Kolkata: ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన కోల్ కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో మరో దారుణం..

జూనియర్ వైద్యురాలపై అత్యాచారం, ఆపై హత్య జరిగిన నేపథ్యంలో.. పలువురు వైద్యులు మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. రీ క్లెయిమ్ ది నైట్ (స్వాతంత్రం లభించిన ఆ రాత్రిని తిరిగి సాధిద్దాం) పేరుతో బెంగాల్ వ్యాప్తంగా బుధవారం రాత్రి ప్రదర్శనలు జరిపారు..

Written By: Anabothula Bhaskar, Updated On : August 16, 2024 11:59 am

Attack on Kolkata RG Kar hospital

Follow us on

Kolkata: కోల్ కతా లోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి పై హత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అటు పశ్చిమ బెంగాల్ తో పాటు ఇటు యావత్ దేశాన్ని మొత్తం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ సంఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. గురువారం స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు ముగిసిన తర్వాత సాయంత్రం దేశవ్యాప్తంగా వైద్యులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆ తర్వాత దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోగుల ప్రాణాలను కాపాడుతున్న వైద్యుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే జూనియర్ వైద్యురాలిపై హత్యాచారాన్ని మర్చిపోకముందే కోల్ కతా లోని ఆర్జీ కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో బుధవారం రాత్రి మరో దారుణం చోటుచేసుకుంది.

దుండగులు దారుణానికి పాల్పడ్డారు

ఆస్పత్రి ఆవరణలో దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఆందోళనకారుల రూపంలో వచ్చిన కొంతమంది సంఘవిద్రోహశక్తులు ఆస్పత్రి పరిసరాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఆస్పత్రిలోకి ప్రవేశించారు. సుమారు 40 మంది ఆస్పత్రిలోకి ఎంట్రీ ఇచ్చి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఆస్పత్రి ఆస్తులను ధ్వంసం చేశారు. అత్యంత విలువైన వైద్య పరికరాలను పగలగొట్టారు. అంతేకాదు హత్యాచార ఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్న జూనియర్ వైద్యులపై విచక్షణారహితంగా దాడులు చేశారు. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బుధవారం రాత్రి 11 గంటల 55 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకుంది..

స్వాతంత్ర్యం లభించిన ఆ రాత్రిని తిరిగి సాధిద్దాం..

జూనియర్ వైద్యురాలపై అత్యాచారం, ఆపై హత్య జరిగిన నేపథ్యంలో.. పలువురు వైద్యులు మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. రీ క్లెయిమ్ ది నైట్ (స్వాతంత్రం లభించిన ఆ రాత్రిని తిరిగి సాధిద్దాం) పేరుతో బెంగాల్ వ్యాప్తంగా బుధవారం రాత్రి ప్రదర్శనలు జరిపారు.. ఈ నేపథ్యంలోనే కోల్ కతా లోని అర్జీ కర్ ఆస్పత్రి వద్దకు 40 మంది నిరసనకారుల రూపంలో ముసుగులు ధరించి అక్కడికి వచ్చారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆసుపత్రిలోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు. అత్యవసర వైద్య విభాగం లోకి ప్రవేశించారు. నర్సింగ్ సెక్షన్ లోకి వెళ్లి అక్కడికి సిబ్బందిపై దాడులు చేశారు. మెడిసిన్ స్టోర్ లోకి వెళ్లి.. విలువైన వైద్య పరికరాలను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలను కూడా పగలగొట్టారు. జూనియర్ డాక్టర్ పై హత్యాచారం జరిగిన తర్వాత ఈ నెల 9 నుంచి అక్కడి ఆసుపత్రి వైద్యులు నిరసన చేస్తున్నారు. అయితే అక్కడి వైద్యుల నిరసనను ప్రశ్నిస్తూ 40 మంది దారుణానికి పాల్పడ్డారు. వారి దాడుల వల్ల ఆసుపత్రి ప్రాంగణంలోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి భాష్ప వాయువును ప్రయోగించారు. తమ లాఠీలకు పని చెప్పారు. వారిని చెదరగొట్టారు. దీంతో పారిస్థితి అదుపులోకి వచ్చింది.. అయితే ఆసుపత్రిలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ మాత్రం వచ్చిన దుండగులు వెయ్యి మంది దాకా ఉంటారని చెబుతున్నారు. ఇక ఈ ఘటనలో ఇప్పటిదాకా పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు.

ఆధారాలు తొలగించేందుకు..

అయితే జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటనకు సంబంధించి ఆధారాలను సమూలంగా నాశనం చేసేందుకే ఓవర్గం ఇలాంటి దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం కోల్ కతా పోలీసులు కీలకమైన ప్రకటన చేశారు..” సెమినార్ గదిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన సంఘటన తెలిసిందే. అయితే ఆ సంఘటన జరిగిన ప్రాంతం చెక్కుచెదరకుండా ఉంది. అందులోకి ఎవరూ ప్రవేశించలేదు. మీడియా తప్పుడు వార్తలను ప్రసారం చేయొద్దు. ఆ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని” పోలీసులు పేర్కొన్నారు. దుండగుల దాడిని ఆస్పత్రి నర్సులు నిరసించారు. ఈ ఘటనపై బెంగాల్ గవర్నర్ సీజీ ఆనంద బోస్ స్పందించారు. ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉదంతం సభ్య సమాజానికి మంచిది కాదని వెల్లడించారు. గురువారం ఆయన ఆసుపత్రిని సందర్శించారు