Cold Wave: ఏపీ వణికిపోతోంది. చలి తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి పొగ మంచు విపరీతంగా కురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు పడుతూనే ఉంది. దీనికి తోడు చల్లటి గాలులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి జనసంచారం తగ్గుతోంది. ఉదయం 10 గంటల తరువాత ప్రజలు రహదారుల పైకి వస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చెప్పనవసరం లేదు. గత రెండు రోజులుగా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువ నమోదు కావడం విశేషం. ముఖ్యంగా విశాఖ ఉమ్మడి జిల్లాలో మన్యప్రాంతంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. అరకు తో పాటు లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రత మూడు డిగ్రీలకు పడిపోయింది. దీంతో గిరిజనులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు మన్యం పర్యటనకు వచ్చే పర్యాటకులు చలితో వణికి పోతున్నారు.
* ప్రజలకు తీవ్ర అసౌకర్యం
అయితే ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో అన్ని వర్గాల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. విశాఖ జిల్లాకు సంబంధించి జి మాడుగుల మండలం కుంతలంలో కనిష్ట ఉష్ణోగ్రత 5.7° నమోదయింది. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. శ్రీకాకుళం, అన్నమయ్య, శ్రీ సత్య సాయి, అనంతపురం, విజయనగరం, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనకాపల్లి, పార్వతీపురం, కాకినాడ తదితర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు కిందకు పడిపోయింది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
* సీజనల్ వ్యాధులపై హెచ్చరిక
చలి తీవ్రత పెరగడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది. చిన్నపిల్లలు వృద్ధులు బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా ముఖానికి మంకీ క్యాప్ వేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. చలికాలంలో వృద్ధులు, శ్వాస కోసం వ్యాధులతో ఇబ్బందులు పడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వ్యాధులతో బాధపడేవారు ఆరోగ్యంలో ఏమాత్రం తేడా కనిపించిన వెంటనే వైద్యులను ఆశ్రయించాలని చెబుతున్నారు.