HomeజాతీయంPM Mod - Trishul Strategy : త్రిశూల వ్యూహం" మోడీకి కలిసి వస్తుందా?

PM Mod – Trishul Strategy : త్రిశూల వ్యూహం” మోడీకి కలిసి వస్తుందా?

PM Mod – Trishul Strategy : కర్ణాటకలో పరాజయం.. మణిపూర్ లో అల్లకల్లోలం.. తెలంగాణలో అంతర్గత కుమ్ములాటలు.. పాట్నాలో ప్రతిపక్షాల సమావేశాలు. ఇన్ని పరిణామాల మధ్య అధికారంలోకి రావడం భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా అగ్నిపరీక్షే. ఈ అగ్నిపరీక్షను మోదీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఎలా ఎదుర్కొంటుంది? ఎలాంటి కసరత్తు చేసి మూడవసారి అధికారాన్ని సుస్థిరం చేసుకుంటుంది? ఈ ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వ్యాప్తిలో ఉన్నాయి. అయితే వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ త్రిశూల వ్యూహం ద్వారా సమాధానం ఇస్తోంది. ఇంతకీ ఈ వ్యూహం ఎలా ఉంటుంది? దీనిని ఎలా అమలు చేస్తుంది? ఇవే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారాయి.
భారీ ప్రణాళికలు రూపొందించింది
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ భారీ ప్రణాళికలు రూపొందించింది. కర్ణాటక ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని ఈసారి త్రిశూల వ్యూహంతో బరిలోకి దిగాలని నిర్ణయించింది.. దేశాన్ని మూడు కీలక జోన్లుగా విభజించింది. ఎన్నికల ప్రణాళికలు కూడా రచించింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా బీజేపీ అగ్ర నేతలు ఇటీవల భేటీ అయి.. దీని మీద విస్తృతంగా చర్చించారు. దాదాపు 5గంటల పాటు మాట్లాడుకున్నారు. ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై, 2024 లోక్‌సభ ఎన్నికల వ్యూహాలతో పాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది.
సంస్థాగతంగా మార్పులు
బిజెపి కీలక నేతల మధ్య జరిగిన చర్చల్లో జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పార్టీలో సంస్థాగత మార్చులపైనా మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ,. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాంతాలు, సీట్ల వారీగా బ్లూప్రింట్‌ సిద్ధం చేసుకోవాలని నేతలను మోదీ ఆదేశించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో ఎన్నికల ప్రయత్నాలను సులభతరం చేయడానికి మొత్తం 543 లోక్‌సభ స్థానాలను ఉత్తరం, దక్షిణం, తూర్పు అనే మూడు క్లస్టర్లుగా విభజించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వీటిలో ఒక్కో జోన్‌లోని అగ్రనేతలతో పార్టీ అధ్యక్షుడు నడ్డా జులై 6 నుంచి 8 వరకూ భేటీ అవుతారు. జూలై 6న గువాహటిలో నిర్వహించే సమావేశంలో బిహార్‌, జార్ఖండ్‌, ఒడిసా, బెంగాల్‌, అసోం, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఇతర ఈశాన్య రాష్ట్రాల నేతలు పాల్గొంటారు. ఢిల్లీలో 7న జమ్ము, కశ్మీర్‌, లద్ధాక్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, చండీగఢ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, డామన్‌, డయ్యూ, మధ్యప్రదేశ్‌, ఛత్తీ స్ గఢ్‌, యూపీ, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, హరియాణా నేతలతో భేటీ అవుతారు. ఇక ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, గోవా, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ నేతలతో హైదరాబాద్‌లో 8న సమావేశం నిర్వహిస్తారు. ఈ స మావేశాలకు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కార్యదర్శి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. కాగా, సమాజంలో పేద, వెనుకబడిన వర్గాల ప్రజల అవసరాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంపై సమావేశంలో మంత్రులకు ప్రధాని మోదీ నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాబోయే ఎన్నికల్లో..

 రాబోయే ఎన్నికలు ఈ వర్గాల సంక్షేమం, ప్రయోజనాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తాయని, ప్రభుత్వ పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేయాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. మంత్రులంతా తమ నియోజకవర్గాల్లో వెనుకబడిన తరగతుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారి జీవన ప్రమాణాలను పెంచే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని మోడీ సూచించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సంవత్సరంలో మధ్యతరగతి, పేద, అణగారిన, వెనుకబడిన వర్గాల ప్రాముఖ్యతను గుర్తిస్తూ, వారి ఆందోళనలు, ఆకాంక్షలను పరిష్కరించే ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకతను ప్రధాని నొక్కిచెప్పారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.


Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular