లాక్ డౌన్ 3.0 వచ్చే ఆదివారం (మే 17) రోజున ముగుస్తుండడంతో అదే రోజు నుంచి విమాన సర్వీసులను నడిపేందుకు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ యోచిస్తున్నది. ఈ మేరకు పౌరవిమానయాన డైరెక్టర్ జనరల్ కార్యాలయంతోపాటు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అధికారులు పలు నగరాల్లోని విమానాశ్రయాలను తనిఖీచేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే తొలుత ఐటీ సెక్టార్ నగరాలు అయిన ముంబై, హైదరాబాద్, బెంగళూరుకు విమానసర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్తున్నారు.
మొదటిగా తక్కువ దూరం ఉన్న ప్రాంతాలకు విమానాలు నడిపితే బాగుంటుందన్న సూచనలు కూడా అందాయి. రెండు గంటల వ్యవధి గల ప్రయాణాలకు ఎలాంటి భోజన సదుపాయం కల్పించకుండా విమానాలు నడుపవచ్చునని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే, విమాన ప్రయాణికులు మాత్రం ఆరోగ్యసేతు యాప్ ను తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకొంటేనే ప్రయాణానికి అనుమతించాలన్న మరో సూచన కూడా అందినట్లు తెలుస్తున్నది.