Jamili Elections: హంగ్ వస్తే.. జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ సంచలన సిఫారసులివీ

మధ్యంతర ఎన్నికల ద్వారా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి పరిపాలన కాలం మిగిలిన ఏడాది వరకు మాత్రమే ఉంటుంది. దీని ప్రకారం రెండు సంవత్సరాలకు ఏదైనా ప్రభుత్వం కూలిపోతే.. కొత్తగా నిర్వహించిన ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వ పదవీకాలం మూడు సంవత్సరాలకే పరిమితమవుతుంది.

Written By: Dharma, Updated On : March 15, 2024 8:55 am

Jamili Elections

Follow us on

Jamili Elections: “హంగ్ వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఎన్నికలు జరపాలి. పార్లమెంటు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలి. ఇది పూర్తయిన తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలి. రాజ్యాంగంలో పలు అధికరణలను సవరించాలని” జమిలి ఎన్నికలపై కేంద్రం నియమించిన రామ్ నాథ్ కోవింద్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు 18 వేల పేజీల నివేదిక సమర్పించింది. జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయని, లా కమిషన్ కూడా సమర్థిస్తోందని, 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ప్రకటించింది.

మధ్యంతర ఎన్నికల ద్వారా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి పరిపాలన కాలం మిగిలిన ఏడాది వరకు మాత్రమే ఉంటుంది. దీని ప్రకారం రెండు సంవత్సరాలకు ఏదైనా ప్రభుత్వం కూలిపోతే.. కొత్తగా నిర్వహించిన ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వ పదవీకాలం మూడు సంవత్సరాలకే పరిమితమవుతుంది. జమిలి ఎన్నికలు నిర్వహించిన తర్వాత.. స్థానిక సంస్థలకు వంద రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలి. దీనికోసం రాజ్యాంగంలో ఐదు అధికరణలను సవరించాల్సి ఉంటుంది. పార్లమెంట్ కాల వ్యవధికి సంబంధించిన రాజ్యాంగంలోని 83వ ఆర్టికల్, పార్లమెంటు రద్దుకు సంబంధించిన 85 వ అధికరణ, రాష్ట్రాల అసెంబ్లీ కాల వ్యవధికి సంబంధించిన 172 వ అధికరణం, శాసనసభల రద్దుకు సంబంధించిన 174వ అధికరణం, రాష్ట్రపతి పాలనకు సంబంధించిన 356 అధికరణాలను సవరించాల్సి ఉంటుంది.. ఒకవేళ పార్లమెంట్ లేదా అసెంబ్లీకి హంగ్ వస్తే కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి. అవిశ్వాస తీర్మానం వంటి అసాధారణ సందర్భాలు ఎదురైనప్పుడు కూడా మిగతా కాలా వ్యవధికి గానూ కొత్తగా ఎన్నికల నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికలను మభ్యంతర ఎన్నికలు గానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల ద్వారా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పరిపాలన కాలం మిగిలిన కాల వ్యవధి వరకు మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు రెండు సంవత్సరాలకు ఒక ప్రభుత్వం కూలిపోతే.. కొత్తగా నిర్వహించే ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వ పదవీకాలం మూడు సంవత్సరాల వరకే ఉంటుంది.

ఇక ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్, శాసనసభ, స్థానిక సంస్థల్లో ఉమ్మడిగా ఓటర్ల జాబితా రూపొందించాలి. దీనికోసం రాజ్యాంగంలో 325 అధికరణంలో సవరణలు చేయాలి. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం ఎదురైనప్పుడు కూడా మిగతా సమయానికి గాను కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి. అంటే దీనిబట్టి ఇకపై బల ప్రదర్శన అనేది ఉండదు. జమిలి ఎన్నికలపై రామ్ నాథ్ కోవింద్ కమిటీ 191 రోజులపాటు అధ్యయనం జరిపింది. అనేక రంగాల నిపుణులతో సమావేశాలు నిర్వహించింది. 62 రాజకీయ పార్టీలను అభిప్రాయాలు తెలపాలని కోరింది. ఇందులో 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. భారత రాష్ట్ర సమితి, ఎన్ సి పి, జెడిఎస్, ఆర్జెడి, టిడిపి, వైసిపి వంటి మరో 15 పార్టీలు స్పందించలేదు. 32 పార్టీలు మద్దతు ఇచ్చాయి.. దాదాపు 21,558 స్పందనలు వచ్చాయి.. 81 శాతం మంది ఏకకాలంలో ఎన్నికలను సమర్థించారు. కాగా, ఈ జమిలి ఎన్నికలను కాంగ్రెస్, ఆప్, సిపిఎం వంటి 15 పార్టీలు వ్యతిరేకించాయి.