Jagan splits Vangaveeti family: ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో కాపులు ఎప్పుడు ప్రత్యేక స్థానమే. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వారి ప్రస్తావన ప్రత్యేకంగా ఉంటుంది. వారి ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రకటనలు కూడా వస్తాయి. ఎందుకంటే ఏపీలో సంఖ్యా బలంగా కాపులు అధికం కాబట్టి. అందుకే వారిపై ప్రభావం చూపే ఏ అవకాశాన్ని రాజకీయ పార్టీలు విడుచుకోవు. కాపులు ఏ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. చాలా సందర్భాల్లో కూడా ఇది చూసాం. మిగతా సామాజిక వర్గాలకు భిన్నంగా ఉంటుంది కాపుల వైఖరి. సీఎం వంటి పోస్టులు దక్కలేదన్న ఆందోళన, ఆవేదన ఆ సామాజిక వర్గంలో ఉంది. అయితే దానిని కొంతవరకు నెరవేర్చారు పవన్ కళ్యాణ్. ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకొని డిప్యూటీ సీఎం హోదా వరకు వెళ్లారు. ఈ రాష్ట్రానికి ఏకైక డిప్యూటీ సీఎం గా ఉంటూ చంద్రబాబుతో సమానంగా తన పవర్ను వాడుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టిడిపి తో కలిసి వెళ్తారు. బిజెపిని కలుపుకొని పోటీ చేస్తారు. దీంతో కాపు సామాజిక వర్గం కూటమి వైపు తప్పకుండా ఉంటుంది. అయితే దానికి విరుగుడు చర్యలుగా జగన్మోహన్ రెడ్డి దిగ్గజ కాపు నేతల కుటుంబాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం ప్రారంభం అయింది.
ముద్రగడ ప్రయోగం విఫలం..
కాపులు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham). ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడిగానే కాకుండా కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా గుర్తింపు పొందారు. కాపులకు రాజకీయంగా ప్రాతినిధ్యం దక్కడంతో పాటు రిజర్వేషన్లు సైతం కల్పించాలని పోరాడారు. ఈ క్రమంలో ఆయన పోరాటం పక్కకు వెళ్ళింది. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి గా చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు. అయితే కాపుల్లో ముద్రగడ పద్మనాభం ప్రభావం క్రమేపి తగ్గింది అన్నది వాస్తవం. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడమే కాదు.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేశారు. పవన్ ఓడిపోకుంటే తాను పేరు మార్చుకుంటానని కూడా ప్రకటించారు. వైసీపీ దారుణంగా ఓడిపోవడంతో తన పేరు మార్చుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో రాజకీయాల్లో యాక్టివ్ తగ్గించారు.
నో చెప్పిన వంగవీటి రాధ..
అయితే ముద్రగడ ప్రయోగం విఫలం కావడంతో జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy) పునరాలోచనలో పడ్డారు. టిడిపిలో ఉన్న వంగవీటి మోహన్ రంగా కుమారుడు రాధాకృష్ణను వైసీపీలోకి రప్పించేందుకు ప్రయత్నించాడు. అవి వర్క్ అవుట్ కాకపోయేసరికి మోహన్ రంగ కుమార్తె ఆశాకిరణ్ వైపు చూసినట్లు తెలుస్తోంది. రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సీటును కానీ.. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వంగవీటి కుటుంబ అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అందుకే ఈ ఓపెన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి రంగా రాధా మిత్రమండలి ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టి.. 2029 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలని అంగీకారం కుదిరినట్లు సమాచారం.
కాపుల మద్దతు కీలకం..
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం మద్దతు జగన్మోహన్ రెడ్డికి చాలా అవసరం. ఎందుకంటే కాపులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తమ ఐకానిక్ లీడర్ గా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లో తమ సామాజిక వర్గ విజయాన్ని చూసుకుంటున్నారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ పాలనలో తమకు ఎదురైన పరిణామాలు కాపు సామాజిక వర్గానికి తెలుసు. అందుకే జగన్ ప్రయత్నాలు వర్క్ అవుట్ అయ్యే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కానీ వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశాకిరణ్ వైసీపీలో చేరితే మాత్రం అది కుటుంబాన్ని చీల్చినట్టే. వంగవీటి కుటుంబాన్ని చీల్చడం ద్వారా కొత్త విమర్శను ఆయన ఎదుర్కోవడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో..?