HomeNewsJagan Political Decisions: ఆ ప్రకటనలు, నిర్ణయాలు సరికావు జగన్!

Jagan Political Decisions: ఆ ప్రకటనలు, నిర్ణయాలు సరికావు జగన్!

Jagan Political Decisions: ‘తప్పకుండా అధికారంలోకి వస్తాం. తామెంటో చూపిస్తాం. ఏ ఒక్కరినీ వదలం’… ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) హెచ్చరికలు ఇవి. తమ పార్టీ వారికి భరోసా ఇచ్చే క్రమంలో ఆయన ఈ కీలక ప్రకటనలు చేశారు. అందులో తప్పులేదు. మీరు రెడ్ బుక్ రాస్తే.. నేను గుడ్ బుక్ రాస్తా. తప్పకుండా అందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కేసులు ఎదుర్కొన్న వారి పేర్లు రాసుకుంటా. వారందరికీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానంటూ కూడా చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ క్షేత్రస్థాయిలో ఆయన హామీలు ఏవి కనిపించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మొన్ననే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బిజెపి బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపారు జగన్మోహన్ రెడ్డి. కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేయగా పార్టీ శ్రేణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కానీ ఎవరితోనూ అభిప్రాయాలను షేర్ చేసుకోకుండా ఏకంగా బిజెపికి మద్దతు ప్రకటించడానికి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read: అమరావతిపై జగన్ కు అరుదైన ఛాన్స్!

ఓటమి నేర్పని గుణపాఠాలు
2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress party)పార్టీ. కేవలం 11 స్థానాలకు పరిమితం అయి.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. ఈ తరుణంలో ధైర్యం పోగుచేసుకుని జగన్మోహన్ రెడ్డి గట్టి ప్రకటనలే చేశారు. కచ్చితంగా పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతుందని.. సహజంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియా ప్రతినిధులను పిలిచి గంటల తరబడి ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. అయితే అంతవరకు ఓకే. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఆ మాటలు సరే. కానీ క్షేత్రస్థాయిలో వారి భుజం తట్టి ప్రోత్సహించేందుకు జిల్లాల పర్యటన చేయాలి. కానీ ఏడాది దాటుతోంది ఇంతవరకు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టలేదు. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు, జైలుకు వెళ్లిన వారి పరామర్శల పేరుతో భారీ ప్రదర్శనకు మాత్రం దిగుతున్నారు. అయితే ఈ బలప్రదర్శన ఒక్కటే చాలదని.. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళకపోతే ఇబ్బంది తప్పదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

జనాలు వైసీపీకి కామన్..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ శ్రేణులు జనాలను చూస్తూనే ఉన్నాయి. జగన్ అంటే జనం.. జనం అంటే జగన్ అన్న మాదిరిగా పరిస్థితి సర్వసాధారణం. కానీ జనాలు మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఒకేసారి గెలిపించారు. 2014 ఎన్నికలకు ముందు కూడా జనాలు వచ్చారు. పెద్ద ఎత్తున జై కొట్టారు. 2019 ఎన్నికల్లో జగన్ జనంతోనే తన సంబంధాలు కొనసాగించారు. జన ప్రభంజనంతో అంతులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో కూడా జగన్ చుట్టూ జనం భారీగా చేరారు. జై కొట్టారు గానీ అంతులేని అపజయం ఎదురయింది. అంటే జగన్ అంటే జనం సర్వసాధారణం. కానీ గెలుపు అనేది మాత్రం కష్టతరం.

Also Read: వివేకానంద రెడ్డి హత్య కేసు.. సుప్రీం తీర్పు పై వైసీపీ సైలెన్స్

జగన్ మాటే ఫైనల్..
అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న కొట్టుకుపోతుంది. కానీ అధికారంలో లేనప్పుడు మాత్రం పార్టీలో ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. పార్టీలో ఆయనే అల్టిమేట్. ఆయన తీసుకున్న నిర్ణయం ఫైనల్. మొన్నటికి మొన్న బిజెపి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డిని ఫోన్లో కోరారు. అయితే పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామంటూ జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఒకరోజు తిరిగేసరికి కనీసం ఎవరితో చర్చించారో తెలియకుండానే బిజెపి అభ్యర్థికి మద్దతు ప్రకటించేశారు. కనీసం ఇండియా కూటమి అభ్యర్థి పేరు ప్రకటించే వరకు కూడా వేచి చూడలేదు జగన్. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత జనం మధ్యలోకి వస్తామన్నారు జగన్. తరువాత ఉగాది అన్నారు. దసరా తప్పకుండా వస్తామని చెప్పారు. ఇలా నెలలకు నెలలు.. ఏళ్లకు ఏళ్లు కరిగిపోతున్నయే తప్ప జగన్ జనం మధ్యకు వచ్చిన దాఖలాలు లేవు. ఇది ముమ్మాటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టమేనని విశ్లేషకులు కాదు సొంత పార్టీ వారు కూడా అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version