Praveen Pagadala
Praveen Pagadala: ఏపీలో( Andhra Pradesh) పాస్టర్ అనుమానాస్పద మృతి చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. పోలీసులు రోడ్డు ప్రమాదంగా చెబుతుండగా.. క్రైస్తవ మత బోధకులు మాత్రం దీనిని హత్యగా ఆరోపిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఈ తరుణంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత హైదరాబాద్ తరలించే ప్రయత్నం జరుగుతోంది.
Also Read: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తీరని విషాదం!
* జాతీయ రహదారిపై మృతదేహం
రాజమండ్రి ( Rajahmundry)దివాన్ చెరువు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండడంతో రోడ్డు ప్రమాదమని తొలుతా భావించారు. అయితే ఆయన శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రవీణ్ పగడాలది హైదరాబాద్ అయితే.. రాజమండ్రి ఎందుకు వెళ్లారు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. హైదరాబాదు నుంచి విశాఖకు బైక్ మీద వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. బైక్ మీద వెళుతున్న సమయంలో వెనుక నుంచి ఢీ కొట్టి.. దాడి చేసి చంపేశారు అంటూ సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలు ఉండడంతో అనుమానాలు పెరిగాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
* పోలీసుల ప్రత్యేక ఫోకస్..
కాగా ఏపీ పోలీసులు దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఘటన జరిగిన జాతీయ రహదారి వరకు సిసి పూటేజీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ ( pastor praveen) మృతి పై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణం పై వస్తున్న అనుమానాలపై విచారణ చేయాలని టిడిపి నేత మహాసేన రాజేష్ డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తి బైక్ తిరిగే పరిస్థితి ఉండదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చెబుతున్నారు. ప్రవీణ్ కుమార్ ప్రమాదంలో చనిపోలేదని.. ఆయన మరణం పై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
* డీజీపీతో మాట్లాడిన సీఎం
కాగా ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) స్పందించారు. పాస్టర్ మృతి పై విచారం వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. ఈ విషయంపై డిజిపి హరీష్ కుమార్ గుప్తా తో ముఖ్యమంత్రి మాట్లాడారు. పగడాల ప్రవీణ్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మృతి పై అనుమానాలు ఉన్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సైతం ఆరా తీశారు.
Also Read: జగన్ జిల్లాల పర్యటన ఎప్పుడు? ఉగాది తర్వాత లేనట్టేనా?