Water Metro Kochi: నీరంటే ఎవరికైనా ఇష్టమే.. అందులో “లాహిరి లాహిరి లాహిరిలో” అంటూ పాడుకుంటూ సాగిపోతుంటే ఆనందమే.. ఇలా పాడుకుంటూ ఉండాలంటే బ్యాక్ వాటర్స్ కచ్చితంగా ప్రయాణించాలి. నిశ్చలంగా ఉన్న నీటిలో అలా సాగిపోతూ ఉంటే వచ్చే అనుభూతే వేరు. మనదేశంలో ఇలాంటి బ్యాక్ వాటర్స్ కేరళ రాష్ట్రంలో మాత్రమే ఉంటాయి. అందుకే అక్కడికి పర్యాటకులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. _
“భూతల స్వర్గం”గా కీర్తిస్తూ ఉంటారు. కేరళ రాష్ట్రం జలయాత్రలకు పెట్టింది పేరు. అయితే మెజారిటీ టూరిస్టుల కంప్లైంట్ ఏంటంటే ఆ పడవలకు ఒకవేళ అంటూ ఉండదు. ఫలితంగా టూరిస్టులు ఇబ్బంది పడుతూ ఉంటారు. నిర్ణీత టైం ప్రకారం నడిచే వ్యవస్థ ఉంటే.. ఇప్పుడు దానినే కేరళ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చింది. ఆచరణలో చూపింది. దానిని పూర్తి చేసింది. దేశంలో మొట్టమొదటిసారిగా “వాటర్ మెట్రో” వ్యవస్థను తీసుకువచ్చింది. దానిని మంగళవారం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మొదటి సర్వీస్ ను ఆయన కొచ్చి నుంచి ప్రారంభించారు.
ఇప్పటివరకు మనం మెట్రో అంటే రైల్వే శాఖలో మాత్రమే చూశాం. ఆ రైల్వే శాఖలోనూ ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం) ఫ్లై ఓవర్ల మీదుగా నడిచే మెట్రో సర్వీస్ లు మాత్రమే మనకు తెలుసు. కానీ ప్రధానమంత్రి ప్రారంభించిన ఈ వాటర్ మెట్రో పూర్తి విభిన్నం. స్థూలంగా చెప్పాలంటే ఇది నీళ్లపై నడిచే విద్యుత్ పడవల నెట్వర్క్ ₹1,136.83 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. కేరళలోని ప్రధాన నగరం అయిన కొచ్చి వాసులకు నరకం చూపించే ట్రాఫిక్ నుంచి విముక్తి కలిగించే సంప్రదాయ మెట్రోకు తోడుగా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. కేరళ ప్రభుత్వం, జర్మనీకి చెందిన కేఫ్ డబ్ల్యూ బ్యాంక్ నిధులతో వాటర్ మెట్రో నిర్మించారు.
వాటర్ మెట్రోలో భాగంగా ప్రయాణికులను ఒక చోట నుంచి మరొక చోటుకు తీసుకెళ్లేందుకు ఎలక్ట్రిక్_ హైబ్రిడ్ బోట్లను వినియోగిస్తారు. ఈ బోట్ల రూపకల్పనలో కొచ్చి వాటర్ మెట్రో తిరుగులేని ప్రమాణాలు రూపొందించింది. ఫలితంగా “గూచి ఎలక్ట్రిక్ బోర్డ్స్” అవార్డు కూడా సాధించింది. ఇక ఈ వాటర్ మెట్రోను కొచ్చినగరం, చుట్టుపక్కల 78 కిలోమీటర్ల విస్తరించి ఉన్న పది దీవులను కలుపుతూ 38 టెర్మినళ్ళతో ఈ వాటర్ మెట్రో మార్గాన్ని రూపొందించారు. ఈ నెట్వర్క్ లో భాగంగా మొత్తం 78 విద్యుత్ బోట్లు ఉంటాయి. వీటిలో 23 కోట్లలో వంద మంది చొప్పున, మిగతా 55 బోట్లలో 50 మంది చొప్పున ప్రయాణించవచ్చు. ఏదైనా సాంకేతిక సమస్యతో బోట్లు ఆగిపోతే మరమ్మతులు నిర్వహించేందుకు నాలుగు రెస్క్యూ/ వర్క్ షాపు బోట్లను అందుబాటులో ఉంచారు. దివ్యాంగులు, వృద్ధులు ఎక్కేందుకు ప్లోటింగ్ జెట్టీలు కూడా ఏర్పాటు చేశారు. “కొచ్చి 1” అనే కార్డును ఉపయోగిస్తే సంప్రదాయ మెట్రో తో పాటు ఈ వాటర్ మెట్రో సేవలు కూడా వినియోగించుకోవచ్చు. ఈ మెట్రోలో వాడేవన్ని విద్యుత్ బోట్లు కావడంతో ఎటువంటి కాలుష్యం బెడద ఉండదు.
కేరళ రాజధాని తిరువనంతపురం అయినప్పటికీ.. వాణిజ్య రాజధానిగా కొచ్చి న గరం స్థిరపడిపోయింది. గత కొద్ది సంవత్సరాలుగా ఆ నగరం మరింత అభివృద్ధి చెందింది. చుట్టుపక్కల గ్రామాలను కలుపుతూ అంతకంతకు విస్తరించింది. దీంతో అక్కడ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వం మెట్రో వంటి వ్యవస్థను తీసుకువచ్చినప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం అంతంత మాత్రం గానే ఉంది. దీంతో ప్రభుత్వం తెరపైకి వాటర్ మెట్రోను తీసుకొచ్చింది. దీనివల్ల ప్రయాణికులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోకుండా త్వరగా తమ గమ్యస్థానం చేరుకోవచ్చు.. అంతేకాదు నీటి లో హాయిగా ప్రయాణం చేయవచ్చు.