగరం జిల్లాలో( Vijayanagaram district) బొత్స కుటుంబానిది ఒక హవా. కాంగ్రెస్ హయాంలో పెనుమత్స సాంబశివరాజు ఒక వెలుగు వెలిగారు. ఆయన శిష్యరికంలో పనిచేశారు బొత్స. కానీ తనకున్న సామాజిక, కుటుంబ బలంతో ఒక రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు. ఉత్తరాంధ్రలో తనకంటూ ఒక మార్క్ చూపించారు. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజుకు ధీటుగా రాజకీయాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు మొన్నటి వైసిపి ప్రభుత్వం లో ఒక వెలుగు వెలిగారు. తాను చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రి పదవి చేపట్టేవారు. సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మరో సమీప బంధువు బడ్డు కొండ అప్పలనాయుడు నెల్లిమర్ల శాసనసభ్యుడిగా ఉండేవారు. స్వయానా మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్గా ఇప్పటికీ కొనసాగుతున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో బొత్స తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా ఓడిపోయారు. ప్రస్తుతం బొత్స విశాఖ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. పైగా శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగుతున్నారు.
Also Read: AB Venkateswara Rao : జగన్ వేధించాడు.. చంద్రబాబు బయటపడేశాడు!
దశాబ్దాల వైరం..
విజయనగరం జిల్లాలో పూసపాటి అశోక్ గజపతి రాజుతో బొత్స కుటుంబానికి దశాబ్దాలుగా వైరం నడుస్తోంది. అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు అశోక్ గజపతిరాజు. ఈ క్రమంలో అశోక్ ను గోవా గవర్నర్ గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు అశోక్ గజపతి రాజును నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు( appalan Naidu ) ఆకాశానికి ఎత్తేశారు. రాజకీయాలకే వన్నెతెచ్చిన నాయకుడు అశోక్ గజపతి రాజు అని కొనియాడారు. అటువంటి నేత జిల్లా వాసి కావడం గర్వకారణంగా చెప్పుకొచ్చారు. అయితే బొత్స కుటుంబ వ్యక్తి ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థిని ప్రశంసించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొద్దిరోజులుగా బడ్డు కొండ అప్పలనాయుడుకు బొత్స కుటుంబంతో విభేదాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అప్పలనాయుడు అశోక్ గజపతి రాజును ప్రశంసించడం చర్చకు దారితీస్తోంది. రకరకాల రచ్చకు కారణం అవుతోంది.
రాజకీయ విభేదాలతోనే..
నెల్లిమర్ల ( nelli Marla )ఇన్చార్జిగా బడ్డుకొండ అప్పలనాయుడు ను తప్పిస్తారని ప్రచారం నడుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన టిడిపిలో చేరుతారని కూడా టాక్ నడిచింది. నెల్లిమర్ల నియోజకవర్గంలో బొత్స సోదరుడు వేలు పెట్టడం వెనుక పెద్ద స్కెచ్ ఉందన్నది అప్పలనాయుడు లో ఉన్న అనుమానం. అయితే అప్పలనాయుడు జిల్లా పరిషత్ చైర్మన్, బొత్స మేనల్లుడు అయిన మజ్జి శ్రీనివాసరావుకు స్వయాన బావ. అయితే ఇటీవల కుటుంబంలో తలెత్తిన విభేదాలతో బడ్డుకొండ తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందుకే బొత్స ప్రత్యర్థిని ఆకాశానికి ఎత్తినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.