Congress Vs BRS: అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు రాష్ట్రంలో మూడు పార్టీల హోరు కనిపించింది. అప్పటి అధికార బీఆర్ఎస్ ను హామీల అమలు తీరుతో పాటు ప్రజా సమస్యలపై కాంగ్రెస్, బీజేపీలు నిత్యం విమర్శలు చేస్తూ ఆందోళనలతో జనానికి దగ్గరగా నిలిచారు. తర్వాత ఎన్నికల్లో నూ ఇదే వాతావరణం కనిపించింది. హోరాహోరీ అసెంబ్లీ పోరులో కాంగ్రెస్ విజేతగా నిలిచింది. గులాబీ పార్టీకి రెండో స్థానం దక్కింది. ఫలితాల్లో హైదరాబాద్ కు పరిమితమైన ఎం ఐ ఎం తర్వాత బీజేపీ నిలిచింది. అయితే గతంతో పోల్చితే కాషాయం పార్టీ ఈ ఎన్నికల్లో సీట్లతో పాటు ఓటింగ్ షేరును పెంచుకుంది. ఒక దశలో అధికారం సైతం దక్కించుకుంటామనే ధీమా వ్యక్తం చేసిన ఆ పార్టీ ఎన్నికలకు ముందు రాష్ట్ర చీఫ్ మార్పు ఫలితాలపై ప్రభావం చూపిందని చెప్పవచ్చు.
లోక్ సభ ఎన్నికల్లో ఇలా..*
ఆ వెంటనే వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో పోరు ముక్కోణం అయినా క్షేత్రస్థాయిలో చేయి, పువ్వు అన్నట్లుగా సాగింది. అలాగే దేశమంతా మరోసారి మోడీ గాలి అంటూ సంకేతాలు రాగా రాష్ట్రంలో ఫలితాలు కూడా వాటినే ప్రతిబింబించేలా వచ్చాయి. కాంగ్రెస్ , బీజేపీ చేరి సగం సీట్లు దక్కించుకోగా ఎప్పటిలాగే పాతబస్తీ సీటు ఎం ఐ ఎం ఖాతాలో చేరింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ ఒక్క సీటును కూడా గెలవలేక చతికిల పడింది. చాలా చోట్ల మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.
*ఓడినా జనంలోనే..*
పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారిగా గులాబీ పార్టీ ప్రాతినిధ్యం కోల్పోయింది. అయినా నిత్యం ప్రజల్లోనే ఉండేలా ఆ పార్టీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ ఎస్ చీఫ్ ఇంటికే పరిమితమైన మిగతా నేతలు కేటీఆర్, హరీష్ రావు వంటి వారు నిత్యం కాంగ్రెస్ హామీలను గుర్తు చేస్తూ ప్రజా సమస్యలపై తమదైన శైలిలో సర్కారు తీరును ఎండగడుతున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సమానమైన సీట్లను సాధించిన బీజేపీ మాత్రం ప్రజా సమస్యల విషయంలో కొంత వెనుకబడిందని చెప్పవచ్చు.
*మాస్ లీడర్ పైనే అందరి చూపు*
రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈయన కేంద్ర మంత్రి కూడా. అయితే మృదు స్వభావి అనే పేరుంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ తో పాటు, పదేళ్లపాటు పవర్లో కొనసాగిన బీఆర్ ఎస్ ను రానున్న ఎన్నికల్లో ఢీ కొనాలంటే మాస్ లీడర్ తోనే సాధ్యమన్న అభిప్రాయం కమలం పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తుంది. ఇందులో బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ వంటి వారినే ఎక్కువగా సూచిస్తున్నారు. రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యం దృష్ట్యా అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుంది.. నూతన సంవత్సరంలో ఆ పార్టీ ఎలాంటి స్ట్రాటజీ అవలంభిస్తుందో వేచి చూడాల్సిందే.