Black Tiger : దేశంలో పులులను చూసి చాలా కాలమైంది. ఎందుకంటే అవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. పులుల జాడ కూడా కనిపించడం లేదు. అడవుల్లో , అభయారణాల్లో, జూలల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. తాజాగా ఒడిశాలో ఓ అరుదైన పులి కనిపించింది. అది నల్ల పులి. దేశంలోనే ఇది అరుదైనదిగా చెబుతున్నారు. ఈ నల్లపులి వీడియో కెమెరాకు చిక్కడంతో వైరల్ అయ్యింది.

సాధారణంగా పులులు గోధుమ, తెలుపు రంగులో కనిపిస్తుంటాయి. అయితే ఒడిశా అడవుల్లో ఓ నల్లపులి కెమెరా కంటికి చిక్కింది. ఈ పులిపై పసుపు చారలు తక్కువ సంఖ్యలో ఉండగా.. అత్యధిక భాగం నలుపురంగులోనే ఉంది. సౌమెన్ బాజ్ పాయ్ అనే ఫొటోగ్రాఫర్ ఈ నల్లపులిని ఫొటోలు తీయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని సిమ్లిపాల్ పులుల అభయారణ్యంలో ఈ నల్లపులిని గుర్తించారు.
అడవిలో ఫొటోల కోసం వెళ్లినప్పుడు అనేక పులులు, ఇతర జంతువులు, పక్షులు కనిపించాయని సామెన్ బాజ్ పాయ్ తెలిపారు. ఉన్నట్టుండి ఈ నల్లపులి రావడంతో మొదట దాన్ని పులి అని గుర్తించలేకపోయారు. ఆ తర్వాతే అరుదైన నల్లపులి అని గుర్తించారు. ఈ బ్లాక్ టైగర్ ను కొన్ని ఫొటోలు తీశారు. ఇలాంటి పులి అరుదైనది.
ఒడిశాలోని అటవీ ప్రాంతాల్లో నల్లపులులు కనిపించడం ఇదే తొలిసారి కాదు. 90వ దశకంలోనూ ఇదే ప్రాంతంలో ఓ నల్లపులిని చూశారు. కొన్ని పులులు జన్యులోపలతో ఇతర రంగుల్లో దర్శనమిస్తుంటాయి. పులుల్లో మెలనిన్ పదార్థం ఎక్కువైనప్పుడు నలుపు రంగులో కనిపిస్తాయి. పరిమాణంలో రాయల్ బెంగల్ టైగర్ కంటే కాస్త చిన్నదిగా కనిపించే ఈ నల్లపులులు ప్రస్తుతం దేశంలో వేళ్లమీద లెక్కించగలిగే స్థాయిలోనే ఉన్నట్టు తెలిసింది.