Trump Comments On India: భారత్ అమెరికాకు మంచి మిత్రదేశం.. ప్రధాని నరేంద్రమోదీ నాకు మంచి మిత్రుడు అంటూ.. ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తనను నోబెల్ శాంతి బహుమతికి ప్రపోజ్ చేయలేదన్న అక్కసుతో భారత్‌పై సుంకాలు విధించారు. దీంతో 28 ఏళ్ల బంధాని‍్న ఒక్క కలం పోటుతో బలహీనపర్చారు. దీంతో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేసిస్తోంది. ఈ క్రమంలో చైనాకు దగ్గరైంది. ఇటీవల భారత్, రష్యాలు చైనాతో చేతులు కలిపాయి. ఇది ట్రంప్‌కు మింగుడు పడడం లేదు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశం తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలిసి ఉన్న ఫొటోను ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ, భారత్, రష్యాలను “కోల్పోవడం” గురించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా సంబంధాల్లో ఇటీవలి ఒత్తిళ్లను, ముఖ్యంగా వాణిజ్య విధానాలు, రష్యాతో భారత్ ఇంధన ఒప్పందాలపై ట్రంప్ విధించిన ఆంక్షలను సూచిస్తున్నాయి.
భారత్ వ్యూహాత్మక నిర్ణయాలు..
తియాంజిన్‌లో జరిగిన ఎస్‌సీవో సమావేశం భారత్, చైనా, రష్యాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే వేదికగా మారింది. ఈ సమావేశంలో మోదీ, జిన్పింగ్, పుతిన్ మధ్య స్నేహపూర్వక సంభాషణలు, సహకార ఒప్పందాలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించాయి. భారత్‌కు చైనాతో సరిహద్దు వివాదాలు, రష్యాతో చారిత్రక స్నేహం ఉన్నప్పటికీ, ఈ సమావేశం భారత్ తన వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడుకుంటూ, అమెరికా ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. మోదీ ఏడేళ్ల తర్వాత చైనాకు వెళ్లడం, సరిహద్దు వివాదాలపై చర్చలు జరపడం భారత్-చైనా సంబంధాల్లో మెరుగుదలకు సంకేతంగా కనిపిస్తోంది.
భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం..
ట్రంప్ పరిపాలన భారత్‌పై 50% సుంకాలను విధించడం, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిషేధించాలని ఒత్తిడి చేయడం భారత్-అమెరికా సంబంధాల్లో ఒడిదొడుకులకు కారణమైంది. ఈ సుంకాలు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. దీనివల్ల ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉంది. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించడం ఆర్థికంగా, రాజకీయంగా ఆమోదయోగ్యం కాదని భావిస్తోంది, ఎందుకంటే రష్యా భారత్‌కు మిత్రదేశంగా ఉంది. ఈ పరిస్థితుల్లో, భారత్ చైనా, రష్యాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా అమెరికా ఒత్తిడికి వ్యతిరేకంగా సమతుల్యతను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. భారత్ ఎల్లప్పుడూ తన విదేశాంగ విధానంలో స్వతంత్రతను కొనసాగించింది. అమెరికాతో సంబంధాలు ముఖ్యమైనవి అయినప్పటికీ, ట్రంప్ విధానాలు భారత్‌ను ఇతర దేశాలతో సహకారాన్ని పెంచుకునే దిశగా నడిపిస్తున్నాయి. ఎస్‌సీవో సమావేశంలో చైనా, రష్యాలతో భారత్ సహకారం ఒక కొత్త ప్రపంచ రాజకీయ వ్యవస్థకు సంకేతంగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు ట్రంప్‌ను ఒత్తిడికి గురిచేస్తోంది.
ట్రంప్ కాళ్లబేరం..
మోదీని కాళ్లబేరానికి రప్పించుకోవాలని డొనాల్డ్‌ట్రంప్ ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ట్రంపే కాళ్ల బేరానికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే అమెరికా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ‍్యంలోనే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ట్రంప్ ఇప్పుడు తన సొంత సోసల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా మోదీ, పుతిన్, జిన్‌పింగ్ కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేసి భారత్, రష్యాను కోల్పోయామని పేర్కొన్నారు. అయితే ఈ ఒడిదుడుకులు తాత్కాలికమే అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇరుదేశాలు పరిష్కార మార్గాలు అన్వేషించాలని సూచిస్తున్నారు.