Nara Lokesh: వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏర్పాటు చేసుకున్న వలంటీర్ల వ్యవస్థపై టీడీపీ స్వరం మారుతోంది. ముందు వద్దనా, ఇప్పుడు బాగుందని అంటున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వీరందరినీ తీసివేస్తారని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అడ్డుకట్ట వేశారు. తాము తీసివేయడం, కూల్చడాలు చేయమని అధికార పార్టీపై ఎద్దేవ చేస్తూనే, అసలు తమకు ఆ ఉద్దేశ్యమే లేదని స్పష్టం చేశారు. వలంటీర్లలో అభద్రతా భావాన్ని తొలగించి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రతి 50 కుటుంబాలకు ఓ వలంటీరును ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరు ప్రతి నెల పింఛన్లు అందివ్వడంతో పాటు, ఆ కుటుంబాల్లో ఏ అవసరం వచ్చినా సలహాలు, సూచనలు అందిస్తున్నారు. సచివాలయాలకు అనుబంధంగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. దీనిపై అధికార పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తమతో పని లేకుండా వలంటీర్లు అన్ని చక్కదిద్దుతుండటంతో, పార్టీని బలోపేతం చేయలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి వలంటీర్లు తప్పనిసరిగా ఉంటూ అధికార నేతలకు సహకారం అందిస్తున్నారు.
ప్రజలను ఒకరంగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న వలంటీర్లు రాబోవు ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వలంటీర్లను దూరంగా ఉండమని ఎలక్షన్ కమిషన్ కూడా సూచించింది. వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంతో వారిలో అభద్రతా భావం నెలకొంది. ఈ మేరకు టీడీపీ కూడా వలంటీర్ల వ్యవస్థకు అనుకూలంగా మాట్లాడుతూ ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా ఆ వ్యవస్థ కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.
వైసీపీలో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకునే పనిలో ఉన్న టీడీపీకి వలంటీర్ల రూపంలో ఎదురవుతున్న అడ్డంకిని సానుకూల వాతావరణంలో మారితేనే ఫలితం ఉంటుంది. దాంతో వారిపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. లోకేష్ అనుకూల ప్రకటన ఫలితం ఇచ్చినట్లుగానే కనబడుతోంది. ప్రతి చోట వలంటీర్లందరినీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో ప్రముఖంగా లోకేష్ అన్న మాటల ప్యాపర్ల కటింగ్ లు కొన్నిచోట్ల హల్ చల్ చేస్తున్నాయి.