HomeNewsనిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదం రోజు రోజుకీ చిలికి చిలికి గాలివాన లాగా తయారవుతుంది. ఇప్పటికే తను రాసినట్లు చెబుతున్న లేఖపై రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఇందులో కోర్టులు ఏం చెప్పాయనేదాన్ని ఒక్క నిముషం పక్కనపెట్టి ప్రజలేమనుకుంటున్నారు అని చూస్తే మాత్రం ఆ లేఖ చదివిన వాళ్లకు నిమ్మగడ్డ నిజాయితీపై సందేహాలు కలిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కులం పేరుతో అభియోగం చేయటం మొరటుగా వున్నా పరిస్థితులు చూస్తే  ఒక సాధారణ పౌరుడికి దానిని నమ్మే పరిస్థితి వుంది. అయినా ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఆమాట మాట్లాడకూడదు. నిమ్మగడ్డ చంద్రబాబుతో కుమ్మక్కయ్యాడని మాట్లాడటం వరకు ఒకే గానీ ముఖ్యమంత్రి గా అలా మాట్లాడటం సభ్యతకాదు. ఎందుకు కుమ్మక్కయ్యాడనేది ప్రజలకు వదిలిపెట్టాలి. అది కులం కోసమా, డబ్బు కోసమా, తనని నియమించాడని విశ్వాసమా అనేది ప్రజల ఆలోచనలకు వదిలివేయాలి. ఒక్కోసారి తను కులం కోసమే కుమ్మక్కయ్యాడని అనుకున్నా ముఖ్యమంత్రి సామాజిక బాధ్యతాపరంగా అలా మాట్లాడి వుండాల్సింది కాదు. అటువంటి ఆరోపణలు ముఖ్యమంత్రి మీదకూడా అవతలివాళ్ళు చేస్తున్నారు. ఏదేమైనా కులం ప్రస్తావన ప్రత్యక్షంగా తీసుకురావటం ఎవరుచేసినా తప్పే (అది వాస్తవమైనా). ఇక అసలు విషయానికి వద్దాం.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నిక కమీషనర్ గా తీసివేయటం తప్పని హై కోర్టు తీర్పు ఇచ్చినమాట నిజమే. దానిపై సుప్రీం కోర్టు కెళ్ళే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి వుంది. చివరకు కోర్టు ఏం చెబితే అది అమలుచేయ్యాల్సి వుంటుంది. ఈ లోపు ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో క్లిప్పింగులు నిమ్మగడ్డ నిజాయితీ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. తెలుగుదేశం వర్ల రామయ్య చేత వితండవాదం చేపించటం చూస్తుంటే రాజకీయాలు ఎంత దిగజారేయో అర్ధమవుతుంది. ఎన్నికల కమీషనర్ గా వున్న వ్యక్తి ఒక ప్రైవేటు హోటల్ లో రహస్యంగా సుజనా చౌదరిని, కామినేని శ్రీనివాస్ ని  ఒక గదిలో కలవటం అనైతికం. వర్ల రామయ్య చేత ఎన్నైనా వాదనలు చేయించవచ్చు. ప్రజలు మాత్రం నిమ్మగడ్డ వీళ్ళతో కుమ్మక్కయ్యాడనే భావిస్తారు. ఒకవైపు నిమ్మగడ్డ తనకు తానే తన పదవిని పునరుద్ధరించుకున్న తర్వాత తన దృష్టిలో తను ఎన్నికల కమీషనరే కదా. అటువంటప్పుడు రహస్యంగా ఒక హోటల్ గదిలో కలవాల్సిన అవసరమేముంది? సాంకేతికపరంగా తప్పులేదని ఎవరైనా వాదించినా మనసాక్షిగా అది తప్పేనని వాళ్లకు తెలుసు. ఒక తప్పుని సమర్ధించుకోవటం కోసం జగన్ తప్పుల్ని ఏకరువు పెట్టటం సమర్ధనీయం కాదు. రెండోది, సాక్షి పత్రికకి ఈ క్లిప్పింగులు ఎలా వచ్చాయని మాట్లాడటంలో అర్ధం లేదు. పత్రికలు వార్తలు ఎలా సేకరించారో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లకు పూర్తి రక్షణ వుంది.

ఈ వార్త రాసేటప్పటికి బిజెపి వివరణ ఇవ్వలేదు. అసలే ఆంధ్రలో కునారిల్లుతున్న బిజెపికి ఇది దెబ్బే. దేశంలోనే అతి పెద్ద పార్టీ, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ  ఇలా అడ్డంగా దొరికిపోవటం దాని ప్రతిష్టకు పూర్తి దెబ్బనే. రాష్ట్రాల్లో తను అధికారంలో వున్నచోట రాజ్యసభ ఎన్నికల్లో , అధికారం కోసం ఇలా అనైతిక ప్రవర్తన కొత్తేమీ కాదు. కానీ ఇంకో పార్టీ నాయకుడి కోసం ఇలా చేయటం చూసిన వాళ్లకు ‘బిజెపి లో పచ్చ చొక్కాలు’ అని జగన్ పార్టీ ప్రచారం లో నిజమున్నదని అనుకోకుండా ఉండలేరు. ఇప్పటికైనా దీనిపై బిజెపి వివరణ ఇవ్వాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా ఈ ఘటన తో బిజెపి నాయకత్వానికి సంబంధంలేదని నిరూపించుకోవాలి. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కి, జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కి తెలిసే జరిగిందని ఆరోపిస్తున్నారు. అది కాదని నిరూపించుకోవాల్సిన అవసరం వుంది. సుజనా చౌదరి పై ఇప్పటికే ఎన్నో ఆర్ధిక ఆరోపణలు వున్నాయి. అటువంటి వ్యక్తిని వెనకేసుకురావటం బిజెపి ప్రజల్లో ఇప్పటికే చులకనయ్యింది. అలాగే ఇప్పటికైనా రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై బిజెపి అధినాయకత్వం నిర్ణయం తీసుకోవటం మంచిది. బిజెపి కనక సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ పై వేటు వేయకపోతే నష్టపోయేది బిజెపి నే. ప్రస్తుతం రాజ్యసభలో వై ఎస్ ఆర్ సి పి కి ఆరు రాజ్య సభ స్థానాలు వున్నాయి. సుజనా చౌదరి కోసం పాకులాడితే బిజెపి కి కీలకమైన ఈ ఆరు స్థానాలు దూరమయ్యే అవకాశముంది. కాబట్టి ఏ విధంగా చూసినా సుజనా చౌదరిని దూరంగా పెట్టటమే బిజెపి కి లాభం.

ఇకపోతే జనసేన పవన్ కళ్యాణ్ కూడా దీనిపై మౌనం వహించకూడదు. తన అభిప్రాయాన్ని వ్యక్తపరచాలి. రాజకీయాల్లో మురికిని కడుగుతానని వచ్చిన పవన్ కళ్యాణ్ దీనిపై స్పష్టమైన ప్రకటన ఇస్తేనే తన నిజాయితీ రాజకీయాలకి విలువ వుంటుంది. నిమ్మగడ్డ ప్రవర్తన  ఆ పదవి కి మచ్చ తెచ్చే విధంగా వుంది. ముందు ముందు ఈ పరిణామాలు ఎలా మారతాయో చూద్దాం.

Ram
Ramhttps://oktelugu.com/
An Independent Editor, Trend Stetting Analyst.
RELATED ARTICLES

Most Popular