https://oktelugu.com/

Fake Pentioners : ఆ 60 వేల మంది పింఛన్లు పోయినట్టే.. ఏపీ ప్రభుత్వం షాక్!

వరుసగా రెండు నెలల పాటు కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీ ని పూర్తి చేసింది.ఎటువంటి కోత లేకుండా పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందించింది.దీంతో అంతా రిలాక్స్ అయ్యారు.కోత ఉండదని భావించారు.అయితే వచ్చే నెలలో పింఛన్లలో భారీగా కోత ఉంటుందని ప్రచారం ప్రారంభమైంది.

Written By:
  • Dharma
  • , Updated On : August 19, 2024 / 01:54 PM IST

    Fake pentioners

    Follow us on

    Fake Pentioners : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ముఖ్యంగా పింఛన్ల మొత్తాన్ని పెంచి అందించింది. జూలై,ఆగస్టులో ఇంటింటా పింఛన్ల పంపిణీని విజయవంతంగా పూర్తి చేయగలిగింది. అయితే పెంచిన పింఛన్ మొత్తం ఐదేళ్లపాటు అందించాలంటే ప్రభుత్వంపై తప్పకుండా భారం పడడం ఖాయం. దీనికి తోడు బీసీలకు 50 సంవత్సరాలు దాటితే పింఛన్ అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు.ఆ హామీ తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే పింఛన్ల లబ్ధిదారులు భారీగా పెరిగే అవకాశం ఉంది. వైసిపి హయాంలో సామాజిక పింఛన్ మొత్తం మూడు వేల రూపాయలుగా ఉండేది. దివ్యాంగులకు 4000 పింఛన్ అందేది. తాము అధికారంలోకి వస్తే సామాజిక పింఛన్ మొత్తాన్ని 4 వేలకు పెంచుతానని చంద్రబాబు ప్రకటించారు. దివ్యాంగులకు 4000 నుంచి 6000 కు పెంచుతానని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసి నిలబెట్టుకున్నారు. అయితే ఇలానే ముందుకు సాగితే మాత్రం పింఛన్ల రూపంలోనే ప్రభుత్వంపై భారం తప్పదు. అందుకే పెన్షన్ లబ్ధిదారుల్లో అనర్హుల గుర్తింపు పై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది వివిధ కేటగిరిలో పెన్షన్లు అందుకుంటున్నారు. ముఖ్యంగా ఫేక్ సర్టిఫికెట్లతో దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నారన్నది ప్రధాన అభియోగం. ఇటువంటి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వే చేస్తోంది. నకిలీ ధృపత్రాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది దివ్యాంగులు పెన్షన్లు అందుకుంటున్నారు. ఇందులో 60 వేల మందికి పైగా ఫేక్ పత్రాలతో పింఛన్లు అందుకున్నారన్నది ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదు. వీరందరికీ వచ్చే నెలలో పింఛన్లు అందించడం డౌటే.

    * సెర్ఫ్ నివేదిక
    ప్రభుత్వానికి ఇటీవల సెర్ఫ్ ఒక నివేదిక ఇచ్చింది. 60 వేల మంది తిరిగి నిర్ధారణ పరీక్షలు జరుపుకోవాలని తేల్చింది. గత రెండు నెలలుగా పింఛన్ల పంపిణీలో చాలామంది అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం మారడంతో ఈ పింఛన్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చాయి. అటువంటి వారికి నోటీసులు జారీ అవుతున్నాయి. వైకల్యం నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు. అటువంటి వారంతా తమ దివ్యాంగ నిర్ధారణ పరీక్ష చేసుకొని అర్హత సాధించాల్సి ఉంటుంది. లేకుంటే మాత్రం పింఛన్లలో కోత తప్పదు.

    * ప్రభుత్వానికి ఫిర్యాదుల వెల్లువ
    చాలామంది నకిలీ ధ్రువపత్రాలతో పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. అందుకే ఇప్పుడు సర్వే చేస్తున్నారు. అటు దివ్యాంగ సర్టిఫికెట్ల జారీలో కొంతమంది వైద్యులు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అదే సమయంలో కూటమి పార్టీల నేతలు సైతం పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు. అనర్హుల జాబితాను రూపొందించి అధికారులతో పాటు తమ పార్టీ ప్రజాప్రతినిధులకు ఇస్తున్నారు. వాస్తవానికి గత నెలలోనే కొన్ని బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లు పొందుతున్న వారికి షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ఈనెల సైతం దివ్యాంగ పింఛన్లలో భారీగా కోత ఉంటుందని సమాచారం.

    * కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపు
    మరోవైపు కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలకు ముందు కొత్త పింఛన్లు అందించేందుకు వైసిపి ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఇంతలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు చంద్రబాబు సైతం 50 సంవత్సరాలు దాటిన బీసీలకు పింఛన్ అందిస్తానని హామీ ఇచ్చారు. దానికోసం చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్ నుంచి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.