ఫిబ్రవరి 14 ప్రేమికులకు మధురమైన జ్ఞాపకాలను మిగిల్చే రోజు.. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మాత్రం రాజకీయంగా ముందడుగు వేసే రోజు. ఐదేళ్ల క్రితం ఇదే రోజున రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన, ఈ సారి కూడా ఆ రోజునే మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్దపడుతున్నారు.
2013 డిసెంబర్ లో మొదటిసారిగా ఎన్నికలలో ఢిల్లీ నుండి పోటీ చేసినప్పుడు 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆప్ ఆవిర్భవించింది. 8 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్ తో కలసి మొదటిసారిగా ముఖ్యమంత్రిగా డిసెంబర్ 28న ప్రమాణస్వీకారం చేశారు.
అయితే 49 రోజులకే కాంగ్రెస్ తో ఇముడలేక పదవికి రాజీనామా చేయాలని 2014 ఫిబ్రవరి 14న, ప్రేమికుల రోజున నిర్ణయించుకొని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఒక విధంగా బలమైన నేతగా ఎన్నిక కావడానికి ఈ రాజీనామా తోడ్పడినదని చెప్పవచ్చు. తిరిగి 2015 ఫిబ్రవరి 7న ఎన్నికలు జరుగగా, ఫిబ్రవరి 10న జరిగిన ఓట్ల లెక్కింపులు 70 సీట్లలో 67 సీట్లను గెల్చుకొని అఖండ విజయం సాధించారు.
జనవరి 12న ఎన్నికల ప్రకటన జరిగిన రోజుననే కేజ్రీవాల్ ఫిబ్రవరి 14న చారిత్రాత్మక రాంలీలా మైదాన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చేద్దా ప్రకటించారు. ఆ విధంగా ఆయన అదే రోజున ప్రమాణస్వీకారం చేశారు.
సరిగ్గా సంవత్సరం తర్వాత, ఫిబ్రవరి 14, 2016న కెజివాల్ ఒక ట్వీట్ ఇస్తూ “గత సంవత్సరం ఢిల్లీ ప్రజలు ఆప్ తో ప్రేమలో పడ్డారు. ఈ బంధం చిరకాలంగా కొనసాగుతుంది” అంటూ ప్రేమికుల రోజు ప్రాధాన్యతను వెల్లడించారు.
తిరిగి ఐదేళ్ల తర్వాత, ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగడం, ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరగడంతో తిరిగి అదే రోజున ఫిబ్రవరి 14న ప్రమాణస్వీకారం చేయడానికి సిద్దపడుతున్నారు.