Manipur : దాదాపు రెండున్నర నెలలు దాటింది. ఇంటర్‌నెట్ లేదు. పత్రికలు రావడం లేదు. పోలీస్ బూట్ల చప్పుళ్లు, తుపాకీ మోతలు, ఇళ్ల దహనాలు.. ఎప్పుడు ఎవరు చస్తారో తెలియదు. ఎవరు మీదకు దూసుకువస్తారో తెలియదు. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనం దాగి ఉందో తెలియదు కాని.. పచ్చటి మణిపూర్ నెత్తుటి ధారగా కన్పిస్తోంది. అక్కడ జరుగుతున్న హింసాకాండ ఒళ్లును జలదరింపజేస్తోంది. నిరసనలో భాగంగా ఓ బాలుడి తలకు బుల్లెట్ తగిలింది. అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్తుంటే ఓ అల్లరి మూక దానిని అడ్డుకుని దహనం చేసింది. ఆ బాలుడితో పాటు అతడి తల్లి, బంధువు బూడిదయ్యారు. అంతే కాదు ఆ బాలుడి గ్రామాన్ని ఆ అల్లరి మూక దహనం చేసింది. అనేక మందిని బూడిద చేసింది. ఇలా చెప్పుకొంటూ పోతే మణిపూర్ ఈ 75 రోజుల్లో ఎన్నో మంటలను చవి చూసింది. మరెన్నో బాధలను అనుభవించింది. పంటి బిగువన భరిస్తూనే ఉంది.
అల్లరి మూకల ధాటికి..
అల్లరి మూకల ధాటికి ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉండకుండా పలాయనం చిత్తగిస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో తల దాచుకుంటున్నారు. వేలాది మంది శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వేలాది మంది తమ ఇళ్లను విడిచి వెళ్లిపోయారు. అల్లరి మూకల వల్ల గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయిపోయాయి. మణిపూర్‌లో ఇప్పుడు ఉన్నది పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అంటూ ఎవరూ లేరు. కేవలం ఉన్నది ఒకటి మెయిటీ, మరొకటి కూకీ తెగలు. అవి ఒకదాన్ని ఒకటి నిర్మూలించుకునే పనిలో పడ్డాయి ఇప్పుడు. కూకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను మెయిటీ తెగ వారు వివస్త్రలను చేసి ఊరేగించారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాద వారిని వివస్త్రలను చేసి ఊరేగిస్తుంటే మిగతా మహిళలు అలానే చేయండి, వారికి అలానే కావాలని నినదిస్తున్నారంటే అక్కడి బీభత్సకాండను ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది.
అత్యాధునిక ఆయుధాలతో ఊచకోతలు
మణిపూర్‌లో ఎల్లెడలా సైన్యం విస్తరించినా, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. అల్లరి మూక అత్యాధునిక ఆయుధాలతో ఊచకోతలు కోస్తున్నాయి. వారి చేతుల్లోకి ఈ ఆయుధాలు ఎలా వచ్చాయి? అనేది అంతుపట్టకుండా ఉంది. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నాలుగు రోజులు మణిపూర్ వెళ్లి బస చేసి వచ్చారు. అయినప్పటికీ హింస ఆగలేదు. అప్పట్లో సుప్రీం కోర్టు కూడా శాంతి భద్రతల పరిస్థితి తమ చేతిలో లేదని నిస్సహాత ప్రకటించింది. పైగా ఆరు ఏళ్లుగా బీజేపీ నేతృత్వంలోనే డబుల్ ఇంజన్ సర్కారు మణిపూర్‌లో కొనసాగుతోంది. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేసినట్టు? లిబియా, లెబనాన్, నైజీరియా, సిరియా లాంటి దేశాల్లో కనబడే ఇలాంటి బీభత్స బర్బర హింసాకాండ మన దేశంలో అది కూడా ఒక రాష్ట్రంలో 75 రోజుల నంచి జరగుతున్నా మోడీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతోంది? ప్రజలను శాంతింప జేసేలా ఎందుకు మాట్లాడలేకపోతోంది? అసలు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నా కేంద్ర దాన్ని రద్దు చేసి పరిస్థితిని ఎందుకు చేతుల్లోకి తీసుకోవడం లేదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
చారిత్రాత్మకంగా ఘర్షణ వాతావరణం
మణిపూర్‌లో కుకీలు, మెయిటీల మధ్య చారిత్రాత్మకంగా ఘర్షణ వాతావరణం నెలకొన్పటికీ ఎందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా లేవు అనేది అంతుపట్టకుండా ఉంది. హింసాకాండ గురించి వారికి ముందస్తుగా సమాచారం ఎందుకు అందలేదు? ఆదివాసీలను క్రమంగా వారి ప్రాంతాల నుంచి తొలగించడం? మెయిటీల రిజర్వేషన్ పై హైకోర్టు సానుకూలంగా స్పందించడం మొదలైన నాటి నుంచి పర్యవసానాలను మోడీ సర్కార్ ముందుగా ఊహించలేదా? ఆదివాసీలంతా ఏకమై ఒక మోర్చాను ఏర్పరిచి ఒక ర్యాలీ నిర్వహించిన విషయం వారికి తెలియదా? లేక మోజార్టీ ప్రజాప్రతినిఽధులు ఒకే వర్గానికి చెందిన వారున్నందు వల్ల తమ రాజకీయాల కోసం మౌనం పాటించారా? లేక దేశంలో ఇతర రాజకీయాలు చేస్తూ మణిపూర్‌ను విస్మరించారా? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం బీజేపీ పెద్దలపై ఉందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. నెత్తుటి మణిపూర్ పచ్చగా మారేదెప్పుడని వారు ప్రశ్నిస్తున్నారు.