Ayodhya Ram Mandir: పండితులు చేయాల్సిన ప్రాణ ప్రతిష్ట మోదీ ఎందుకు చేశారు.. దాని వెనుక..

దేశ అత్యున్నత న్యాయస్థానంలో రాముడిని గెలిపించిన మోదీ.. అదే ఉత్సాహంతో 2021లో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేశంలో భక్తులు ఇచ్చిన విరాళాలతోనే ఈ ఆలయం నిర్మించడం గమనార్హం.

Written By: Raj Shekar, Updated On : January 23, 2024 11:24 am

Ayodhya Ram Mandir

Follow us on

Ayodhya Ram Mandir: అయోధ్యకు మన రాముడు వచ్చాడు.. మన రాముడిని తీసుకు వచ్చాడు భారత ప్రధాని నరేంద్రమోదీ. ఇదీ భారతదేశంలో హిందువుల అభిప్రాయం 500 ఏళ్ల నిరీక్షణ, ఐదు దశాబ్దాల పోరాటం తర్వాత గతంలో ఏ ప్రధానికి సాధ్యం కాని రామ జన్మభూమి వివాదానికి మోదీ సామరస్య పూర్వక పరిష్కారం చూపడంలో సఫలీకృతుడయ్యాడు. 2019 డిసెంబర్‌ నుంచి 40 రోజులపాటు నిత్యం వాదోప వాదనలు విన్న సుప్రీం కోర్టు రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ముస్లింలకు మరోచోట స్థలం కేటాయించి మసీదు నిర్మించాలని సూచించింది.

రామాలయానికి శ్రీకారం..
దేశ అత్యున్నత న్యాయస్థానంలో రాముడిని గెలిపించిన మోదీ.. అదే ఉత్సాహంతో 2021లో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేశంలో భక్తులు ఇచ్చిన విరాళాలతోనే ఈ ఆలయం నిర్మించడం గమనార్హం. దేశవ్యాప్తంగా సుమారు రూ.3 వేల కోట్ల విరాళాలు రాగా, ఇప్పటి వరకు రామాలయ నిర్మాణానికి రూ.1,100 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వెయ్యేళ్లు నిలిచేలా అద్భుతంగా ఆలయం నిర్మించారు.

బాల రాముడి ప్రతిష్ట..
రామాలయ నిర్మాణం పూర్తి కావడంతో గర్భగుడిలో మైసూర్‌కు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌ చెక్కిన బాల రాముడి శిల్పాన్ని ప్రతిష్టించారు. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి జనవరి 22న మేషరాశి, అభిజిత్‌ లగ్నంలో మధ్యాహ్నం 12:29:08 సెకన్ల నుంచి 84 సెకన్లపాటు బాల రాముడి ప్రాణ ప్రతిష్ట నిర్వహించేలా ముహూర్తం నిర్ణయించారు. ఇక బాల రాముడి ప్రతిష్టాపన క్రతువును ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా జరిపించారు.

మోదీ నిర్వహించడంపై..
సాధారణంగా ఆలయాల్లో విగ్రహ ప్రాణ ప్రతతిష్ట అంటేనే పండితులు, పీఠాధిపతులు, మఠాధిపతులు చేస్తారు. కానీ, అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను ప్రధాని మోదీ చేతుల మీదుగా నిర్వహించారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. పండితులు చేయాల్సిన క్రతువును మోదీ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కానీ, మోదీ బాల రాముడి ప్రతిష్టాపనకు తన మనసు, శరీరాన్ని అనుష్టానం చేశారు. ఇందుకోసం 11 రోజులు కఠిన నియమాలు పాటించారు. ఇక శాస్త్రాల ప్రకారం వస్తే.. వాయు ప్రక్రియ ద్వారా ఎవరైనా విగ్రహాలను ప్రతిష్టించే వీలు ఉంటుంది. ఇలాంటి విగ్రహాలను ఎవరైనా తాకవచ్చు అలా కాకుండా బీజాక్షర యంత్రయుక్త ప్రాణ ప్రతిష్ట చేసిన విగ్రహాలకు మాత్రం ఎవరూ ముట్టుకోవడానికి వీలు ఉండదు. వాయు ప్రతిష్ట అనేది శివాలయాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. భక్తులందరూ శివుడికి అభిషేకం నిర్వహించుకునేందుకు వీలుగా శివ లింగాలను వాయు ప్రక్రియ ద్వారా ప్రతిష్టిస్తారు. ఇక ఉత్తర భారత దేశంలో చాలా వరకు గర్భగుడి ప్రవేశాలు ఉంటాయి. అందుకే అయోధ్య రాముడిని ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట గావించారు. భక్తుల రద్దీ దృష్ట్యా మాత్రమే కాల క్రమంలో గర్భగుడి దర్శనాలు నిలిపివేస్తున్నారు.