Chandrayaan 3 : అన్ని దశల్లోనూ చెక్ చేశారు. కచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మారు. ప్రయోగాన్ని అనుకున్న సమయానికి ప్రారంభించారు. నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్ ఆకాశంలోకి పరుగులు తీసింది. చంద్రుడి కక్ష్య లోకి దూసుకెళ్లింది. సంబరాలు నిర్వహించడమే తరువాయి అని శాస్త్రవేత్తలు అనుకున్నారు. కానీ వారి అంచనాలను అది తలకిందులు చేసింది. కష్టపడి చేసిన ప్రయోగం విఫలమైంది. మూడు రంగుల పతాకాన్ని అంతరిక్షంలో ఎగరవేయాలి అనుకున్న భారత్ కల చెదిరిపోయింది. శాస్త్రవేత్తల కళ్ళలో నుంచి నీరు ఉబికి వచ్చింది. అదే చంద్రయాన్_2 ప్రయోగం. దీనిని ప్రయోగం అనేకంటే ఒక గుణపాఠం అనడం సబబు. ఇది ఇస్రోకు చాలా విలువైన పాఠాలను నేర్పింది.
తెలివైనదయినప్పటికీ..
ఐదేళ్ల క్రితం చేపట్టిన చంద్రయాన్-2లో భాగంగా.. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో రూపొందించిన విక్రమ్ ల్యాండర్ అత్యంత తెలివైనది. అయితే అది విజయవంతంగా ల్యాండయ్యే అవకాశాలు 50 శాతం కన్నా తక్కువని ఇస్రో శాస్త్రజ్ఞులు అప్పట్లోనే చెప్పారు. అవకాశాలు సగం సగం అని తెలిసినప్పటికీ రిస్క్ చేయడానికి వారు సిద్ధపడ్డారు. అందుకే ఆ మిషన్ విఫలమైనా అంతగా బాధపడలేదు సరికదా.. ఆ వైఫల్యం నుంచి నేర్చుకున్న పాఠాలతో మర్నాటి నుంచే చంద్రయాన్-3 మిషన్‌కు సిద్ధమయ్యారు.
డిజైన్ మార్పు
చంద్రయాన్-2లో ల్యాండర్ రూపకల్పనలో సక్సెస్ బేస్‌డ్ డిజైన్‌ను (అంటే అది విజయవంతం కావడానికి అనుసరించాల్సిన విధానాలను) ఉపయోగించిన ఇస్రో.. చంద్రయాన్-3లో ‘ఫెయిల్యూర్ బేస్‌డ్ డిజైన్’ను ఆశ్రయించింది. ల్యాండర్ విఫలం కావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ ముందే గుర్తించి, వాటిని తప్పించేలా వ్యవస్థలను అభివృద్ధి చేసుకునే విధానం ఇది.
థ్రస్టర్ల సంఖ్య తగ్గింపు: చంద్రయాన్-2లో ల్యాండర్ వేగాన్ని తగ్గించడానికి/అప్రోచ్ వెలాసిటీని కొనసాగించడానికి ఐదు థ్రస్టర్లను ఉపయోగించారు. దీనివల్ల పీడనం ఎక్కువై సమస్యలు వచ్చాయి. అందుకే ఈసారి థ్రస్టర్ల సంఖ్యను నాలుగుకు కుదించారు.
ల్యాండింగ్ ఏరియా విస్తరణ
చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్ దిగడానికి నిర్ణయించిన ప్రాంతం విస్తీర్ణం 500మీ. ఇది చాలా తక్కువ పరిధి. అందుకే ఈసారి ఆ తప్పు చేయకుండా.. ల్యాండింగ్ ఏరియా పరిధిని ఎక్కువగా నిర్ణయించారు. అంటే పరిస్థితులను బట్టి ఆ పరిధిలో ఎక్కడైనా ల్యాండర్ దిగొచ్చన్న మాట.
అధిక ఇంధనం
ల్యాండింగ్‌లో అవరోధాలు ఏర్పడినప్పుడు.. దారి మళ్లించుకుని వేరే చోట సురక్షితంగా దిగాలంటే ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది. అందుకే ఈసారి ల్యాండర్‌లో అధిక ఇంధనాన్ని ఉంచారు.
ల్యాండర్ లెగ్స్ బలోపేతం
ఒకవేళ ల్యాండర్ అనుకున్నదాని కన్నా వేగంగా చంద్రుడిపై దిగితే ఆ తాకిడి వల్ల కలిగే ప్రభావానికి దానిలోని వ్యవస్థలు దెబ్బతినకుండా ల్యాండర్ లెగ్స్‌ను బలోపేతం చేశారు.
మెరుగైన సెన్సర్లు
చంద్రయాన్-2తో పోలిస్తే.. ఈసారి ల్యాండర్‌లో చంద్రుడి ఉపరితలాన్ని మరింత సునిశితంగా విశ్లేషించే మెరుగైన సెన్సర్లను, సజావుగా ల్యాండ్ అయిన తర్వాత.. అధిక విద్యుదుత్పత్తికి వీలుగా అదనపు సౌర ఫలకాలను మన శాస్త్రజ్ఞులు అమర్చారు.
కొత్త కెమెరా
చంద్రయాన్-2 ల్యాండర్‌లో లేని విధంగా ఈసారి ల్యాండర్‌కు ప్రమాదాలను ముందే గుర్తించి వాటిని తప్పించుకునేలా ‘హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా’ను జోడించారు. ఇవి ఆర్బిటర్‌తో అనుసంధానమై పనిచేస్తుంటాయి. ల్యాండింగ్ ప్రక్రియలో ఇవి కీలకపాత్ర పోషించనున్నాయి. ల్యాండ్ అయ్యే క్రమంలో ఈ కెమెరా ఆ ప్రాంతాన్ని ఫొటో తీసి.. అక్కడ 30 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ పరిమాణం ఉండే రాళ్లు, రప్పల వంటివి ఉన్నాయేమో విశ్లేషిస్తుంది.
వర్టికల్ వెలాసిటీ కాంపొనెంట్ పెంపు
హయ్యర్ వెలాసిటీ సమస్యను అధిగమించేందుకు.. ల్యాండర్‌లో వర్టికల్ వెలాసిటీ కాంపొనెంట్‌ను సెకనుకు 3 మీటర్లకు పెంచారు. చంద్రయాన్-2లో ఇది సెకనుకు 2 మీటర్లుగా ఉండేది.
సొంత ఫొటోలు
చంద్రయాన్-2లో ల్యాండింగ్ ప్రదేశాన్ని పోల్చుకోవడానికి మన ల్యాండర్‌లోని కెమెరాలకు వేరే దేశాలు తీసిన ల్యాండింగ్ సైట్ల ఫొటోలను ఇన్‌పుట్‌గా ఇచ్చారు. కానీ, ఈసారి ఆ పొరపాటు చేయలేదు. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్ తీసిన ల్యాండింగ్ సైట్ ఫొటోలను విక్రమ్ ల్యాండర్‌కు ఇస్తున్నారు.
..ఇవి ల్యాండర్‌కు చేసిన మార్పులు. ఇవి కాక.. చంద్రయాన్-2 మిషన్‌లో భాగంగా పంపిన ఆర్బిటర్ స్థానంలో ఈసారి ప్రొపల్షన్ మాడ్యూల్‌ను పంపిన సంగతి తెలిసిందే. ఆర్బిటర్‌లో 9 పరికరాలు ఉండగా.. ప్రొపల్షన్ మాడ్యూల్‌లో ‘షేప్ (స్పెకో్ట్ర-పోలార్‌మెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెటరీ ఎర్త్)’ అనే ఒకే ఒక్క పరికరం ఉంటుంది. ఆర్బిటర్‌లోని 9 పరికరాలు చేసే పనినీ అది ఒక్కటే చేయగలదు.