Rooftop Solar Scheme: సంప్రదాయ వనరులతో( నీరు, గాలి ద్వారా) తయారు చేసే విద్యుత్ నానాటికి తగ్గిపోతుంది. బొగ్గు ఆధారంగా చేసే విద్యుత్ తయారీ రోజురోజుకు పెరుగుతోంది. దీనివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోంది. నీటి వాడకం కూడా అధికమవడంతో వనరుల మీద ఒత్తిడి పెరుగుతుంది. బొగ్గును అదే పనిగా తవ్వడం వల్ల భవిష్యత్ లో నిల్వలు తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే సూర్యుడి వేడితో విద్యుత్ ఉత్పత్తి కి కేంద్రం శ్రీకారం చుట్టింది. దీనికి “పీఎం సూర్య ఘర్”: “ముఫ్త్ బిజ్లీ యోజన” అని పేరు పెట్టింది. ఈ పథకం ద్వారా కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కోసం వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించి రూప్ టాప్ సోలార్ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపొందించింది. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
ముందుగా pmsuryaghar.gov.in వెబ్ సైట్ పోర్టల్ లో పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకుగాను రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే సంస్థను ఎంచుకోవాలి. విద్యుత్ కనెక్షన్ కన్స్యూమర్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ని నమోదు చేయాలి. అందులో ఉన్న నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. అనంతరం కన్జ్యూమర్ నెంబర్, మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. అక్కడ రూప్ టాప్ సోలార్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పూర్తి చేసిన అనంతరం సంబంధిత డిస్కమ్ నుంచి వచ్చేంతవరకు ఎదురు చూడాలి. అనుమతి వచ్చిన తర్వాత డిస్కమ్ లోని అధికారిక విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్లాంట్ వివరాలు పోర్టల్ లో సమర్పించాలి. ఇది పూర్తయిన తర్వాత నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెట్ మీటర్ వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలి. అనంతరం దానిని డిస్కమ్ అధికారులు తనిఖీ చేస్తారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ రిపోర్టు పూర్తయిన అనంతరం బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్ ను పోర్టల్ లో నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత 30 రోజులకు రాయితీ నగదు మీ బ్యాంక్ ఖాతాలో జమవుతుంది.
దేశంలో విద్యుత్ తయారీ రోజురోజుకు ఖరీదువుతోంది. బొగ్గు, ఇతర వనరుల మీద ఒత్తిడి పెరుగుతోంది. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వాడకం కూడా తారాస్థాయికి చేరుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ తయారీ ఖర్చు పెరుగుతుండడంతో అనివార్యంగా బిల్లులు పెంచాల్సి వస్తోంది. ఒక స్థాయి ఉన్నవాళ్ల వరకైతే పెద్దగా ఇబ్బంది ఉండదు.. మన దేశంలో నేటికీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలే ఎక్కువ. వారికి పెరిగిన కరెంట్ బిల్లులు చెల్లించాలంటే ప్రతినెలా ఇబ్బందే. అందుకే అటువంటి వారికి పెరిగిన విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకాన్ని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రధాని ఇటీవల బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించిన అనంతరం ప్రకటించారు.