Kargil War: కార్గిల్ విజయ్ దివస్.. ఏటా జూలై 26న జరుపుకుంటున్నాం. తాజాగా 26వ కార్గిల్ దివస్ జరుపుకున్నాం. పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయానికి గర్వంగా, అమరులైన భారత సైనికుల జ్ఞాపకార్థం దీనిని జరుపుకుంటున్నాం. అయితే.. అసలు ఈ కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది. భారత ప్రధాని పాకిస్తాన్లో పర్యటించిన కొన్ని రోజులకే యుద్ధం జరగడానికి కారకులు ఎవరు, యుద్ధానికి పాకిస్తాన్ ప్రధానికి తెలియకుండా ప్రణాళిక రూపొందించింది ఎవరు అనేది చాలా మందికి తెలియదు. ఈ కార్గిల్ యుద్ధానికి, 1971 యుద్ధానికి కూడా సంబంధం ఉంది.
Also Read: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ… విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చా?
1999 ఫిబ్రవరిలో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య జరిగిన లాహోర్ ఒప్పందం ద్వైపాక్షిక శాంతి, సహకారానికి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. అయితే, ఈ ఒప్పందం జరిగిన కొద్ది నెలల్లోనే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషరఫ్ రహస్యంగా కార్గిల్ యుద్ధానికి వ్యూహరచన చేశాడు. నవాజ్ షరీఫ్‌కు తెలియకుండానే, ముషరఫ్ ఈ ఆపరేషన్‌ను ప్రణాళికాబద్ధంగా నడిపాడని ఆధారాలు సూచిస్తున్నాయి. 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఓటమి, 95 వేల మంది పాక్ సైనికులు భారత్‌లో యుద్ధ ఖైదీలుగా పట్టుబడటం ముషరఫ్లో భారత్‌పై కసిని రగిల్చాయి. ఈ ఓటమి అతన్ని కార్గిల్‌లో దుశ్చర్యకు ప్రేరేపించిందని పలువురు పేర్కొంటున్నారు.
కార్గిల్‌లో చొరబాటు..
1999 శీతాకాలంలో, పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాద సమూహాలు కార్గిల్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఉన్న భారత భూభాగంలోకి చొరబడ్డాయి. కఠినమైన శీతాకాలంలో భారత సైనికులు సాధారణంగా వెనక్కి వెళ్లే గుట్టలపై పాక్ సైనికులు స్థానాలను ఆక్రమించారు. ఈ చొరబాటును మొదట గుర్తించింది ఒక స్థానిక గొర్రెల కాపరి, తాషీ నామ్‌గ్యాల్. అతను భారత సైన్యానికి సమాచారం అందించడంతో, పాకిస్తాన్ యొక్క రహస్య ఆపరేషన్ బయటపడింది. అప్పటికే పాక్ సైనికులు టైగర్ హిల్, టోలోలింగ్ వంటి కీలక ఎత్తైన ప్రాంతాలను ఆక్రమించారు, ఇది భారత్‌కు తీవ్ర సవాలుగా మారింది.
భారత్ వీరోచిత ప్రతిస్పందన..
పాకిస్తాన్ చొరబాటును ఎదుర్కొనేందుకు భారత ప్రధాని వాజ్‌పేయి ఆదేశాలతో, భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్‘ను ప్రారంభించింది. కఠినమైన భౌగోళిక పరిస్థితులు, ఎత్తయిన పర్వత శిఖరాలు, శత్రువు బలమైన స్థానాలు ఉన్నప్పటికీ, భారత సైనికులు అసాధారణ ధైర్యంతో పోరాడారు. భారత వైమానిక దళం మద్దతుతో, సైన్యం కీలకమైన గుట్టలను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే వంటి భారత సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేసి, దేశ గౌరవాన్ని నిలబెట్టారు. జూలై 26, 1999 నాటికి భారత్ పూర్తిగా కార్గిల్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది, దీనిని ఇప్పటికీ ‘కార్గిల్ విజయ దివస్‘గా జరుపుకుంటారు.