Kalyana Durgam Municipal Chairman: ఏపీలో( Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలామంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే ఇటీవల పార్టీకి రాజీనామాలు తగ్గాయి కానీ.. చాలా మండలాలతో పాటు మున్సిపాలిటీల్లో ఆ పార్టీ పట్టు కోల్పోయింది. అవిశ్వాస తీర్మానాల్లో వీగిపోయింది. రజక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. మున్సిపల్ చైర్మన్ గా ఉన్న తలారి రాజ్ కుమార్ ను ప్రభుత్వం తప్పించింది. మున్సిపల్ చైర్మన్గా ఉన్న రాజ్కుమార్ గత 15 నెలలుగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సెప్టెంబర్ 22న ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దానిపై సరైన వివరణ ఇవ్వకపోవడంతో ఆ పదవి నుంచి రాజ్ కుమార్ ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* ఆరు నెలలుగా కౌన్సిలింగ్ మీటింగులు లేవు
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కళ్యాణ దుర్గం మున్సిపల్ చైర్మన్ గా రాజ్ కుమార్ ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తరువాత పరిస్థితి మారింది. 2024 నవంబర్ నుంచి 2025 ఏప్రిల్ వరకు కనీసం కౌన్సిలింగ్ మీటింగు జాడలేదు. దీంతో ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై పలుమార్లు మున్సిపల్ చైర్మన్ కు రాజకీయ హెచ్చరికలు కూడా వెళ్లాయి. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. మరో నాలుగు నెలల్లో పదవీకాలం ముగియనుండడంతో తేలిగ్గా తీసుకున్నారు. కానీ ప్రభుత్వం దీనిపై గట్టి చర్యలకు దిగింది.
* తోపుడు బండి వ్యాపారిగా.. కళ్యాణదుర్గం( Kalyana Durgam) మున్సిపల్ చైర్మన్ గా ఉన్న తలారి రాజ్ కుమార్ ఒక సామాన్య వైసీపీ కార్యకర్త. తోపుడు బండి పై పండ్ల విక్రయించే సామాన్య వ్యాపారి. 2021 కి ముందు అలానే చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. కానీ వైసీపీ పై అభిమానంతో ఆ పార్టీ కార్యకర్తగా పనిచేసేవారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆయనకు లభించింది. కళ్యాణదుర్గం పదో వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయనకు అనూహ్యంగా చైర్మన్ పదవి వరించింది. కానీ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత స్థానిక రాజకీయాల నేపథ్యంలో అనేక రకాల మార్పులు వచ్చాయి. ఈ తరుణంలోనే మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేదని ఆయనపై ప్రభుత్వం వేటు వేసింది.