https://oktelugu.com/

Electricity Bills : యూపీఐ ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపు.. కుదిరిన ఒప్పదందం!

దాదాపు రెండేళ్లుగా తెలంగాణలో కరెంటు బిల్లులను చాలా మంది యూపీఐల ద్వారానే చెల్లిస్తున్నారు. కరోనా కాలం నుంచి ఈ చెల్లింపులు పెరిగాయి. తర్వాత విద్యుత్‌ బిల్‌ కలెక్షన్‌ సెంటర్లను విద్యుత్‌ సంస్థలు చాలా వరకు కుదించాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 16, 2024 / 12:04 PM IST

    Electricity bills through UPI

    Follow us on

    Electricity Bills : తెలంగాణలో రెండు నెలలుగా విద్యుత్‌ బిల్లుల చెల్లింపునకు వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు రెండు మూడేళ్లుగా యూపీఐ ద్వారా ఇంటో నుంచే బిల్లుల చెల్లింపు చేస్తున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే వంటి పేమెంట్‌ యాప్స్‌ ద్వారా విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు జరిగాయి. అయితే యూపీఐ సంస్థలతో చేసుకున్న ఒప్పందం కాలపరిమితి ముగియడంతో విద్యుత్‌ సంస్థలు వాటిద్వారా బిల్లులు తీసుకోవడం నిలిపివేశాయి. దీంతో విద్యుత్‌ వినియోగదారులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. విద్యుత్‌ బిల్‌ కలెక్షన్‌ సెంటర్‌కు వెళ్లి క్యూలైన్లలో నిలబడి చెల్లించాల్సి వస్తోంది. దీంతో రెండు నెలలుగా వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాల మేరకు.. డిజిటల్‌ పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు గూగుల్‌ పే, ఫోన్‌ పే, అమెజాన్‌ పేతోపాటు బ్యాంకుల యాప్‌లు, ఇతరత్రా ఏ యాప్‌ ల ద్వారా కూడా విద్యుత్‌ బిల్లులు స్వీకరించడం నిలిపివేసినట్లు టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ ప్రకటించింది.

    వెబ్‌సైట్‌ ద్వారా అవకాశం..
    యూపీఐలతో చెల్లింపులు నిలిపివేసిన నేపథ్యంలో టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ వెబ్‌ సైట్‌ లేదా టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా చెల్లించే అవకాశం కల్పించింది. అయితే వీటి వినియోగంపై చాలా మందికి అవగాహన లేదు. అరచేతిలో ఉన్న ఫోన్‌లో ప్రస్తుతం గూగుల్‌పే, ఫోన్‌పే, అమెజాన్, పేటీఎం లాంటి యాప్స్‌ ఉన్నాయి. విద్యుత్‌ బిల్లులు మినహా మిగతా చెల్లింపులన్నీ వాటిద్వారా చేస్తున్నారు. దీంతో నెలకోసారి చెల్లించే కరెంటు బిల్లు కోసం కొత్తగా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో విద్యుత్‌ కేంద్రాలకు వెళ్లి బిల్లులు చెల్లిస్తున్నారు.

    ఆ జిల్లాలో యాప్స్‌ ద్వారా..
    ఇదిలా ఉంటే.. విద్యుత్‌ వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మళ్లీ యాప్స్‌తో విద్యుత్‌ బిల్లుల చెల్లింపునకు టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్‌ జిల్లాలో ఫోన్‌పే, భీమ్‌ యాప్‌ల ద్వారా విద్యుత్‌ బిల్లులు చెల్లించే అవకాశం కల్పించింది. ఈమేరకు భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టం సర్వీస్‌తో ఒప్పందం జరిగిందని ఎస్‌ఈ గంగాధర్‌ తెలిపారు. మరో వారం రోజుల్లో గూగుల్‌ పే ద్వారా కూడా విద్యుత్‌ బిల్లులు చెల్లించే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యుత్‌ వినియోగదారులు సద్వినియోగం చేసుకుని విద్యుత్‌ బిల్లులు సకాలంలో చెల్లించి సహకరించాలని కోరారు.