Jagan (10)
Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy) కీలక నియామకాలు చేపడుతున్నారు. పార్టీకి వరుసగా నేతలు గుడ్ బై చెబుతున్న తరుణంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలో కొనసాగుతున్న వారికి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అనుబంధ విభాగాల బలోపేతమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక బాధ్యతలు కట్టబెట్టారు. కొంతమంది సీనియర్లతో పాటు మహిళా నేతలకు కూడా ప్రాధాన్యమిస్తూ అనుబంధ విభాగాలను ప్రకటించారు. త్వరలో జగన్ జిల్లాల పర్యటన ఉంటుందన్న నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Also Read: ఏపీలో ఉచిత విద్యుత్.. ఉత్తర్వులు జారీ!
* క్రమశిక్షణ కమిటీ పునరుద్ధరణ
పార్టీలో క్రమశిక్షణ కమిటీని పునరుద్ధరించారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా శెట్టిపల్లి రఘురామిరెడ్డి( Raghuram Reddy ) నియమించారు. సభ్యులుగా రెడ్డి శాంతి, తానేటి వనిత, కైలే అనిల్, విశ్వేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి బాధ్యతలు కట్టబెట్టారు జగన్. రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్ నియమితులయ్యారు. అయితే వీరి నియామకం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో జిల్లాల పర్యటనకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్న తరుణంలో.. ఈ నియామకాలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
* పార్టీకి నేతల రాజీనామా
2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ దారుణంగా ఓడిపోయింది. 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఎన్నికల ఫలితాల తర్వాత నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. పార్టీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి సైతం పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి వచ్చిన నేతలు సైతం బయటకు వెళ్లిపోయారు. అందుకే అనుబంధ విభాగాలను మరింత బలోపేతం చేయాలని భావించారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేతల స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారు. అయితే గత 10 ఏళ్లలో కనిపించని అనుబంధ విభాగాలను బలోపేతం చేయాలని భావిస్తుండడం విశేషం.
* గత కొంతకాలంగా సైలెంట్..
గత కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి( Siddharth Reddy ). గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ గా పని చేశారు. పార్టీ అధికారంలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డి ఆయనకు శాప్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సైలెంట్ కావడంతో ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కానీ ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏకంగా రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడం విశేషం.
Also Read: పాస్టర్ ది హత్యా? ప్రమాదమా? ఏపీ ప్రభుత్వం సీరియస్!