Unbelievable Places: ప్రకృతి అనేక అద్భుతాల సమ్మేళనం.” మనిషి ప్రకృతి మీద పట్టు సాధించాడు.. ప్రకృతిని తన అదుపులో పెట్టుకున్నాడని” మనం తరచూ చదువుతుంటాం. కొన్ని సందర్భాల్లో అది నిజమైనప్పటికీ.. చాలా సందర్భాల్లో అది నిజం కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రకృతి అనేది అంతుచిక్కని అద్భుతాలకు, అనంతమైన విచిత్రాలకు నెలవు. పగటిపూట ప్రకాశవంతంగా.. రాత్రిపూట నిర్మలంగా కనిపించే ప్రకృతి.. మనదేశంలో రాత్రిపూట కూడా ప్రకాశిస్తుంది. అలాంటి ప్రాంతాలు ఎక్కడున్నాయో.. ఈ కథనంలో తెలుసుకుందాం
వెస్ట్ జయంతియా హిల్స్, మేఘాలయ
ప్రకృతి రమణీయతకు పేరెన్నిక గల మేఘాలయ రాష్ట్రంలో బెస్ట్ జయంతియా హిల్స్ జిల్లాకు ప్రత్యేకమైన పేరు ఉంది. ఈ జిల్లాలో విద్యుత్ పుట్టగొడుగులు ప్రత్యేక ఆకర్షణ. శిలీంధ్ర జాతికి చెందిన పుట్టగొడుగులు రాత్రిపూట తమంతట తామే కాంతిని వెదజల్లుతాయి. అడవులలో స్థానికులకు ఇవి సహజ మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. రోరి డొమైసిస్ అనే జాతికి చెందిన ఈ పుట్టగొడుగులు రాత్రిపూట మిణుగురు పురుగుల లాగా కాంతిని వెదజల్లుతాయి. ఈ శిలీంద్ర జాతికి చెందిన పుట్టగొడుగులపై పరిశోధకులు అనేక రకాల ప్రయోగాలు చేశారు. అయినప్పటికీ అవి ఎందుకు రాత్రిపూట కాంతిని వెదజల్లుతున్నాయో కనుగొనలేకపోయారు.

పురుష్ వాడి ఫారెస్ట్, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని పురుష్ వాడి ఫారెస్ట్ లో మే, జూన్ కాలంలో స్వయంగా ప్రకాశిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం అక్కడి బయోలుమిని సెన్స్(అంటే ఒక జీవి ద్వారా కాంతి ఉత్పత్తి కావడం). అక్కడ చెట్ల పూలలో మకరందాన్ని స్వీకరించడానికి తుమ్మెదలు రాత్రిపూట ఒక సమూహంగా బయలుదేరుతాయి. అలాంటప్పుడు వాటి శరీరం ద్వారా కాంతిని ప్రసరింపజేస్తాయి. అవి ప్రసరింపజేసే శాంతి ద్వారా అడవి మిలమిల మెరుస్తుంది. మే, జూన్ కాలంలో తుమ్మెదలు ఇలా కాంతిని వెదజల్లుతున్న సందర్భాన్ని చూసేందుకు పర్యాటకులు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు.

జుహు బీచ్, మహారాష్ట్ర
మహారాష్ట్రలో జుహు బీచ్ కు ఎంతో చరిత్ర ఉంది. బీచ్ నోక్టీ లూకా సింటి ల్లాన్స్ సౌజన్యంతో ఎలక్ట్రిక్ బ్లూ కాంతులను వెదజల్లుతుంది. రాత్రిపూట ఎనిమిది గంటల సమయంలో ఈ బీచ్ అత్యంత రమణీయంగా మెరిసిపోతుంది. నీలం రంగులో మెరుస్తున్న అలలను ఆస్వాదించేందుకు ఆ ప్రాంతానికి చాలామంది పర్యాటకులు వెళ్తుంటారు.

హేవ్ లాక్ ద్వీపం, అండమాన్
హేవ్ లాక్ ద్వీపాన్ని స్వరాజ్ ద్వీపం అని కూడా పిలుస్తారు. ఈ సముద్రంలో ఉండే ఫైటో ప్లాంక్టన్ జీవులు డిసెంబర్, జనవరి మధ్య సముద్రం ఒడ్డుకి వస్తాయి. రాత్రి పూట తమ శరీరంలో ఉన్న ప్రత్యేక నిర్మాణం ద్వారా కాంతిని వెదజల్లుతాయి. అప్పుడు చూసేందుకు ఆ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. ఆ సమయంలో బీచ్ ఒడ్డున ఉన్నవారికి సరికొత్త అనుభూతి లభిస్తుంది.

బేతాల్బాటిమ్ బీచ్, గోవా
గోవా ప్రాంతం అందమైన బీచ్ లకు ప్రసిద్ధి. దక్షిణ గోవాలో ఉన్న బేతాల్ బాటిమ్ బీచ్ ప్రత్యేకత వేరు.. ఇక్కడి తెల్లని ఇసుక, డాల్ఫిన్ ల సందడి, వీనుల విందు చేసే సూర్యాస్తమయాలు పర్యాటకుల మదిని దోచుకుంటాయి.. చీకటి పడిన తర్వాత ఈ బీచ్ లో కొన్ని జంతువులు సమూహంగా ఏర్పడి అధి వాస్తవిక కాంతిని ప్రసరింపజేస్తాయి. అప్పుడు ఆ ప్రాంతం చూసేందుకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నీలి సముద్ర జలాలు.. నిశ్చలంగా ఆకాశం.. సముద్ర జంతువుల వెలుగులు.. చూడ్డానికి ఈ సన్నివేశం పర్యాటకులకు సరికొత్త అనుభూతినిస్తుంది.
మట్టు బీచ్, కర్ణాటక
కర్ణాటక ప్రాంతంలో మట్టు బీచ్ చాలా ఫేమస్.. ఇక్కడ రాత్రిపూట సముద్ర జలాలు మెరిసిపోతూ ఉంటాయి. ఇలా మెరవడాన్ని “నోక్టి లూకా సింటిల్లాన్స్” అని పిలుస్తారు.. సముద్రంలో నివసించే జంతువులు కాంతిని వెదజల్లడం వల్ల ఆ జలాలు అలా మెరిసిపోతూ ఉంటాయి.. చీకటి పడినప్పుడు ఈ దృశ్యం చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా.. ప్రకాశవంతంగా కనిపిస్తుంది.