Great Nicobar Project: అండమాన్ నికోబార్ సముద్రప్రాంతాల్లో భారత్‌కు కీలక ద్వీపం. కొన్ని రోజులుగా ఈ ద్వీపం వార్తల్లో నిలుస్తోంది. కారణం.. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు. దేశానికి వ్యూహాత్మక మని, అభివృద్ధికి కీలకంగా మారుతుంది అని కేంద్రం చెబుతోంది. ఇక విపక్షాలు మాత్రం దీనిని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. పర్యావరణ హాని అంటూ 70 మంది మేధావులు కేంద్రానికి లేఖ రాశారు. ఇక బీజేపీ మాత్రం దీనిని చైనా ప్రేరేపిత చర్యగా ఆరోపిస్తోంది.
ఏమిటీ ప్రాజెక్టు..?
నీతి ఆయోగ్ రూపకల్పన చేసిన 81 వేల కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్టు, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, టౌన్‌షిప్, గ్యాస్‌సోలార్ విద్యుత్ ప్లాంట్ వంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇవి అన్నీ కలిపి గ్రేట్ నికోబార్‌ను వ్యూహాత్మక, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం. మలక్కా జలసంధి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపం సముద్ర భద్రతలో కీలకం. అక్కడ నేవీఎయిర్‌ఫోర్స్ శాశ్వత స్థావరం ఏర్పడితే, భారత్ ఇండో–పసిఫిక్‌లో కీలకంగా మారుతుంది. చైనా ఆధిపత్యానికి చెక్ పడుతుంది. చైనా చేపడుతున్న ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు ఇది వ్యూహాత్మక అడుగుగా భావిస్తున్నారు.
ఆర్థికంగా కీలకం..
సింగపూర్ వంటి పోర్టులతో పోటీ ఇవ్వగల ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్టు ద్వారా ప్రపంచ కంటైనర్ వాణిజ్యంలో భారత్ కొత్త హబ్‌గా ఎదగవచ్చు. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు, పర్యాటకంగా దీవుల ఆదరణ పెరగడం వంటి లాభాలు కూడా ఉన్నాయని కేంద్రం చెబుతోంది. మొదటి దశ పనులు 2028 కల్లా పూర్తవుతాయని అంచనా.
విపక్షాల వ్యతిరేకత..
ఇదే ప్రాజెక్టుపై విపక్షం మొత్తం వ్యతిరేకత తెలుపుతోంది. గలతియా బే సమీప సముద్రతీరంలో తాబేళ్ల గుడ్ల ప్రాంతానికి నష్టం, లక్షల చెట్ల నరికివేత, సముద్ర జీవాల అంతరాయం వంటి అనేక పర్యావరణ సమస్యలు ప్రస్తావించబడుతున్నాయి. షోంపెన్, నికోబారీ జనసమూహాలు బయటి ప్రభావంతో నష్టపోతాయని, జీవరాశుల జీవనశైలికి భంగం కలుగుతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం మాత్రం ఈ వాదనలను తరచూ రాజకీయ ప్రేరేపితమని కొట్టిపారేసింది. ఆ గిరిజనులను సమగ్ర అభివృద్ధి వైపు తీసుకురావడమే లక్ష్యమని, పర్యావరణ సమతుల్యతకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై భిన్న అభిప్రాయాల మధ్య అసలు కథ అంతర్జాతీయ భద్రతలో దాగి ఉంది. చైనా చుట్టుముట్టే సముద్ర మార్గాల నుంచి ఇండియా తానూ సర్కిల్ రూపొందించుకోవడం మొదటి ప్రయత్నం. నేవీ, ఇంటెలిజెన్స్ వలయాలు బలపడితే ఇండో–పసిఫిక్ సముద్రరహదారులపై భారత్ అధిపత్యం సాధించగలదు. ఈ ప్రాజెక్టు ఒక వైపు పచ్చదనం, మరో వైపు జాతీయ భద్రత. కానీ ఒక సత్యం మాత్రం స్పష్టం. ఈ దీవి చిన్నదైనా, దాని మీద ఆధారపడే నిర్ణయాలు వచ్చే దశాబ్దాల్లో భారత భవిష్య దిశను మార్చగలవు.