
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి తీరాలని రైతులు పట్టుబడుతున్న సమయంలో ఈ చట్టాలపై బీజేపీ జనరల్ సెక్రటరీలు గురువారం సమావేశమయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న నిరసనలపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ చట్టాలను తాత్కాలికంగా నిలుపుదల చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది.