Budget 2024 Expectations: 2024- 2025 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కు సంబంధించిన అంశాలు చెప్పనున్నారు. వచ్చే కొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అన్ని రంగాల్లో నెలకొంది. ఈసారి ఎలాంటి ఆకర్షణీయమైన పథకాలు ప్రకటిస్తారోనని సామాన్యులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్, ఆరోగ్యం, ఆటో, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఏవిధంగా కేటాయించనున్నారో చూద్దాం..
వైద్యం:
కరోనా తరువాత దేశంలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు ప్రాధాన్యత ఇస్తున్నారు. 2024-25 బడ్జెట్ కేటాయింపుల్లోనూ హెల్త్ కేర్ పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. అయితే గ్రామీణ ఆరోగ్య రక్షనకు ప్రత్యేక చొరవ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా 2 శాతం మేరకు కేటాయింపులు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా అదనంగా జీఎస్టీ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆరోగ్య రంగంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. అందువల్ల వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కేటాయింపులు చేసే అవకాశం ఉంది. ప్రధానమైన నగరాల్లో ఈ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో వైద్యుల బదిలీలు చేస్తూ సమానమైన ఆరోగ్యాన్ని ప్రసాదించేందుకు కృషి చేసే అవకాశం ఉంది.
ఆటోమోబైల్:
ఈసారి బడ్జెట్ లో కర్బన ఉద్గారాలను తగ్గించే విధంగా ప్రణాళికలు వేయనున్నారు. ఇందులో భాగంగా సౌర, ఇథనాల్, బయోగ్యాస్ వంటి స్వదేశీ ఇంధన వనరులు ఉపయోగిస్తూ రవాణా రంగాన్ని మెరుగుపర్చనున్నారు. అవసరమైతే బయోగ్యాస్, ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే కంపెనీలను ప్రోత్సహిస్తూ వాటికి కొన్ని మినహాయింపులు ఇవ్వనున్నారు. ఇదే సమయంలో సాంకేతికతను జోడించి ఆధునిక వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించేలా కృషి చేసే అవకాశం ఉంది. దేశంలో కొన్ని ఆటోమోబైల్ సంస్థలకు మౌలిక సదుపాయాలు అందిస్తూ శిలాజ ఇంధనాలపై తక్కువగా ఆధారపడేవాటికి అండగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
AI ఏకీకరణ:
కొత్త బడ్జెట్ లో AI (Artificial Intelligence) ఆధారిత విద్యను ఏకీకరణ చేయనున్నారు. జాతీయ కేటాయింపుల్లో ఏఐ విద్యకు 6 శాతం కేటాయింపులు ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏఐ ఆధారిత విద్య నమూనాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తారు. ఓ వైపు సాంప్రదాయ విద్యను ప్రోత్సహిస్తూనే మరోవైపు ప్రపంచంలో ఏర్పడిన పోటీని తట్టుకునేందుకు ఏఐ కి అవకాశం ఇవ్వనున్నారు. అలాగే AI ఆధారిత పరిశోధనలకు పెట్టుబడులను ప్రోత్సహిస్తూ అభ్యాస సాధనాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.
అగ్రికల్చర్:
అగ్రికల్చర్ లో రసాయనాల వాడకం ఎక్కువవుతోంది. దీంతో నాణ్యమైన ఆహారం లభించడం లేదు. ఫలితంగా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందువల్ల వ్యవసాయ రంగంలో రసాయనాల వాడకాన్ని తగ్గించి గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా, మిథనాలు వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 15 శాతం గ్రీన్ మిథనాల్ ను పెట్రోల్ కలిపే విధానంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మిథనాల్ సంబంధిత రంగాలను ప్రోత్సహించనున్నారు. మరోవైపు సోలార్ మాడ్యుల్స్, ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ల ఏర్పాటు కోసం ఆదాయపు పన్నును పొడగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
రియల్ ఎస్టేట్:
నేటికాలంలో రియల్ ఎస్టేట్ రంగం ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతోంది. దీనికి మరింత ఊతం ఇచ్చేలా రియల్ ఎస్టేట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగాల వృద్ధికి CGST చట్టానికి సవరణ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నిర్మాణ దశలో ఉన్నవాటికి ఇన్ పుట్ క్రెడిట్ పొందేందుకు వీలుగా అవకాశాలు కల్పించి ఖర్చులను తగ్గించుకునే అవకాశం కల్పించనున్నారు. అలాగే ఖాళీ స్థలాల్లో ఐటీ పార్కులు అభివృద్ధి చేసేలా తోడ్పాటు అందించనున్నారు.