Tollywood Crisis: టాలీవుడ్ హీరోలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని.. తమకు బతుకును ఇచ్చిన సినిమా ఇండస్ట్రీకి, ఊపిరిని అద్దాలని సగటు సినీ ప్రేమికుడు బలంగా కోరుకుంటున్నాడు. కానీ, ఇన్నేళ్లు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. తమ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాంతం బకెట్ తన్నేసినా హీరోలు మాత్రం మారలేదు. ఒక స్టార్ హీరో తన రెమ్యునరేషన్ లో 10 % పెంచితే.. అది చూసి మరో స్టార్ హీరో తన రెమ్యునరేషన్ లో 20 % పెంచుతాడు. ఇది గత కొన్నేళ్లుగా హీరోలకు అలవాటు అయిపోయింది. ఫలితంగా ఒక స్టార్ హీరో రెమ్యునరేషన్ సినిమా బడ్జెట్‌లో ఏకంగా 70 శాతం వరకు ఉంటుంది. ఇక దర్శకనిర్మాతలు.. మిగిలిన 30 % బడ్జెట్ లో సినిమాని ఎలాగోలా చుట్టేసి ప్రేక్షకులపై వదులుతున్నారు. ఇక్కడ ఇంకో లెక్క ఉంది, దర్శకుడు కూడా స్టార్ అయితే, అతగాడికి లాభాల్లో 30 % నుంచి 40 % వరకు వాటా ఇవ్వాలి.

అసలు టాలీవుడ్ లో ఫిల్మ్ కాస్ట్ ఆఫ్ మేకింగ్ పెరగడానికి ప్రధాన కారణం ఈ స్టార్ల రెమ్యునరేషనే. హీరోలు ఆకాశాన్ని తాకే రెమ్యునరేషన్ అడుగుతుండటంతో.. ప్రొడ్యూసర్స్ మిగతా ఖర్చుల పై, అలాగే మిగతా టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ల పై కోతలు విధిస్తున్నారు. ఉదాహరణకు ఆ మధ్య రిలీజ్ అయిన మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాని తీసుకుందాం. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందించాడు. అయితే, థమన్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ను మాత్రం ఈ సినిమాకి కొట్టలేదు. దాంతో, ఈ సినిమా మైనస్ పాయింట్స్ లో మెయిన్ పాయింట్ మ్యూజికే అయింది. మహేష్ సినిమాకి కూడా థమన్ ఎందుకు సరైన మ్యూజిక్ ను అందించలేదు అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. కారణం ఒక్కటే.. థమన్ కి నిర్మాత ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ లో కోత పడింది. దాంతో సర్కారు సినిమా మ్యూజిక్ పై థమన్ ఫుల్ ఫోకస్ పెట్టలేదు. చివరకు ఆ సినిమా పరాజయంలో మ్యూజిక్ కూడా భాగమైంది. ఇది ఒక్క మ్యూజిక్ విషయంలోనే కాదు, అన్నీ విషయాల్లోనూ ఇలాగే జరుగుతుంది.
అందుకే, స్టార్ హీరోల సినిమాల్లో సాంకేతిక నిపుణుల అవుట్ ఫుట్ ఒక్కోసారి అద్వానంగా ఉంటుంది. కేవలం హీరోలు, స్టార్ డైరెక్టర్లు ఇద్దరూ తమ రెమ్యునరేషన్ ను విచ్చలవిడిగా పెంచడం కారణంగానే ఈ దుస్థితి ఏర్పడింది. ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటైన ఈ సమస్య ఇలాగే కొనసాగితే.. మరో కొన్నేళ్లలోనే టాలీవుడ్ ఆర్థికంగా పూర్తిగా మునిగిపోతుంది. దివంగత దర్శక దిగ్గజం దాసరి గారు బతికి ఉన్న రోజుల్లో హీరోలు ఇలాగే భారీ మొత్తంలో రెమ్యునరేషన్లు డిమాండ్ చేస్తూ మొండిగా ముందుకు పోతే ఇక ఇండస్ట్రీ బతకదు అని ఎంతో ఆవేదన చెందేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితే దాపురించింది.
సినిమా బడ్జెట్ పెరిగింది కాబట్టి.. సినిమా టికెట్ రేట్ రెండితులు చేస్తూ నిర్మాతలు ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నిజానికి సినిమా చూడకుండా మన ప్రేక్షకుల్లో ఎక్కువమంది ఉండలేరు. తెలుగు వారికి సినిమాలతో విడదీయరాని అనుబంధం ఉంది. సినిమా ఓ సందేశాత్మక కళ అనేదానికంటే.. సినిమా అంటే పిచ్చి అనే స్థాయికి తెలుగు ప్రేక్షకులు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఆ సినిమా టికెట్స్ కోసం ఫ్యాన్స్ ఎగబడతారు. థియేటర్లను కొత్త పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తారు. స్టార్ హీరో సినిమా పై ప్రేక్షకులకు ఇంత ఆసక్తి ఉంటుంది. ఈ ఆసక్తినే క్యాష్ చేసుకోవడానికి సినిమా టికెట్స్ ధరలను నాలుగింతలు పెంచుతున్నారు.

రిలీజైన మొదటి రెండు రోజులు ఈ టికెట్ ధరలను పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. దాంతో అధిక థియేటర్లలో తమ సినిమాని రిలీజ్ చేసేసి.. మొదటి రెండు రోజులలోనే కలెక్షన్స్ అన్నీ రాబట్టాలని నిర్మాతలు ఇన్నేళ్లు ప్లాన్ చేస్తూ వచ్చారు. ఈ ప్లానే ఇన్నాళ్లు సామాన్యుడి జేబులను గుల్ల చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీకే ఇది గుదిబండలా తయారైంది. ప్రస్తుత రోజుల్లో ఒక సినిమా యాక్టివ్ లైఫ్ కేవలం రెండు రోజులే. వందల రోజుల సినిమా లైఫ్ ను రెండు రోజులకు తీసుకువచ్చిన ఘనత మాత్రం దిల్ రాజు, అరవింద్, సురేష్ బాబు లాంటి కొందరు బడా నిర్మాతలకే దక్కుతుంది. వీళ్ళు చేసిన తప్పు, ఇప్పుడు మొత్తం టాలీవుడ్ నే ముంచుతుంది. అందుకే.. పూర్తిగా ఇండస్ట్రీ మునిగిపోక ముందే హీరోలు మేల్కోవాలి. తమ రెమ్యునరేషన్ల విషయంలో వెనక్కి తగ్గాలి. అప్పుడు ప్రొడక్షన్ కాస్ట్‌లో భారీ తేడా కనిపిస్తోంది. మేకింగ్ కాస్ట్ సగానికి తగ్గుతుంది. దీని వల్ల సినిమాకి అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా థియేట్రికల్ బిజినెస్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది. అప్పుడు టికెట్ రేట్లు అధికంగా పెంచాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే టికెట్ రేట్లు అందుబాటులోకి వస్తాయో.. అప్పుడు ఫ్యామిలీస్ కూడా గతంలో లాగా సినిమాలకు వస్తారు. పైగా సినిమా ఫ్లాప్ అయినా.. సినిమాని కొనుకున్న బయ్యర్లకు వచ్చే నష్టాల స్థాయి తగ్గుతుంది. కాబట్టి.. సినిమా ఇండస్ట్రీ పదికాలాల పాటు బతుకుతుంది. తమకు బతుకుతెరువు చూపిన ఇండస్ట్రీని బతికించడానికి హీరోలు ఇప్పటికైన మేలుకోండి.
Also Read:Jabardast New Anchor: ‘జబర్దస్త్’ ట్విస్ట్.. కొత్త యాకంర్.. డిఫరెంట్ ఎట్రీ!
[…] […]
[…] […]
[…] […]