Nominated posts  : నామినేటెడ్ పదవులపై కీలక అప్డేట్.. నేడు కీలక ప్రకటన.. మూడు పార్టీల్లో టెన్షన్!

కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు అవుతోంది. అధికారంలోకి వచ్చేందుకు కష్టపడిన నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో వాటి భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

Written By: Dharma, Updated On : August 19, 2024 1:40 pm

AP Nominated Posts

Follow us on

Nominated posts : ఏపీలో నామినేటెడ్ పదవుల సందడి ప్రారంభమైంది. కొద్దిరోజుల కిందటే ఇందుకు సంబంధించి కసరత్తు మొదలైంది. మూడు పార్టీలకు ప్రాధాన్యమిస్తూ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు పలుమార్లు డిప్యూటీ సీఎం పవన్ తో ఇదే విషయం చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రాధాన్యత క్రమంలో నామినేటెడ్ పోస్టుల ఎంపిక జరపనున్నట్లు తెలుస్తోంది. తొలి విడతగా 30 శాతం పదవులను ప్రకటిస్తారని సమాచారం. అందుకురేపటి దినాన్ని ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో మూడు పార్టీలకు ఎలా సర్దుబాటు చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. ఒక ఫార్ములా ప్రకారం ఈ పదవుల భర్తీ ఉంటుందని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు గత ఐదేళ్లుగా చాలామంది టీడీపీ నేతలు కేసులతో ఇబ్బంది పడ్డారు. ఆ కేసులను సైతం పరిగణలోకి తీసుకోనున్నారు. కొందరు టిడిపి నేతలు గత ఐదేళ్లుగా బయటకు పెద్దగా రాలేదు. నాటి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసే క్రమంలో కొందరు తమకు తాముగా హౌస్ అరెస్ట్ అయ్యారు. అటువంటి వారిని పరిగణలోకి తీసుకునే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఎవరైతే బయటకు వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేశారు వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఎవరున్నారు. మొన్నటి ఎన్నికల్లో వివిధ సమీకరణలతో టిక్కెట్లు కోల్పోయిన వారికి సైతం పదవులు కేటాయిస్తారని తెలుస్తోంది.నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కీలక పదవులపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. దశలవారీగా పోస్టులను ప్రకటించనున్నారు. తొలి దశ విడత పోస్టులను మంగళవారం ప్రకటించేలా ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు.

* టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు
ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీవీ 5 అధినేత బిఆర్ నాయుడు పేరు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. రకరకాల పేర్లు వచ్చినా చివరకు బిఆర్ నాయుడు వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. ఒకానొక దశలో ఉత్తరాంధ్ర నుంచి మాజీ మంత్రి కళా వెంకట్రావు పేరును పరిగణలోకి తీసుకున్నారు. కానీ కీలకమైన పదవులన్నీ ఉత్తరాంధ్రకు కేటాయించిన నేపథ్యంలో పునరాలోచనలో పడ్డారు. ఆది నుంచి టీటీడీ చైర్మన్ పోస్ట్ హామీ ఉండడంతో బిఆర్ నాయుడుకు కేటాయించినట్లు తెలుస్తోంది.

* కీలక పదవులకు ఎంపిక
మరోవైపు కీలక పదవుల ఎంపిక దాదాపు పూర్తయినట్లు సమాచారం. డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ గా జీవి రెడ్డి పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ చైర్మన్ గా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఏపీఐఐసీ చైర్మన్ గా ప్రవీణ్ కుమార్ రెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా పట్టాభి, ఎస్సీ కమిషన్ చైర్ పర్సన్ గా పీతల సుజాత, ఎస్టి కమిషన్ చైర్మన్ గా మాజీమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పేరు ప్రచారంలో ఉంది.అయితే చివరి నిమిషంలో సమీకరణలు మారవచ్చు. కొత్తవారు తెరపైకి రావచ్చు.

* కార్పొరేషన్ లకు భర్తీ
మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ గా ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గా వాసం మునియ్య పేర్లు ఖాయం చేసినట్లు తెలుస్తోంది. 90 వరకు కార్పొరేషన్లు ఉండగా.. అందులో డైరెక్టర్ పోస్టుల సైతం వందలాది గా ఉన్నాయి. వాటిలో సగానికి పైగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొన్ని కీలక కార్పొరేషన్లు జనసేనకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.కానీ జనసేనతో పోల్చుకుంటే బిజెపికి కేటాయింపులు అత్యల్పమేనని సమాచారం. మొత్తానికైతే రేపు నామినేటెడ్ పదవుల విషయంలో కీలక ప్రకటన రానుండడంతో మూడు పార్టీల శ్రేణులు ఒక రకమైన టెన్షన్ నడుస్తోంది.