India Russia Relations: భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ పరోక్షంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి మద్దతు ఇస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ చేస్తున్నారు. ఈ కారణంగానే భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు విధిచారు. తాజాగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిపివేస్తుందని సకేతం ఇచ్చిందని, ఇది మంచి పరిణామం అని ట్రంప్ ప్రకటించారు. ఈ తరుణంలో భారత్ రష్యా చమురు దిగుమతులకు చెల్లింపుల్లో సౌకర్యవంతమైన మార్గం సాధన కోసం చైనా యువాన్‌ను కూడా ఉపయోగించడం ప్రారంభించింది. ఈ విషయాన్ని రష్యా ఉపప్రధాని అలెగ్జాండర్ నోవాక్ వెల్లడించారు. ఇది పరిమిత స్థాయి లావాదేవీలకే పరిమితమైనప్పటికీ, ద్విపాక్షిక వ్యాపార పరంపరలో మార్పుకు దారి చూపుతోంది. ముఖ్యంగా పాశ్చాత్య ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో, డాలర్ ఆధారిత చెల్లింపుల బదులు కొత్త కరెన్సీల వినియోగం పెరుగుతోంది.
రూబుల్ ఆధిపత్యం..
రష్యా చమురు ఎగుమతుల్లో ప్రధానంగా రూబుల్ వినియోగం ఇంకా కొనసాగుతోంది. అయితే, భారత్, యూఏఈ, చైనా వంటి మిత్రదేశాల మధ్య లావాదేవీల్లో స్థానిక కరెన్సీల ప్రాధాన్యం పెరుగుతున్నది. ఈ మార్పు కేవలం ఆర్థిక వ్యవహారమే కాదు.. పాశ్చాత్య ఆర్థిక ఆధిపత్యానికి భిన్న కేంద్రాలు ఏర్పడుతున్నాయనే సంకేతం.
యుద్ధం తర్వాత వ్యాపార మార్పులు..
2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలైన తర్వాత పాశ్చాత్య దేశాలు తీవ్ర ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తన చమురు ఎగుమతి మార్కెట్లను ఆసియాలోకి మళ్లించింది. భారత్ ఈ మార్పులో ప్రధాన భాగస్వామిగా ఎదిగింది.
సెప్టెంబర్‌లో భారత్ రష్యా నుంచి సుమారు 2.5 బిలియన్ యూరోలు చమురు దిగుమతులకింద చెల్లించింది. ఇది గత నెలతో పోలిస్తే 14% తక్కువ అయినప్పటికీ, మొత్తం విలువ ఇప్పటికీ ప్రపంచంలోని రెండో అతిపెద్ద స్థాయిలోనే ఉంది.
యూకే కొత్త ఆంక్షలు..
ఇదిలా ఉంటే యునైటెడ్ కింగ్డమ్ తాజాగా నయారా ఎనర్జీ లిమిటెడ్‌పై ఆర్థిక ఆంక్షలు ప్రకటించింది. ఈ సంస్థలో రష్యన్ మూలధనం ఉన్నందున, పుతిన్ ప్రభుత్వ ఆదాయాన్ని కత్తిరించే ప్రయత్నంగా లండన్ ఈ చర్య చేపట్టింది.
ఇది ఇండియన్ ఎనర్జీ సెక్టార్‌పై పరోక్ష ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. ఇదే సమయంలో చైనాలోని ఆయిల్ టర్మినల్స్, ట్యాంకర్లపైనా యూకే ప్రభుత్వం శిక్షాత్మక చర్యలు ప్రారంభించింది.
డాలర్ ఆధిపత్యానికి చెక్..
రష్యా, చైనా, భారత్ వంటి దేశాలు స్థానిక కరెన్సీలను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తూ గ్లోబల్ డాలరైజేషన్‌కు ప్రత్యామ్నాయ మార్గం అన్వేషిస్తున్నాయి. యువాన్ వెనుక బీజింగ్ ఆర్థిక మద్దతు, రూబుల్‌కు మాస్కో బ్యాకింగ్, రూపాయికి న్యూ ఢిల్లీ సమీకరణ – ఈ మూడు దేశాలు అంతర్జాతీయ ఆర్థిక సమతౌల్యం వైపు వ్యూహాత్మకంగా కదులుతున్నాయి.
యువాన్‌లో చెల్లింపులు భారత్–రష్యా వాణిజ్యంలో తాత్కాలిక మార్పు మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక సమీకరణంలో కొత్త దిశను సూచిస్తోంది. యూకే ఆంక్షలు ఈ మార్పును వేగవంతం చేసే అవకాశముంది.