https://oktelugu.com/

ఆంధ్ర రాజకీయాల్లో బిజెపి ఎంటర్ అయినట్లే

ఇంతవరకు ఆంధ్ర రాజకీయాలు వైఎస్ ఆర్ సి పి, టిడిపి మధ్యనే తచ్చాడుతూ వస్తున్నాయి. సోము వీర్రాజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడయిన తర్వాత రాజకీయాలు చక చకా మారుతున్నాయి. ముందుగా జనసేన అధ్యక్షుడి ని కలిసి రెండు పార్టీలు మరింత కలిసికట్టుగా , చురుకుగా పనిచేయటానికి పావులు కదిపాడు. అలాగే లాక్ డౌన్ సమయంలో కూడా ఉత్తరాంధ్ర అంతా ఒక చుట్టు చుట్టి వచ్చాడు. ప్రతిరోజూ ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటూ వచ్చాడు. ఒకవిధంగా టివి […]

Written By:
  • Ram
  • , Updated On : September 22, 2020 1:40 pm
    Follow us on

    ఇంతవరకు ఆంధ్ర రాజకీయాలు వైఎస్ ఆర్ సి పి, టిడిపి మధ్యనే తచ్చాడుతూ వస్తున్నాయి. సోము వీర్రాజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడయిన తర్వాత రాజకీయాలు చక చకా మారుతున్నాయి. ముందుగా జనసేన అధ్యక్షుడి ని కలిసి రెండు పార్టీలు మరింత కలిసికట్టుగా , చురుకుగా పనిచేయటానికి పావులు కదిపాడు. అలాగే లాక్ డౌన్ సమయంలో కూడా ఉత్తరాంధ్ర అంతా ఒక చుట్టు చుట్టి వచ్చాడు. ప్రతిరోజూ ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటూ వచ్చాడు. ఒకవిధంగా టివి మాధ్యమాలు బిజెపి ని విస్మరించలేని విధంగా ఆంధ్ర రాజకీయాలు మారిపోయాయి.

    Also Read : వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?

    సోము వీర్రాజు అనుసరించిన వ్యూహం ఏంటి?

    ముందుగా కన్నా లక్ష్మీనారాయణ పై వచ్చిన తెలుగుదేశం బి టీం అనే భావన రాకుండా అడుగడుగునా జాగ్రత్తపడుతున్నాడు. అధికారం లో వున్న వైఎస్ ఆర్ సి పి ని విమర్శించేటప్పుడు దానితోపాటు ఖచ్చితంగా చంద్రబాబునాయుడు పై కూడా విమర్శనాస్త్రాలు సంధించటం విధిగా చేస్తున్నాడు. దానితో వైఎస్ ఆర్ సిపి  బిజెపి పై తెలుగుదేశం బి టీం అని చేసే ప్రచారం ప్రజల్లోకి పెద్దగా వెళ్ళటంలేదు. అదీగాక మొదట్నుంచీ సోము వీర్రాజు తెలుగుదేశం అధికారంలో వున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పై అరికాలు పై లేచి విమర్శలు చేస్తూనే రావటం తో ఆయన పై చంద్రబాబు చెబితే మాట్లాడుతున్నాడనే విమర్శ ప్రజలు నమ్మటం లేదు. కాబట్టి తను వైఎస్ ఆర్ సిపి పై చేసే విమర్శ స్వతంత్రంగానే చేస్తున్నాడని ప్రజల్లోకి వెళ్ళింది.

    రెండోది, వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఉదాహరణకు, అంతర్వేది రధం కాలిన సంఘటన పై తెలుగుదేశానికి అనుకూలమైన మీడియా విపరీత ప్రచారం కల్పిస్తే దానిపై వెంటనే కార్యాచరణ ప్రకటించి ప్రజల్లో సానుకూలత సంపాయించ గలిగాడు. ఇందులో బిజెపి-జనసేన కలిసికట్టుగా కార్యాచరణ ప్రకటించటం రాబోయే రోజుల్లో ఇద్దరూ కలిసి ఎలా ముందుకెళ్ళ బోతున్నారో సంకేతాలు వస్తున్నాయి. అలాగే కనకదుర్గ గుడి విగ్రహాల వ్యవహారం లో కూడా చొరవతో ముందు కెళ్ళారు. వీటన్నింటిలో ఎక్కడా తెలుగుదేశాన్ని కూడా వదిలి పెట్టటంలేదు.

    అలాగే ఇప్పుడొచ్చిన తిరుమల ఆలయ ప్రవేశం దగ్గర డిక్లరేషన్ ఇవ్వటం పై కూడా వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో జగన్ మోహన్ రెడ్డి ఆత్మ రక్షణ లో పడ్డట్లే అర్ధమవుతుంది. వాస్తవానికి అన్య మతస్తులు గుడిలో ప్రవేశించటానికి ఇటువంటి డిక్లరేషన్ అనాదిగా వస్తున్న ఆచారం. దాన్ని హేతువాద దృక్పధం తో చూస్తే తప్పుగా అనిపించటం సహజం. కాకపోతే ఇది చాలా సున్నితమయిన సమస్య. దీన్ని దేవాలయాల్లో దళితుల ప్రవేశం తో చూడరాదు. అక్కడ వాళ్ళూ హిందూ మతస్తులే కాబట్టి దానిపై అందరికీ అది దురాచారం అనే అభిప్రాయం వుంది. కానీ ఇక్కడ కొచ్చేసరికి అలా లేదు. అసలే ప్రస్తుతం మత సమీకరణలు ఎక్కువైన వాతావరణం లో ఈ హేతువాద దృక్పదం అంతగా ప్రజల్ని ఆకర్షించదు. ఇది మత విశ్వాసాలకు సంబంధించిన అంశం. ఇది ఇప్పుడు ఓ వివాదాంశం గా మారింది. దీనిలోనూ బిజెపి చురుకైన పాత్ర తీసుకుంది.

    Also Read : తొలి టీకాకు బ్రాండ్ అంబాసిడర్ భారతీయ మహారాణులే..!

    తిరుమల ఆలయ డిక్లరేషన్ వివాదం లో ఇమిడివున్న రాజకీయమేమిటి?

    ముందుగా ఇంతకుముందే చెప్పినట్లు మత విశ్వాసాలు అతి సున్నితమైనవి. జగన్ స్వతహాగా క్రైస్తవుడు కావటం తో ముందు ముందు ఈ అంశం రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశముందని మేము ఎప్పుడో చెప్పాము. దీనికి భౌతిక పునాది జగన్ అధికారం లోకి రాక ముందునుంచే పడింది. పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం కూడా వివాదాస్పద మైన విషయం అందరికీ తెలిసిందే. అలాగే తిరుమల కొండ పై అన్య మత ప్రచారం జరుగుతుందనే అంశం కూడా ఎప్పట్నుంచో వుంది. జగన్ అధికారం లోకి రాకముందే హిందూ సమాజం వీటిపై కొంత వరకు ఆలోచించటం మొదలుపెట్టాయి. మారిన సామాజిక పరిస్థితుల్లో హిందూ మతాధికారులు ఈ సమస్యలపై ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ నేపధ్యం లో క్రైస్తవుడైన జగన్ అధికారం లోకి రావటం తో ఈ సమీకరణలు మరింత పెరిగాయి.దానినుంచి వచ్చిందే ఈ డిక్లరేషన్ వివాదం.

    ఇందులో తెలుగుదేశం పాత్ర వుంది. మీడియా ఇంతగా ఈ అంశాన్ని ముందుకు తీసుకురావటం లో తెలుగుదేశం అనుకూల మీడియా పాత్ర ఎక్కువగా వుంది. అంటే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా జగన్ ని దెబ్బ తీయటానికి ఈ అంశాన్ని ముందుకు తెచ్చినట్లు తెలుస్తుంది. దీనివెనక అసలు ఉద్దేశం జగన్ క్రైస్తవుడని హిందువులు మెజారిటీగా వున్న సామాన్య ప్రజల్లోకి తీసుకెల్లాలనేది. చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యూహాలు పన్నటం లో దిట్ట అని అందరికీ తెలుసు. జగన్ కివ్యతిరేకంగా ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోడని ( అది మతపరమైన అంశమైనా) కూడా తెలుసు. అయితే దీనిలోంచి వచ్చే లబ్ది తనకు ఉపయోగపడుతుందా అంటే డౌటే. సోము వీర్రాజు మధ్యలో అడ్డున్నాడు. వాస్తవానికి ఈ ఎజండా తెలుగుదేశం కన్నా బిజెపి కి ఎక్కువ సూటవుతుంది. చంద్రబాబు పన్నాగం తో లబ్ది బిజెపి-జనసేన కి వెళ్ళే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు బిజెపి బలపడటానికి కావాల్సిన భూమిక ని చంద్రబాబు నాయుడు తీరుస్తున్నాడని అనుకోవాలి. ఒకసారి హిందూ సమీకరణ మొదలయితే దాన్ని ఆపటం కష్టం. పశ్చిమ బెంగాల్ లో ఇదే జరిగింది. అక్కడ మమతా బెనర్జీ హిందువు అయినప్పటికీ ఈ సమీకరణ జరిగింది. ఇక్కడ జగన్ క్రైస్తవుడు కావటంతో ఈ సమీకరణ సులువుగా జరిగే అవకాశం వుంది. మధ్యలో మతాధికారులు ఉండనే వున్నారు. కాబట్టి బిజెపి ఎంట్రీ ఆంధ్ర రాజకీయాల్లో మొదలైనట్లే కనిపిస్తుంది. ఇందులో అధిక నష్టం ముందుగా తెలుగుదేశానికి జరుగుతుంది. ఆ తర్వాత నే పోటీ వైఎస్ ఆర్ సిపి , బిజెపి – జనసేన మధ్యకు మారుతుంది. బిజెపి రాష్ట అధ్యక్షుడ్ని మార్చటం గుణాత్మక మార్పుకి దోహదం చేసిందని అనుకోవాలి.

    Also Read : అచ్చెన్నాయుడికి జ్ఞానోదయం కలిగిందా..?