https://oktelugu.com/

రాముడి కోసం, దేశం కోసం ఆ మాత్రం త్యాగం చేయలేరా?

బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటనలో సిబీఐ కోర్టు ముద్దాయిలందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. వీళ్ళు ఓ పధకం ప్రకారం కూల్చివేత చేపట్టినట్లు సిబీఐ సాక్ష్యాధారాలు చూపించ లేకపోయిందని చెప్పింది. మరి ఎటువంటి ముందు పధకం లేకుండా వచ్చి వుంటే అంత పెద్ద కట్టడం దానంతట అదే కూలిపోదు కదా? వచ్చిన  వాళ్ళు ఉత్త చేతులతోనే అంత పెద్ద కట్టడాన్ని కూల్చి వేయలేరు కదా? ఈ ప్రశ్నలు సామాన్యులు, న్యాయ పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా అడుగుతున్నారు. జవాబు […]

Written By:
  • Ram
  • , Updated On : October 4, 2020 / 08:29 AM IST
    Follow us on

    బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటనలో సిబీఐ కోర్టు ముద్దాయిలందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. వీళ్ళు ఓ పధకం ప్రకారం కూల్చివేత చేపట్టినట్లు సిబీఐ సాక్ష్యాధారాలు చూపించ లేకపోయిందని చెప్పింది. మరి ఎటువంటి ముందు పధకం లేకుండా వచ్చి వుంటే అంత పెద్ద కట్టడం దానంతట అదే కూలిపోదు కదా? వచ్చిన  వాళ్ళు ఉత్త చేతులతోనే అంత పెద్ద కట్టడాన్ని కూల్చి వేయలేరు కదా? ఈ ప్రశ్నలు సామాన్యులు, న్యాయ పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా అడుగుతున్నారు. జవాబు చెప్పాల్సిన బాధ్యత మనందరిపై వుంది. ఈ కేసు పర్యవసానాన్ని ఎలా చూడాలి?

    టివి చర్చల్లో ఎక్కువమంది చేస్తున్న వాదన ఇప్పటికే రామజన్మ భూమి వివాదం పై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ కట్టడం కూల్చివేత కేసుకు బలం లేదని వాదిస్తున్నారు. బిజెపి అధికార ప్రతినిధులతో పాటు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే వాదన చేయటం ఆశ్చర్యంగా వుంది. అసలు ఈరెండింటికి పొంతనలేదని సుప్రీం కోర్టు తీర్పులోనే చెప్పినప్పుడు మరలా అదే వాదన చేయటం లో ఔచిత్యం వీరి విజ్ఞతకే వదిలేస్తున్నాను. దీనిపై ఎంత మరిచిపోదామన్నా పదే పదే దేశ భవిష్యత్తు గుర్తుకొస్తుంది. అందుకే దీనిపై ఇంగ్లీష్ సంపాదకీయం రాసినా తిరిగి అదే సబ్జెక్టు పై తెలుగులో రాయాల్సివస్తుంది.

    రామజన్మ భూమి ఉద్యమానికి మూలాలు 

    రామ జన్మ భూమి పై ఇప్పటికే సుప్రీం కోర్టు తీర్పు వెలువడటం తో ఆ వివాదం సుఖాంతం కావటం సంతోషాన్నిచ్చింది. వాస్తవానికి ఈ తీర్పు ఇలా రావాలని నేనూ మనసులో కోరుకున్నాను. అదే ఇంతకుముందు సంపాదకీయాల్లో కూడా రాసాము. ఎందుకంటే నూరు కోట్లకు పైగా వున్న భక్తుల విశ్వాసాన్ని పరిగణన లోకి తీసుకోపోతే దేశం శాంతియుతంగా ఉండజాలదు. అదృష్టవశాత్తు దానికి తగిన ఆధారాలు ఆర్కియాలజీ విభాగం ఇవ్వటం తీర్పుకి ఊతం ఇచ్చినట్లయ్యింది. అసలు ఈ సమస్య ను రెండు వర్గాలు ఎప్పుడో శాంతియుతంగా పరిష్కరించుకొని వుండాల్సింది.

    ముస్లిం ప్రజానీకం కూడా దీనిపై ప్రశాంతంగా ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. చరిత్రని మనం చరిత్రగానే చూడాలి. వేల దేవాలయాలు ముస్లిం పరిపాలనలో కూల్చివేసిన చరిత్ర దాచిపెడితే దాగేది కాదు. అయితే దానికి ఇప్పుడున్న ముస్లిం ప్రజానీకం బాధ్యులు కాదు. అంతమాత్రాన ఆ చరిత్ర లేపిన గాయాలు వర్తమానంలో మెజారిటీ ప్రజల్లో బలంగా నాటుకు పోయాయని మరిచిపోవద్దు. దీనికి పరిష్కారం ఏమిటి? ఇద్దరూ శాశ్వతంగా ఘర్షణ పడటమేనా? రాజీ మార్గం కోసం అందరూ ప్రయత్నం చేయటం ఒక్కటే మనముందున్న కర్తవ్యం కాదా? హిందువులు అప్పుడు జరిగిన చరిత్రనంతా తుడిచివేయాలని కోరుకోవటంలేదు. వాళ్లకు ఆరాధ్య దైవమైన రాముడు, కృష్ణుడు, శివుడు లకు సంబంధించిన స్థలాల్ని కావాలని కోరారు. వేల దేవాలయాలు తిరిగి పునరుద్ధరించమని కోరలేదు కదా? ఉదాహరణకు మక్కా, మసీదు, జెరూసలెం ముస్లిం లకు పవిత్ర స్థలాలు. వాటి జోలికి ఎవరైనా వస్తే ప్రాణాలు త్యాగం చేసయినా కాపాడుకుంటారు కదా. ఇప్పటికీ మూడు మతాలకు పవిత్ర స్థలమైన జెరూసలెం కోసం ఘర్షణలు జరుగుతూనే వున్నాయి కదా. అటువంటప్పుడు హిందువుల మనోభావాల్ని అర్ధం చేసుకొని ముస్లింలు రాజీ కి వచ్చి వుంటే ఈ సమస్య ఎప్పుడో పరిష్కారమయ్యేది. ఈ మూడు స్థలాలు ముస్లింలకు మతపరంగా ముఖ్యమైనవేమీ కాదు. అటువంటప్పుడు  మిగతా వాటి జోలికెల్లమని హిందూ మత పెద్దల  రాతపూర్వక హామీతో సమస్యను పరిష్కరించుకొని వుండాల్సింది.

    ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఏ దేశంలో నైనా  మెజారిటీ మతస్తుల మనోభావాల్ని పరిగణన లోకి తీసుకోపోతే అశాంతి పెరుగుతూనే వుంటుంది. ఇది అన్ని దేశాలకి వర్తిస్తుంది. ఈ కనీస పరిజ్ఞానం లేకుండా పాలకులు సెక్యులరిజం పేరుతో కప్పిపుచ్చాలని చూస్తే ఏదో ఒకరోజు మెజారిటీ మతస్తుల్లో అశాంతి చెలరేగి తిరుగుబాటుకి దారితీస్తుంది. ఈ వివాదం లో కూడా ఇదే జరిగింది. వాళ్ళ మనో భావాల్ని అర్ధం చేసుకోకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు పరిపాలన చేసిన పర్యవసానమే సాంస్కృతిపరంగా బాబ్రిమసీదు కూల్చివేత, రాజకీయంగా బిజెపి అధికార పగ్గాలు చేపట్టటం. ఇటీవలికాలంలో టర్కీ లో ఏం జరిగింది? హాగియా సోఫియా మ్యూజియాన్ని టర్కీ అధ్యక్షుడు ఎర్డగోవన్ మసీదుగా మార్చాడు. అది వాస్తవానికి తూర్పు రోమన్ సామ్రాజ్య పాలకులు నిర్మించిన చర్చి. తర్వాత ఎప్పుడో అధికారం చేపట్టిన ఒట్టమాన్ ముస్లిం పాలకులు చర్చిని మసీదుగా మార్చారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అధికారం చేపట్టిన కమాల్ అటాటుర్క్ దాన్ని ఎటువంటి వివాదం లేకుండా మ్యూజియం గా మార్చాడు. కానీ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఎర్డ్ గోవన్ దాన్ని తిరిగి మసీదుగా ఇటీవలే మార్చటం జరిగింది. అలాగే సున్నీలు మెజారిటీగా వున్న పాకిస్తాన్ లో షియాలను కాఫిర్లుగా ప్రకటించాలని ఇంత మహమ్మారి సమయంలో కూడా వేలాదిమంది సున్నీలు కరాచీ లో ప్రదర్శన తీసారు. యూరప్ లో సెర్బియా అధీనంలో వున్న బోస్నియా ముస్లింలు తమ స్వాతంత్రం కోసం అతి పెద్ద యుద్ధమే చేసారు. అమెరికా, నాటో సాయంతో స్వాతంత్రం సంపాదించుకున్నారు. అంతెందుకు    భారతీయ ముస్లింలు పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో మెజారిటీగా ఉండటంతో స్వాతంత్రం పొంది ప్రత్యేక దేశాలుగా కొనసాగుతున్నాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సమస్యని అన్ని కోణాలనుంచి ఆలోచించినప్పుడే పరిష్కారం దొరుకుతుంది.

    ఇక్కడ సమస్య రామజన్మ భూమి కాదు, చట్ట ఉల్లంఘన 

    సరే అసలు విషయానికి వద్దాం. బాబ్రీ మసీదు కూల్చివేత కి హిందువుల్లో చెలరేగిన అసంతృప్తి కారణ మనుకున్నా దానికి అనుసరించిన పధ్ధతి సరికాదు. చట్ట ఉల్లంఘనతో కట్టడాన్ని కూల్చటం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. స్వాతంత్రపోరాటం లో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపిచ్చాడు. కారణం మనన్ని పరిపాలిస్తున్న బ్రిటీషువారు పరాయివారు కాబట్టి. కానీ ఇప్పుడు మనకు మనమే పరిపాలించు కుంటున్నాము. మన రాజ్యాంగాన్ని మనమే గౌరవించు కోకపోతే ఈ వ్యవస్థలు, చట్టాలు ఎందుకు? కేసు కోర్టుల్లో వున్నప్పుడు బలవంతంగా న్యాయాన్ని హైజాక్ చేయటం నేరమే. గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమం తర్వాత ఎందుకు ఓపిగ్గా ఎదురుచూశాడు. మనం కోరుకుంటున్నది న్యాయమైనప్పుడు దానికోసం ఎంత పట్టుదలతో పనిచేయాలో అంతే పట్టుదలతో అనుసరించే మార్గాల్లోనూ రాజీ పడకూడదు.

    రాముడి కోసం , రామ జన్మ భూమి కోసం ఎన్నో దశాబ్దాలు పోరాటం చేసిన వాళ్ళు కోర్టు తీర్పుకోసం ఎదురుచూసివుండాల్సింది. అది కాకుండా మన చట్టాల్ని వుల్లంఘించాలనుకున్నప్పుడు దాని పర్యవసానాలు కూడా అనుభవించటానికి సిద్ధపడాలి. గాంధీజీ శాసనోల్లంఘన చేస్తే శిక్ష అనుభవించాడు కదా. మీరు రాముడు కోసం ఆ పని చేసినప్పుడు ధైర్యంగా ఒప్పుకొనివుండాల్సింది. అలా చేయకుండా ప్రభుత్వంలో వుండి ప్రాసిక్యూషన్ ని ప్రభావితం చేసి వుంటే అది దేశానికే ప్రమాదం. మనం సృష్టించుకున్న వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతే పర్యవసానం దారుణంగా వుంటుంది. దానివలన ప్రత్యామ్నాయ  వ్యవస్థల మీద, తీవ్రవాద భావజాలం వైపు ప్రజలు మల్లే అవకాశం వుంది. బాబ్రీ మసీదు కూల్చివేత రహస్యంగా జరిగే పనికాదు. వేలజనం కట్టడం ఎక్కి కూల్చటం కెమెరాల్లో బంధించబడింది. వాదనకోసం, చార్జిషీట్ దాఖలుచేసిన షుమారు 50 మందికి తెలియకుండా జరిగిందే అనుకుందాం. కానీ కూల్చినవాళ్ళు నాయకులు చేసిన ప్రసంగాలకు ఉత్తేజితులై వచ్చినవాళ్ళే కదా. నైతికంగా నైనా వీళ్ళకు బాధ్యత ఉందా, లేదా? ఇదే గాంధీజీ అయితే ఏమనేవాడు నా వలనే ఇది జరిగింది, దీనికి బాధ్యత నేనే వహిస్తున్నానని అనేవాడా కాదా? నాయకులు మిగతావాళ్లకు ఆదర్శంగా వుండాలి. రామజన్మ భూమికి జీవితమంతా తపించినప్పుడు బాబ్రీ కూల్చివేతకు కూడా బాధ్యత వహించి వుండాల్సింది. కనీసం నైతిక బాధ్యత వహించి సింబాలిక్ గా నైనా శిక్షకు సిద్ధపడకపోగా తీర్పు చరిత్రాత్మకమని చెప్పటం  వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళే కించపరుచుకున్నట్లయ్యింది. దీనివలన నష్ట పోయింది వాళ్ళ వ్యక్తిత్వమే కాదు, దేశం. వ్యవస్థలు, చట్టాల మీద ఒకసారి నమ్మకం పోతే తిరిగి తీసుకురావటం ఎంత కష్టమో వాళ్లకు తెలియంది కాదు. రాముడి కోసం, దేశం కోసం ఈ మాత్రం త్యాగం చేయలేకపోవటం శోచనీయం.