Etela Rajender : ఈటెల ఎపిసోడ్ తో హై కమాండ్ దిగివస్తుందా?
ప్రస్తుతం అధ్యక్షుడు మార్పు జరుగుతుందని ఊహాగానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం బిజెపి రాష్ట్ర వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. ఇంతకీ అధ్యక్షుడి మార్పు ఉంటుందా? కిషన్ రెడ్డిని ఢిల్లీ ఎందుకు పిలిపించారు? అని ప్రశ్నించినప్పుడు సంచల వార్త మీరే వింటారు అని భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడు స్పష్టం చేశారు. అంటే ఈ ప్రకారం ఢిల్లీ వెళ్లి ఈటెల తన పంతం నెగ్గించుకున్నారు అని ప్రచారం జరుగుతోంది.
Etela Rajender : మొత్తానికి తెలంగాణ రాజకీయాలు ముదిరి పాకానపడ్డాయి. భారత రాష్ట్ర సమితిలో నియంతృత్వ విధానాన్ని తట్టుకోలేక బయటకు వచ్చిన ఈటల రాజేందర్ కు.. భారతీయ జనతా పార్టీలను అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయమని తెలంగాణలో ప్రచారం జరిగిన నేపథ్యంలో.. అనూహ్యంగా కమలం పార్టీ నాయకులు కాడి ఎత్తివేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కర్ణాటకలో పరాజయం అనంతరం కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం.. అక్కడి ఫలితాన్ని బెరీజు వేసుకొని బిజెపి ఓకింత వెనుకంజ వేయడం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు అధికారంలోకి వస్తే భారత రాష్ట్ర సమితి పథకాలు అమలు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం, ఎంపీ నిధులతో ఇల్లు కట్టుకున్నా, కుమారుడి పెళ్లి చేసినా.. అని ఎంపీ సోయం బాపూరావు చెప్పడం.. భారతీయ జనతా పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. దీనికి తోడు ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో హడావిడి చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు తర్వాత మిన్నకుండడం, కవితలు రెండుసార్లు విచారణ చేసి ఆ తర్వాత నిశ్శబ్దాన్ని ఆశ్రయించడం ఇక్కడ ఉన్న కొంతమంది బిజెపి నాయకులకు నచ్చడం లేదు. ఇది అంతర్గతంగా ఆ పార్టీలో కలహాలను రాజేస్తోంది.
భారత రాష్ట్ర సమితిలో ఒంటెత్తు పోకడలు సహించలేక భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన ఈటల రాజేందర్ కు ఇటీవల హై కమాండ్ అనుసరిస్తున్న విధానాలు ఏమాత్రం నచ్చడం లేదు. ఇవి అంతిమంగా పార్టీని క్షేత్రస్థాయిలో పలుచన చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోకపోవడం హై కమాండ్ వైఫల్యమే అని, ఇలా అయితే తాము తెలంగాణలో అధికారంలోకి రావడం కల్ల అని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు పలు మీడియా చర్చల్లోనూ ఆయన ఇదే విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. అధిష్టానం తీరు సరిగా లేదని, ఇప్పటిదాకా భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు భావించారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన చెబుతున్నారు. పార్టీ చేరికలు కమిటీ చైర్మన్ గా ఆయన ఉన్నప్పటికీ పెద్దపెద్ద స్థాయి నాయకులను ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఆకర్షించలేకపోయింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక విషయంలోనూ ఈటల రాజేందర్ కు విచిత్రమైన సమస్య ఎదురయింది. క్షేత్రస్థాయిలో కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు మీ వద్ద ఉన్న అస్త్రాలు ఏమిటి అని పొంగిలేటి ప్రశ్నిస్తే.. దానికి ఈటెల రాజేందర్ సమాధానం చెప్పలేకపోయారు. ఇక జూపల్లి కృష్ణారావు నుంచి ఇటువంటి ప్రశ్నే ఎదురయింది.. దానికి కూడా ఆయన సమాధానం చెప్పలేకపోయారు..
ఇక శనివారం ఢిల్లీ వెళ్ళిన ఈటల రాజేందర్ మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. మమ్మల్ని ఢిల్లీకి పిలిచి కేటీఆర్ కు అపాయింట్మెంట్ ఇవ్వడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని శరణార్థులు అంటున్నారని, దీనికి బండి సంజయ్ కూడా కారణమని ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ” మాపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి నిజమే. భారత రాష్ట్ర సమితి మెతక వైఖరి అవలంబించడం వల్ల క్షేత్రస్థాయిలో మేము ఇబ్బంది పడుతున్నాం. మా కార్యకర్తలు కూడా ఆగ్రహంగా ఉన్నారు” అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఒక అడుగు వెనక్కి వేసినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీకి విజయావకాశాలు ఉన్న నేపథ్యంలో భారత రాష్ట్ర సమితితో వైరాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ కు చివరి నిమిషంలో అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు చేశారని సమాచారం. ఈ పరిణామంతో ఈటల రాజేందర్ ఒకింత మెత్తబడ్డారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ ఎపిసోడ్ తర్వాత ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ రావడంతో కిషన్ రెడ్డి హుటాహుటిన దేశ రాజధానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం అధ్యక్షుడు మార్పు జరుగుతుందని ఊహాగానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం బిజెపి రాష్ట్ర వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. ఇంతకీ అధ్యక్షుడి మార్పు ఉంటుందా? కిషన్ రెడ్డిని ఢిల్లీ ఎందుకు పిలిపించారు? అని ప్రశ్నించినప్పుడు సంచల వార్త మీరే వింటారు అని భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడు స్పష్టం చేశారు. అంటే ఈ ప్రకారం ఢిల్లీ వెళ్లి ఈటెల తన పంతం నెగ్గించుకున్నారు అని ప్రచారం జరుగుతోంది.