YS Sharmila: ఏపీ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు తీసుకున్న షర్మిల దూకుడు పెంచారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధమయ్యారు. శ్రీకాకుళం నుంచి తన పర్యటనలను ప్రారంభించనున్నారు. ఆమె పర్యటనలు ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. దాదాపు 13 ఉమ్మడి జిల్లాల్లో ఆమె పర్యటించనున్నారు.అయితే ఆమె ఎలాంటి ప్రసంగాలు చేస్తారు? ఎవరిని టార్గెట్ చేస్తారు? అన్నది చర్చనీయాంశంగా మారింది. గతానికి భిన్నంగా ఆమె పర్యటనలు కొనసాగుతాయి. ఆపై ప్రసంగాలు సైతం మారనున్నాయి.
గతంలో జగనన్నకు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. అన్నకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సెంటిమెంట్ పండించి మరి ఓటర్లను అన్న వైపు టర్న్ అయ్యేలా చేశారు. గత ఎన్నికల్లో అయితే బై బై బాబు అంటూ నినాదాలు కూడా ఇచ్చారు. అవి బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. అయితే ఇప్పుడు కూడా బై బై జగన్ అంటారా? లేకుంటే పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తారా? అన్న ఆత్రుత ప్రజల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కంటే.. జగన్ కు ఇబ్బంది పెట్టేందుకే ఆమె పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చారని టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆమె ఏం మాట్లాడుతారు? అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.
ఇలా కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు తీసుకున్నారో లేదో.. షర్మిల జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. పాలనా వైఫల్యాలను ప్రస్తావించారు. అవినీతిని ఎండగట్టారు. విభజన హామీల అమలులో విఫలం చెందడాన్ని తప్పు పట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి జగన్ అవసరం లేదని.. గత ఐదేళ్లలో అధోగతి పాలన చేశారని మండి పడటం ద్వారా కొత్త సంకేతాలు ఇచ్చారు. తాను కాంగ్రెస్ లో చేరింది.. సారధ్య బాధ్యతలు తీసుకుంది.. కేవలం జగన్ పై రివెంజ్ కోసమే నన్న రీతిలో ఆమె వ్యవహార శైలి ఉంది. జగన్ ను అధికారం నుంచి దూరం చేసి తాను అనుకున్నది సాధించుకోవాలని షర్మిల భావిస్తున్నట్లు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తనతో పాటు తన తల్లి విజయమ్మను సైతం తన రూట్లోకి తేవాలని షర్మిల భావిస్తున్నారు.
ఒకవేళ షర్మిల వెంట విజయమ్మ వస్తే మాత్రం జగన్ కు అపార నష్టమే. విపక్షాలకు కావలసినంత ఛాన్స్ ఇచ్చినట్టే. చెల్లి, తల్లి అభిమానాన్ని పోగొట్టుకున్న జగన్.. ప్రజల మనసు గెలిచేందుకు ఎంతో కష్టపడాలి. రాజకీయ ప్రతికూలతలను అధిగమించాలి. కానీ ఇంటా బయటా ఆయన క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో షర్మిల ఎంట్రీ ఇచ్చి చికాకు పెడుతున్నారు. అన్నతో ఢీ అంటే ఢీ అంటున్నారు. జనం మధ్యలోకి వెళ్లి జగన్ చేసిన అన్యాయాన్ని చెప్పాలని భావిస్తున్నారు. అయితే ఇందులో నష్టపోయేది జగన్ కాగా.. అందులో ఆనందాన్ని వెతుక్కునే పనిలో షర్మిల ఉన్నారు. ఇలా ఎలా చూసుకున్నా షర్మిల జగన్ కు కోలుకోలేని దెబ్బతీయాలని చూస్తుండడం విశేషం.