తొలి భారతీయులు వీళ్లే.. డీఎన్ఏ రిపోర్ట్!

DNA.. మనిషి జన్మ రహస్యాన్ని శోధించేందుకు ఉపయోగపడే రీసెర్చ్. ఇంకాస్త లోతుగా వెళ్తే.. 7thసెన్స్ సినిమాలో మాదిరిగా పూర్వీకుల శక్తి సామర్థ్యాలకూ ప్రాణం పోసే పరిశోధన. కానీ.. భారతీయుడి పుట్టు పూర్వోత్తరాలను కూడా వెలికితీయొచ్చని తేల్చింది! అక్షరాలు పుట్టని సమయంలో పురుడు పోసుకున్న భారతీయ సంస్కృతిని, చరిత్ర పుస్తకాలకు అందకుండా మరుగున పడిఉన్న మన చారిత్రక అంశాలను ఆవిష్కరించింది ఓ డీఎన్ఏ పరిశోధన! ఇప్పుడు మనం భారతీయులం. మన తాతలు, ముత్తాతలు కూడా ఇండియన్సే. మరి, వారి […]

Written By: Neelambaram, Updated On : December 13, 2020 10:11 am
Follow us on


DNA.. మనిషి జన్మ రహస్యాన్ని శోధించేందుకు ఉపయోగపడే రీసెర్చ్. ఇంకాస్త లోతుగా వెళ్తే.. 7thసెన్స్ సినిమాలో మాదిరిగా పూర్వీకుల శక్తి సామర్థ్యాలకూ ప్రాణం పోసే పరిశోధన. కానీ.. భారతీయుడి పుట్టు పూర్వోత్తరాలను కూడా వెలికితీయొచ్చని తేల్చింది! అక్షరాలు పుట్టని సమయంలో పురుడు పోసుకున్న భారతీయ సంస్కృతిని, చరిత్ర పుస్తకాలకు అందకుండా మరుగున పడిఉన్న మన చారిత్రక అంశాలను ఆవిష్కరించింది ఓ డీఎన్ఏ పరిశోధన! ఇప్పుడు మనం భారతీయులం. మన తాతలు, ముత్తాతలు కూడా ఇండియన్సే. మరి, వారి తొలితరం పూర్వీకులు…??? రండి.. మన వంశ వృక్షం తాలూకు వివరాలను తరచి చూసుకుందాం.. ఆర్టికల్ తెరిచి చదువుకుందాం..

Also Read: ‘పెళ్లికాని ప్రసాద్’ ల బాధ ఇదీ!

ఇండియన్స్ ఎవరు..?
భారతీయులు ఎవరు? వారి మూలాలు ఎక్కడివి? ఈ మట్టిలోనే పురుడు పోసుకున్నారా? ఎక్కడి నుంచైనా పొట్ట చేతపట్టుకొని వచ్చారా? దశాబ్దాలుగా వీడని ఈ చిక్కుముడి ఇది. మహత్తరమైన సింధూ నాగరికత వ్యవస్థాపకులే.. తొలి ఇండియన్స్ గా చాలా మంది పురాతత్వ శాస్త్రవేత్తలు, మేధావులు, పరిశోధకులూ చెబుతుంటారు. మరికొందరు మాత్రం ఆర్యులే అసలైన భారతీయులని అంటూ ఉంటారు. ఈ చర్చ ఇటీవల తీవ్రమైంది. ఈ నేపథ్యంలో వెలువడిన ఓ డీఎన్ఏ పరిశోధన.. తొలి భారతీయులు ఎవరో తేల్చి చెప్పింది.

ఇదీ.. కొందరి విశ్లేషణ!
ప్రపంచం ఘనమైన నాగరికతలుగా పరిగణించే ఈజిప్టు, మెసపటోమియా నాగరికతలు విలసిల్లిన కాలానికి కొంచెం అటూ ఇటుగా.. నేటి వాయవ్య భారత్, పాకిస్తాన్‌లలో సింధూ లోయ నాగరికత ఫరిడవిల్లింది. దాదాపు 1500 సంవత్సరాలు ఈ నాగరికత విలసిల్లింది. ఆ తర్వాత కరువు కాటకాలకు తోడు.. ఇతరులు దాడిచేయడం వల్ల ఈ నాగరికత అంతరించి ఉండొచ్చని చెబుతారు. ఈ నాగరికత అంతమైన తర్వాత ఈ దేశానికి వచ్చిన చాలా వలస సమూహాల్లో ఆర్యులది ఒకటి అని భారతీయ మేధావులు చాలా మంది చెబుతారు. అసలు సింధూ నాగరికతపై దాడి చేసింది కూడా ఆర్యులే అనే వాదన కూడా ఉంది. పశువులు పెంచుతూ సంచార జీవితం సాగించే ఆర్యులు.. వాటిని మేపుకుంటూ భారతదేశానికి వచ్చారనేది బలమైన వాదన.

మరికొందరి వాదన..
పై విశ్లేషణను విభేదించేవారు కూడా ఉన్నారు. ఆర్యులే అసలైన ఇండియన్స్ అని, సింధూలోయ నాగరికత కూడా ఆర్యులదే అని అంటారు. దీనినే వైదిక నాగరికత అనికూడా అంటారు. ఆర్యులు భారత్‌లోనే పుట్టారని, తర్వాత ఆసియా, ఐరోపాలోని చాలా ప్రాంతాలకు విస్తరించారని వీరు వాదిస్తారు. ఆర్యులదే సర్వోన్నత జాతి అని, యూరప్‌ను జయించింది ఆర్యులేనని 19వ శతాబ్దానికి చెందిన మానవ సామాజిక పరిశోధకులు, అడాల్ఫ్ హిట్లర్ లాంటి నాయకులు భావించేవారు.

Also Read: ఏలూరు నగరంపై కాలుష్యం పడగ.. పట్టించుకోకపోతే పెనుముప్పు..?

పెరుగుతున్న వివాదం..
సింధూ లోయ నాగరికత తర్వాత ఆర్యుల నాగరికత ఏర్పడిందనేవారికి, సింధూ నాగరికత కూడా ఆర్యుల నాగరికతేనని వాదించేవారికి ఈ మధ్య కొన్నేళ్లుగా విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. ఎవరికి వారు తమ విశ్లేషణే సరైందని చెపుతున్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ వివాదం నేపథ్యంలో కొత్త అంశమైన ‘పాపులేషన్ జెనెటిక్స్’ లోతైన విషయాలను వెల్లడిస్తోంది. అంటే.. పూర్వం మనుషులు ఎక్కడి నుంచి ఎక్కడకు వలస వెళ్లారో నిర్ఠారించేందుకు పురాతన డీఎన్‌ఏపై ఈ పరిశోధనలు చేస్తారు.

ఆసక్తికర విషయాలు..
పురాతన డీఎన్‌ఏపై ఆధారపడే పరిశోధనల్లో వెల్లడైన ఫలితాలు కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఈ ఫలితాలు.. అప్పటివరకున్న చరిత్రలను తిరగరాస్తున్నాయి. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జన్యుశాస్త్ర పరిశోధకుడు డేవిడ్ రీచ్ నేతృత్వంలోని ఒక బృందం 2018 మార్చిలో ఒక అధ్యయన ఫలితాలను ప్రచురించింది. ఇందులో ప్రపంచం నలుమూలలకు చెందిన 92 మంది స్కాలర్లు వివిధ అంశాలపై తమ పరిశోధన వివరాలను రాశారు. జన్యుశాస్త్రం, చరిత్ర, పురావస్తు శాస్త్రం(ఆర్కియాలజీ), మానవ పరిణామ శాస్త్రం(ఆంత్రోపాలజీ) లాంటి రంగాల్లో ఎంతో ప్రముఖమైన వారు ఈ జాబితాలో ఉన్నారు.

చరిత్ర తిరగ రాస్తోన్న ఫలితాలు..
ఈ పరిశోధనలు భారత్‌కు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలను వెల్లడిస్తున్నాయి. “ద జినోమిక్ ఫార్మేషన్ ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏసియా” అనే శీర్షికతో వెలువడిన ఈ అధ్యయనంలో భారతీయులందరినీ ఆశ్చర్యపరిచే అంశాలు ఉన్నాయి.

* గడిచిన 10 వేల సంవత్సరాల్లో.. భారత్‌లోకి ప్రధానంగా రెండు వలసలు జరిగాయని ఈ అధ్యయనం వెల్లడిస్తోంది. దీని ప్రకారం.. మొదటి వలస నైరుతి ఇరాన్‌లోని జాగ్రోస్ ప్రాంతంలో మొదలైంది.

* మనుషులు మేకలను మచ్చిక చేసుకొన్నారనే తొలి ఆధారం జాగ్రోస్ ప్రాంతంలోనే బయటపడింది.

* ఈ వలసలోనే జాగ్రోస్ నుంచి వ్యవసాయదారులు భారత్‌కు వచ్చారు. వీరు పశుపోషకులు అయ్యుండొచ్చు.

* బిఫోర్ కామన్ ఎరా(బీసీఈ) 7000, బీసీఈ 3000 సంవత్సరాల మధ్య ఈ వలస జరిగి ఉండొచ్చు.

* జాగ్రోస్ ప్రాంతం నుంచి వచ్చినవారు ఉపఖండంలో అప్పటికే నివసిస్తున్న తొలి భారతీయుల్లో (ఫస్ట్ ఇండియన్స్‌లో) కలిసిపోయారు. వీరిద్దరూ కలిసి సింధూ లోయ నాగరికతను సృష్టించారు.

* ఈ తొలి భారతీయులు ఎవరంటే.. సుమారు 65 వేల సంవత్సరాల క్రితం వచ్చిన ఆఫ్రికా (ఔట్ ఆఫ్ ఆఫ్రికా-వోవోఏ) వలసదారుల వారసులు.

వీరి తర్వాతనే ఆర్యులు..
2000 బీసీఈ తర్వాత శతాబ్దాల్లో మరో వలసదారుల సమూహం వచ్చింది. అలా వచ్చినవారే ఆర్యులు! యురేషియన్ స్టెప్పీ ప్రాంతం (బహుశా నేటి కజకిస్థాన్ ప్రాంతం) నుంచి వీరు వలస వచ్చి ఉండొచ్చు. ప్రారంభ దశలో ఉన్న సంస్కృత భాషను వీళ్లు తమతోపాటు భారత్‌కు తీసుకొని వచ్చి ఉండొచ్చు. గుర్రాలను మచ్చిక చేసుకోవడం, వాటిని వాడుకోవడంలో వీరికి ప్రావీణ్యం ఉంది. బలి ఇవ్వడం లాంటి సంప్రదాయాలను వీరు పాటించారు. తొలి దశ హైందవ/వైదిక సంస్కృతికి ఇవే మూలమయ్యాయి. (భారత్‌కు ఈ వలస జరగడానికి వెయ్యేళ్ల ముందు స్టెప్పీ ప్రాంతం నుంచి ఐరోపాకు కూడా ప్రజలు వలస వెళ్లారు. అంటే.. మనం చెప్పుకుటున్న ఆర్యులు. అప్పటికే అక్కడున్న వ్యవసాయదారులతో వీరు కలిసిపోవడం లేదా వారి స్థానంలోకి వీరు రావడం జరిగింది. ఆ విధంగా.. కొత్త సంస్కృతులు ఏర్పడ్డాయి. కొత్త ఇండో-యూరోపియన్ భాషలు ఈ విధంగానే వ్యాప్తి చెందాయి.) ఈ వివరాలను “ఎర్లీ ఇండియన్స్: ద స్టోరీ ఆఫ్ అవర్ యాన్‌సెస్టర్స్ అండ్ వేర్ వి కమ్ ఫ్రమ్” అనే పుస్తకంలో రచయిత టోనీ జోసెఫ్ మరింత లోతుగా విశ్లేషించారు.

Also Read: ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం కేసీఆర్.. ఏం చర్చించారు?

మెజారిటీ పరిశోధనలు..
దాదాపు 65 శాతం వరకు అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.. భారతీయుల జన్యు మూలాలు తొలి భారతీయులవేనని. అంటే.. అర్యులకన్నా ముందు ఉన్నవారివి. కానీ.. ఆర్యులే అసలైనవారు అని నమ్మేవారికి ఈ అధ్యయన ఫలితాలు రుచించవు. అందుకే.. ఆర్యులు భారత్‌లోకి వలస వచ్చారనే సిద్ధాంతాన్ని సమర్థించే భారత ప్రముఖ చరిత్రకారులపై సోషల్ మీడియాలో చాలా కాలంగా పలువురు దాడులు చేస్తున్నారు. అంతేకాదు.. ఆర్యులు విదేశాల నుంచి వచ్చారని ఇప్పటికే పాఠ్య పుస్తకాల్లో ఉన్న అంశాలను కూడా మార్పించేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భిన్నత్వంలో ఏకత్వమే భారతీయత..
తొలి భారతీయుల మూలాలతోపాటు ఈ అధ్యయనం మరో అద్భుతమైన విషయాన్ని రుజువు చేసింది. సగటు భారతీయుడు అంగీకరించే వాస్తవాన్ని మరోసారి చాటింది. అదే.. భిన్నత్వంలో ఏకత్వం! భారతీయులు విభిన్నమైన మూలాలు కలిగిన వారు అని చెప్పిన ఈ రీసెర్చ్.. ఇక్కడివారు వివిధ చరిత్రలు, సంస్కృతి, సంప్రదాయాల ద్వారా సుస్థిరమైన నాగరికతను నిర్మించుకున్నారని తెలిపింది. భారత నాగరికత అత్యుత్తమ దశల్లో కనిపించిన గొప్ప లక్షణం.. అందరినీ కలుపుకొనే తత్వం. ఎవరినీ వేరుచేసి చూడని మనస్థత్వం భారతీయులదన్న పరిశోధన.. భిన్నత్వంలో ఏకత్వం అనే భావన భారత జన్యు నిర్మాణంలోనే ప్రధానాంశంగా ఉందని వెల్లడించింది.

ఏకత్వం సాగనీ..
చారిత్రక అంశాలు ఏవైనా సరే అవి వర్తమానానికి ఊతంగా ఉంటూ.. భవిష్యత్ ను ఉజ్వలంగా మార్చుకునేందుకు ఉపయోగపడాలి. దేశంలో తొలి మూలాలు ఎవరివైనా.. అది గతించిన చరిత్ర. దాన్నెవరూ మార్చలేరు. సగటు భారతీయుడిగా ఇప్పుడు అందరూ చేయాల్సింది.. అసలైన భారతీయతను కాపాడటమే. అందరినీ కడుపులో దాచుకునే సంస్కృతి భారతీయులది. సోదర భావం భారతీయత మూలాల్లోనే ఉంది. ఎన్నో.. పరిశోధనలు, తాజా డీఎన్ఏ రీసెర్చ్ కూడా దీన్ని మరోసారి చాటి చెప్పింది. ప్రపంచంలో మరెక్కడా లేని జీవన విధానికి భారతదేశం నెలవు. ఈ స్ఫూర్తి కొనసాగినంత కాలం భారత కీర్తిపతాక విశ్వ వినువీధుల్లో రెపరెపలాడుతూనే ఉంటుంది.

– నక్క రాధాకృష్ణ

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్