Donald Trump Threats: వీధిలో ఏనుగులు వెళ్తుంటే.. కుక్కలు విపరీతంగా మొరుగుతుంటాయి. వీలైతే ఏనుగుపై దాడిచేద్దామని వెనక పరిగెత్తుతుంటాయి. ఏనుగులకు చికాకు తెప్పిస్తుంటాయి. కానీ, ఏనుగులు వాటి అరుపులకు కోపం తెచ్చుకోవు. లైట్ తీసుకుంటూ ముందుకు వెళ్తుంటాయి. అయితే ఓపికకు కూడా హద్దు ఉంటుది. సైలెంట్‌గా ఉంటున్నాయని రెచ్చిపోతే.. తొండంతో ఎత్తి అవతల పడేస్తాయి.. ఈ వాస్తవం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సరిగ్గా సరిపోతుంది. తాను విధించిన 25 శాతం సుంకాలపై భారత్ కనీసం స్పందించలేదు. తమకు తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమని ఒక ప్రకటన చేసి వదిలేసింది. ఇక మోదీ కూడా నేషన్ ఫస్ట్ అని నినదించారు. పరోక్షంగా ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఓపిక పడుతున్నామని ట్రంప్ మళ్లీ సుంకాలు విధిస్తామని ప్రకటించారు. దీనిని కూడా భారత్ లైట్ తీసుకుంది. వాస్తవం ఏంటంటే.. ఇండియా డొనాల్డ్ ట్రంప్‌ను అసలు లెక్కలోకే తీసుకోవడం లేదు. కానీ చికాకు తెప్పిస్తే మాత్రం.. ఏనుగు తరహాలో.. ఎత్తి అవతల పడేసే ప్రమాదం కూడా ఉంది.
Also Read: ‘హైదరాబాద్’ నుంచి ‘ఏపీ పాలన’!?
ట్రంప్ సుంకాల బెదిరింపు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25% ప్రతీకార సుంకాలను విధించడంతోపాటు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అదనపు జరిమానాలను విధిస్తామని హెచ్చరించారు. భారత ఆర్థిక వ్యవస్థను ‘‘డెడ్లీ’’గా అభివర్ణిస్తూ, సుంకాలను మరింత పెంచుతామని ప్రకటించారు. అయితే, భారత ప్రభుత్వం ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకోకుండా, జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక రక్షణకు ప్రాధాన్యమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ట్రంప్ పేరును ప్రస్తావించకుండానే, తమ దేశ ఆర్థిక వ్యూహాలు ప్రజల సంక్షేమం కోసమేనని కేంద్రం ప్రకటించింది. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకోవడం దేశ ఆర్థిక స్థిరత్వం కోసమేనని స్పష్టం చేసింది.
పశ్చిమ దేశాల ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం..
ట్రంప్ భారత్‌పై రష్యా చమురు కొనుగోలును తప్పుబడుతున్నప్పటికీ, పశ్చిమ దేశాలు కూడా రష్యా నుంచి వివిధ వస్తువులను దిగుమతి చేసుకుంటున్న వైరుధ్యాన్ని భారత్ ఎత్తి చూపింది. 2022లోనే ఈ ద్వంద్వ వైఖరిపై భారత్ నిరసన తెలిపింది. పశ్చిమ దేశాలు తమ సమస్యలను అంతర్జాతీయ సమస్యలుగా చిత్రీకరిస్తూ, ఇతర దేశాల సమస్యలను వ్యక్తిగతమైనవిగా చూపడం ద్వారా అన్యాయం చేస్తున్నాయని భారత్ విమర్శించింది. రష్యా నుంచి చమురు దిగుమతులు ప్రపంచ చమురు ధరల స్థిరత్వానికి దోహదపడ్డాయని, ఇది అమెరికా సహా పశ్చిమ దేశాలకు కూడా ప్రయోజనకరమని భారత్ తెలిపింది.
అమెరికా ప్రజలపైనే భారం..
ట్రంప్ సుంకాల విధానం భారత ఎగుమతులపై ప్రభావం చూపినప్పటికీ, దీర్ఘకాలంలో అమెరికా ప్రజలే నష్టపోయే అవకాశం ఉంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే రత్నాలు, వజ్రాలు, ఫార్మసూటికల్, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులపై ధరలు పెరగడంతో అమెరికా వినియోగదారులపై ఆర్థిక భారం పడనుంది. ముఖ్యంగా, వజ్రాల పాలిషింగ్‌లో భారత్ ఆధిపత్యం కలిగి ఉండటం వల్ల, సుంకాలు అమెరికా మార్కెట్‌లో ధరల పెరుగుదలకు దారితీయవచ్చు. ఇది అమెరికా ప్రజలలో ట్రంప్‌పై అసంతృప్తిని పెంచే అవకాశం ఉంది, ఇది రాజకీయంగా కూడా ఆయనకు నష్టం కలిగించవచ్చు.
ఆత్మనిర్భర్ భారత్..
ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో భారత్ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆగస్టు 2న వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ ‘‘నేషన్ ఫస్ట్’’ పిలుపునిచ్చారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను, స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించాలని, ‘లోకల్ టూ గ్లోబల్’ దిశగా మార్కెట్‌ను విస్తరించాలని సూచించారు. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు గ్రాంట్–ఇన్–ఎయిడ్ ద్వారా 13,288 సహకార సంస్థలను బలోపేతం చేసేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది, దీని ద్వారా 2.8 కోట్ల మంది భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ చర్యలు భారత ఆర్థిక వ్యవస్థను బలపరిచే దిశగా అడుగులు వేస్తున్నాయి.
నెరవేరని ట్రంప్ లక్ష్యం..
ఇదిలా ఉంటే.. ట్రంప్ భారత్‌ను రష్యా నుంచి వేరు చేయాలనే లక్ష్యంతో ఒత్తిడి తెస్తున్నప్పటికీ, భారత్ తన దీర్ఘకాల సంబంధాలను, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటోంది. రష్యా నుంచి చమురు దిగుమతులు ఆర్థిక అవసరాల కోసమేనని, ఇవి ప్రపంచ చమురు ధరల స్థిరత్వానికి దోహదపడ్డాయని భారత్ స్పష్టం చేసింది. గతంలో ఇరాన్ నుంచి చమురు దిగుమతులను ఆపినప్పటికీ, ఈసారి రష్యా విషయంలో భారత్ గట్టిగా నిలబడింది. రష్యాతో దీర్ఘకాల సంబంధాలు, ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన వైఖరిని కొనసాగిస్తోంది.