Homeజాతీయం - అంతర్జాతీయంPM Modi Criticism: అంతర్జాతీయంగా రచ్చ.. మోదీ సారూ.. జర జాగ్రత్త!

PM Modi Criticism: అంతర్జాతీయంగా రచ్చ.. మోదీ సారూ.. జర జాగ్రత్త!

PM Modi Criticism: భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం.. ప్రజలే పాలకులను ఎన్నుకుంటారు. ఇక మన దేశంలో ఎన్నికల వ్యవస్థ స్వతంత్రమైనది. రాజ్యాంగం దీనికి అనేక అధికారాలు ఇచ్చింది. సుప్రీం కోర్టు తర్వాత అంత బలమైన వ్యవస్థ భారత ఎన్నికల సంఘమే. అయితే మన దేశంలో దురదృష్టం ఏమిటంటే.. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ నేతలు అయినా పాలకులు చెప్పే మాటల కన్నా విదేశాలు మనపై వేసే నిందలనే ఎక్కువ నమ్ముతున్నాయి. వాటినే పాలకుల వైఫల్యాలుగా ఎత్తి చూపుతున్నాయి. ఇది ఏ ఒక్క పార్టీ గురించి కాదు. ప్రతిపక్షంలో ఉన్న అన్నీ ఇలానే చేస్తున్నాయి. తద్వారా మన దేశ రాజ్యాంగ వ్యవస్థలను అవహేళన చేస్తున్నాయి. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ అమెరికన్‌ ప్రెసిడెంట్‌ అన్నట్లుగానే మన ఆర్థిక వ్యవస్థను డెడ్లీ అని విమర్శించారు. తాజాగా ఎన్నికల సంఘం.. నకిలీ ఓట్ల వ్యవహారంపై చర్చ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికలలో అక్రమాలకు పాల్పడిందని విపక్ష నాయకులు ఆరోపిస్తూ, ఎన్నికల కమిషన్‌కు మార్చ్‌ చేసే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. వందలాది విపక్ష ఎంపీలను పోలీసులు కొద్ది సేపు అదుపులోకి తీసుకున్నారు. ఈ నిరసన భారత ఎన్నికల వ్యవస్థపై విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ, దేశంలోని ప్రజాస్వామ్య ప్రక్రియలపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.

Also Read: ఏపీలో నామినేటెడ్ జాతర!

ఓటు చోరీ పేరిట రచ్చ..
ఢిల్లీలోని పార్లమెంటు నుంచి ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వరకు విపక్ష ఇండియా బ్లాక్‌ ఎంపీలు ఆగస్టు 11న నిరసన మార్చ్‌ను ప్రారంభించారు. ఈ నిరసన బీహార్‌లో జరుగుతున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ఓటరు జాబితా సవరణ, 2024 లోక్‌సభ ఎన్నికలలో జరిగిన ‘వోటు చోరీ‘ గురించి. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ సహా విపక్ష నాయకులు, ఓటరు జాబితాలలో అవకతవకలు, ఓటరు పేర్ల తొలగింపు, బహుళ ఓట్ల చేరికలు బీజేపీకి అనుకూలంగా జరిగాయని ఆరోపించారు. ఈ నిరసనలో దాదాపు 300 మంది ఎంపీలు పాల్గొన్నారు, అయితే ఢిల్లీ పోలీసులు ఈ మార్చ్‌ను అడ్డుకుని, పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విపక్ష నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్నికల కమిషన్‌ బీజేపీతో కుమ్మక్కై ఓటరు జాబితాలను మార్చిందని ఆరోపిస్తున్నారు. రాహుల్‌ గాంధీ బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు ఒక లక్ష ఓట్లు నకిలీవని ఆరోపించారు, దీనిని ‘ఎన్నికల అక్రమం‘గా అభివర్ణించారు. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాల సవరణ, పేదలు మరియు మైనారిటీలను ఓటు హక్కు నుంచి దూరం చేసే ప్రయత్నంగా ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సవరణకు జన్మ సర్టిఫికెట్లు, పాస్‌పోర్టులు వంటి డాక్యుమెంట్లు అవసరం, ఇవి బీహార్‌ వంటి తక్కువ అక్షరాస్యత రాష్ట్రంలో చాలా మందికి అందుబాటులో లేవని విమర్శకులు పేర్కొన్నారు.

అంతర్జాతీయ మీడియా రచ్చ..
మొన్నటి వరకు శత్రు దేశంగా ఉన్న చైనా.. ట్రంప్‌ కారణంగానే దగ్గరవుతోంది. దీంతో ఇప్పుడు చైనా మీడియా భారత్‌కు అనుకూలంగా కథనాలు రాస్తోంది. ఇక మొన్నటి వరకు భారత్‌కు మిత్ర దేశంగా ఉన్న అమెరికా ట్రంప్‌ నిర్ణయాలతో శత్రువుగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడి మీడియా కూడా భారత వ్యతిరేక వార్తలు రాయడం మొదలు పెట్టింది. తాజాగా ఓటు చోరీ అంశాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి వార్తా సంస్థలు రిపోర్ట్‌ చేశాయి, అయితే ఎన్నికల కమిషన్‌ ఈ నివేదికలను ‘తప్పుదారి పట్టించేవి‘గా తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు భారత ఎన్నికల వ్యవస్థ యొక్క విశ్వసనీయతను ప్రశ్నించాయి.

కేంద్రం అలర్ట్‌..
విపక్షాల చర్చపై కేంద్రం అలర్ట్‌ అయింది. అంతర్జాతీయ మీడియా కథనాల నేపథ్యంలో కేంద్రం కూడా కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. అయితే ఇక్కడ కేంద్రంతోపాటు ఎన్నికల సంఘం కూడా తన నిబద్ధత, నిజాయతీని నిరూపించుకుని ఆరోపణలకు చెక్‌ పెట్టాలి. లేదంటే.. ఇది మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular