AP Governance From Hyderabad: రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు దాటుతోంది. కానీ ఇంతవరకు విభజన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. సమస్యలు పరిష్కరించడం లేదు. రాజకీయ భిన్న ప్రభుత్వాలు, విభేదించే నాయకుల పుణ్యమా అని విభజన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రెండు కార్యాలయాల జాడలేదు. దీంతో ఏపీ ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రధానంగా ఆధార ప్రాంతీయ కార్యాలయం, జనాభా లెక్కల సేకరణ కార్యాలయం ఇప్పటికీ తెలంగాణ నుంచి పనిచేస్తున్నాయి. దీంతో ఏ చిన్న సమస్యకు పరిష్కారం కావాలన్నా.. హైదరాబాదులోని ప్రాంతీయ కార్యాలయాలకు సంప్రదించాల్సి వస్తోంది. అసలు ఈ కార్యాలయాలు ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read: మార్గదర్శి మీద ఉండవల్లి కేసు ఎందుకు కొట్టేసింది? ఏంటా తీర్పు?
జనాభా లెక్కల సేకరణ కార్యాలయం..
ఆ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో జనగణన( census) చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జనాభా లెక్కల సేకరణ కార్యాలయం తెలంగాణ నుంచే పని చేస్తుంది. ఏపీ జనగణన ఆపరేషన్ డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి నివాస్ ను నియమిస్తూ జూలై 16న కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులోనూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాలని నిర్దేశించింది.
రాజధాని లేకపోవడంతోనే..
రాష్ట్ర విభజన( state divide) జరిగినా.. ఏపీ మాత్రం దేశంలో పెద్ద రాష్ట్రంగానే ఉంది. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏపీకి తరలించాల్సి ఉంది. 11 ఏళ్లు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ఏపీ వైపు చూడడం లేదు. దానికి కారణం లేకపోలేదు. ఏపీకి రాజధాని లేకపోవడమే ప్రధాన కారణం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల జనాభా గణన కార్యాలయాలకు సొంత వెబ్ సైట్లు ఉన్నాయి. అందులో ఆయా రాష్ట్రాలు, జిల్లాల వారిగా జనాభా లెక్కల వివరాలు, గెజిట్ నోటిఫికేషన్లు ఉంటాయి. మన పక్కనే ఉన్న తమిళనాడు, ఒడిస్సా, కర్ణాటక కార్యాలయాలకు సైతం వెబ్సైట్లు ఉన్నాయి. తెలంగాణలో కొనసాగుతున్న ఏపీకి సంబంధించిన కార్యాలయానికి మాత్రం సొంత వెబ్సైట్ లేదు. ఇది ముమ్మాటికి ఇబ్బందికరమే.
Also Read: ఆర్టీసీ ఉచిత ప్రయాణం.. ఏపీలో అక్కడ లేనట్లే!
UIDAI ప్రాంతీయ కార్యాలయాలు కూడా..
ప్రస్తుతం దేశ పౌరుడికి గుర్తింపు ఆధార్( Aadhar). విశిష్ట ప్రాధికార పత్రంగా దానికి గుర్తింపు ఉంది. అయితే ఆధార్ వ్యవహారాలను పర్యవేక్షించే యుఐడిఏఐ ప్రాంతీయ కార్యాలయం కూడా ఏపీలో లేదు. ఏపీకి సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం హైదరాబాదులో కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా యుఐడిఏఐ కి ఎనిమిది ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ప్రజల సౌలభ్యం కోసం ఆర్వోల పరిధిలో రాష్ట్ర కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఏర్పాటైన ఈ కార్యాలయం.. ఏపీలో మాత్రం లేదు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్నా హైదరాబాదులోని అధికారులనే సంప్రదించాలి. ఫోన్ చేసి అడిగితే అధికారులు అందుబాటులో లేరనే సమాధానం వస్తుంటుంది. దీంతో ప్రజలు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు.