HomeNewsArvind Kejriwal vs Modi: గుజరాత్‌ మోడల్‌ ముందు తేలిపోయిన ఢిల్లీ మోడల్‌.. మరి తెలంగాణ...

Arvind Kejriwal vs Modi: గుజరాత్‌ మోడల్‌ ముందు తేలిపోయిన ఢిల్లీ మోడల్‌.. మరి తెలంగాణ మోడల్‌ ఎక్కడ!?

Arvind Kejriwal vs Modi: దేశ రాజకీయాల్లో.. కొన్నేళ్లుగా రాష్ట్రాల అభివృద్ధిని చూపి ఓట్లు అడిగే సంప్రదాయం కొనసాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది సాధారణం. కానీ, ప్రస్తుతం డెవలప్‌మెంట్‌ మోడల్‌.. దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ నాటి లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌ మోడల్‌ను చూపి ప్రజల్లోకి వెళ్లారు. సక్సెస్‌ అయ్యారు. దేశంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు. 2019 ఎన్నికల్లో సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ నినాదంతో మళ్లీ ఎన్నికల్లోకి వెళ్లారు. ఈ నినాదం కూడా దేశ ప్రజలను ప్రభావితం చేసింది. నాడు జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఓటర్లు మరోమారు బీజేపీ వైపు మొగ్గేలా చేశాయి. మోదీ ప్రధాని అయినా గుజరాత్‌ అభివృద్ధిని మాత్రం ఆయన ఎన్నడూ విస్మరించలేదు. నిధుల కేటాయింపు, ప్రాజెక్టుల ఏర్పాటు విషయంలో సొంత రాష్ట్రానికి మోదీ అధిక ప్రాధాన్యం ఇస్తూ గుజరాత్‌ మోడల్‌ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.

Arvind Kejriwal vs Modi
Arvind Kejriwal vs Modi

ఢిల్లీ మోడల్‌ను తెరపైకి తెచ్చిన కేజ్రీవాల్‌..
ఇక నరేంద్రమోదీ తరహాలోనే రాజకీయాలు చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ 2013లో సామాన్యుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. నాటి ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ కొన్ని నెలలకే సంకీర్ణంలో విభేదాలతో ప్రభుత్వం కూలిపోయింది. దీంతో మళ్లీ ఎన్నికలకు వెళ్లిన కేజ్రీవాల్‌.. సొంతంగా అధికారంలోకి వచ్చారు. ఢిల్లీ అభివృద్ధిలో తనదైన ముద్రవేశారు. పాలనలోనూ కొత్తదనం చూపించారు. అవినీతి రహిత పాలన, ఉచిత విద్య, వైద్యం అందిస్తూ ఈ రెండు రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచారు. కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. సర్కారు వైద్యం మెరుగుపర్చారు. దీంతో తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఢిల్లీ మోడల్‌ను చూపుతూ అరవింద్‌ కేజ్రీవాల్‌ పలు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. గోవా, జార్ఖండ్‌ ఎన్నికల్లో ప్రభావం చూపారు. ఇక ఏడాది క్రితం జరిగిన పంజాబ్‌ ఎన్నికల్లో ఏకంగా అధికారంలోకే వచ్చారు. ఢిల్లీ మోడల్‌తోపాటు, అవినీతి రహిత పాలన పేరుతో పంజాబ్‌ ఓటర్ల మనసు గెలిచి అధికారం చేజిక్కించుకున్నారు.

గుజరాత్‌లో తేలిపోయిన ఢిల్లీ మోడల్‌..
అయితే ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఢిల్లీ మోడల్‌ తేలిపోయింది. నరేంద్రమోదీ గుజరాత్‌ మోడల్‌ ద్వారా ప్రధాని పీటం ఎక్కారు. ఈ నేపథ్యంలో 27 ఏళ్లు గుజరాత్‌తో అధికారంలో ఉన్న బీజేపీని ఢిల్లీ మోడల్‌ చూపి పంజాబ్‌ తరహాలో దెబ్బకొట్టాలని భావించారు. కానీ, గుజరాత్‌ ఓటర్లు ఢిల్లీ మోడల్‌ను విశ్వసించలేదు. కే జ్రీవాల్‌ ఎన్నికల సభలకు భారీగా జనం వచ్చినా.. ఓట్లు మాత్రం వేయలేదు. దీంతో కేవలం 5 ఎమ్మెల్యేలను మాత్రమే ఆప్‌ గెలిచింది. అయితే.. 12 శాతం ఓట్లు సాధించగలిగింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ ఎమ్మెల్యే సీట్లు గెలువకపోయినా ఆశించిన స్థాయి ఓట్లు సాధించింది.

Arvind Kejriwal vs Modi
Arvind Kejriwal vs Modi

తెలంగాణ మోడల్‌ ఎక్కడ?
దేశ రాజకీయాల్లో.. కీలక పాత్ర పోషించాలని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఈమేరకు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా అక్టోబర్‌ 5న మార్చారు. తెలంగాణ మోడల్‌ పేరుతో జాతీయ మీడియాలో వేల కోట్ల రూపాయలతో ప్రకటనలు కూడా ఇస్తున్నారు. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని, గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని కూడా గతంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రచారానికి తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలను పంపిస్తామని తెలిపారు. కానీ గుజరాత్‌ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లలేదు. దేశ రాజకీయాల్లో కూడా కేసీఆర్‌తో కలిసి వచ్చేందుకు ఏ పార్టీ కూడా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి పరిస్థితిలో గుజరాత్‌లో బీజేపీ రికార్డు స్థానాలతో మరోమారు అధికారంలోకి వచ్చింది. గుజరాత్‌లో ఢిల్లీ మోడల్‌ తేలిపోయిన ప్రస్తుత పరిస్థితిలో దేశ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కేసీఆర్‌ తెలంగాణ మోడల్‌ను ఎలా దేశ రాజకీయాల్లోకి తీసుకెళ్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. మరి కేసీఆర్‌ ఏం చేస్తారో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version