AP IT Minister Gudivada Amarnath : “ఏపీ ఇప్పుడే గుడ్డు పెట్టింది.. అది పొదగాలి. అప్పుడే పిల్ల బయటికి వస్తుంది” చదువుతుంటే ఎక్కడో విన్నట్టు ఉంది కదూ. వినడమేంటి చూసినట్టు కూడా ఉంటుంది.. ఈ కామెంట్లు చేసింది ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆయన చేసిన పనుల కంటే గుడ్డు మంత్రి గానే పేరు పొందారు. యాంటి వైసిపి సోషల్ మీడియా వల్ల మీడియాలో విపరీతమైన ప్రాచుర్యం పొందారు. అలాంటి ఆ మంత్రికి మొన్నటిదాకా ఎన్నికల్లో టికెట్ దక్కుతుందనే ఆశలు లేవు. తనకు టికెట్ రాదని తెలిసి ఆయన కొన్ని సందర్భాల్లో కన్నీరు కూడా పెట్టుకున్నారు. జగన్ దయతలచారో, అమర్నాథ్ ఏదైనా మంత్రం వేసారో తెలియదు కాని.. మొత్తానికైతే ఆయనకు టికెట్ వచ్చింది. టికెట్ వచ్చింది అని అనుకుంటుంటే.. ఆయనకు పోటీగా టిడిపి అభ్యర్థి పల్లా వాసు బరిలో ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అమర్నాథ్ వర్గంలో చర్చ మొదలైంది.
వాసు గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ ఇక్కడ జనాల్లో ఆయనకు సానుభూతి ఉంది. పైగా ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. దానికి అదనంగా జనసేన నుంచి ఎంతో కొంత కాపు సామాజిక వర్గ మద్దతు కూడా లభిస్తుంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన స్టీల్ ప్లాంట్ సమస్య గాజువాక నియోజకవర్గంలోనే ఉంది.. ఇక్కడ కార్మికులు కూడా వాసు కు జై కొడుతున్నట్టు తెలుస్తోంది. అయితే బిజెపితో జత కట్టిన నేపథ్యంలో కొంత మైనస్ గా మారే అవకాశం ఉంది.
ఇక అమర్నాథ్ విషయానికొస్తే.. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు.. అయితే సొంత సామాజిక వర్గం ఆయనకు ఏ మేరకు ఉపకరిస్తుందనేది చూడాలి. ఇక్కడ వైసీపీలో వర్గ పోరు తీవ్రంగా ఉంది. మరి వారిని అమర్ ఎలా సరిదిద్దగలరనే దానిపైనే ఆయన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరో వైపు తన తండ్రి గురునాథరావు ఈ నియోజకవర్గానికి చెందిన వారు కావడమే అమర్నాథ్ సానుకూలంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమర్నాథ్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.