Botsa Satyanarayana: సీనియర్ నేత బొత్స క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా? ఇకనుంచి తెర వెనుక రాజకీయాలకు పరిమితం కానున్నారా? వారసులను రంగంలోకి దించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. సుదీర్ఘకాలం విజయనగరం జిల్లాలో రాజకీయాలు చేసి ఎదిగారు బొత్స. ఉమ్మడి ఏపీ లోనే తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. పిసిసి అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. ఒకానొక దశలో ఆయన పేరు ముఖ్యమంత్రి పదవికి వినిపించింది. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యం, ఆపై అనారోగ్య పరిస్థితులు వంటి కారణాలతో యాక్టివ్ పాలిటిక్స్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వారసులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.
Also Read: వంగవీటి కుటుంబాన్ని చీల్చిన జగన్.. వర్కౌట్ అవుతుందా?
రాజులను ఎదుర్కొని రాజకీయం..
విజయనగరం జిల్లాలో( Vijayanagaram district ) రాజులను ఎదుర్కొని రాజకీయంగా ఎదిగారు బొత్స సత్యనారాయణ. ఒక సామాన్య పిఎసిఎస్ అధ్యక్షుడిగా ప్రస్థానం ప్రారంభించి.. అనతి కాలంలోనే రాజకీయంగా ఎదిగిన ఘనత ఆయనది. 1999లో బొబ్బిలి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన బొత్స 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జరిగిన పరిణామాలతో ఒకానొక దశలో ముఖ్యమంత్రి పదవికి బొత్స పేరు వినిపించింది. అయితే తరువాత క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ గూటికి చేరారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున గెలిచి మంత్రి అయ్యారు. ఐదేళ్లపాటు అదే పదవిలో కొనసాగారు. మొన్నటి ఎన్నికల్లో బొత్స ఓడిపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన సేవలను కొనసాగించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి.. ఎమ్మెల్సీ అయిన తర్వాత శాసనమండలిలో వైసిపి బాధ్యతలను ఇచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు బొత్స. అందుకే తాను పక్కకు తప్పుకొని వారసులను బరిలో దించాలని చూస్తున్నారు.
Also Read: ఉత్తరాంధ్రలో వారసులు రెడీ!
కొడుకు, కుమారుడు యాక్టివ్..
విజయనగరం జిల్లా బొత్స గుప్పెట్లో ఉంటుంది. ఆయన కుటుంబ హవా అంతలా ఉండేది. అయితే ఇటీవల కుటుంబంలో సైతం విభేదాలు వచ్చాయి. ఒకవైపు నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తిరుగుబాటు చేసినంత పని చేశారు. సొంత మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు సైతం పక్కలో బల్లెం లా మారారు. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యులుగా స్థిరపడిన కుమారుడు తో పాటు కుమార్తెను రంగంలోకి దించాలని బొత్స భావిస్తున్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. బొత్స మాత్రం చీపురుపల్లి నుంచి బరిలో దిగి ఓడిపోయారు. అందుకే వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి తన కుమార్తె అనూషను రంగంలోకి దిస్తారని తెలుస్తోంది. అందుకే ఆమె చీపురుపల్లి నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తున్నారు. ఆపై కుమారుడు సైతం రాజకీయంగా యాక్టివ్ కావాలని చూస్తున్నారు. అయితే బొత్స క్రియాశీలక రాజకీయాలకు దూరం అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్టమే. కానీ బొత్స ను ఉత్తరాంధ్రాస్థాయిలో వినియోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో..