HomeజాతీయంChandrayaan 3 : ఇస్రో "చంద్ర" జైత్రయాత్ర.. వీటిదే ముఖ్య పాత్ర

Chandrayaan 3 : ఇస్రో “చంద్ర” జైత్రయాత్ర.. వీటిదే ముఖ్య పాత్ర

Chandrayaan 3 : విజయం కిక్ ఇస్తుంది. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు నాంది పలుకుతుంది. అదే పరాజయం కొంగుబాటుకు కారణం అవుతుంది. కానీ ఈ పరాజయం నుంచే ఇస్రో పాఠాలు నేర్చుకుంది. చంద్రయాన్_2 వైఫల్యం నుంచి చంద్రయాత్ర మొదలుపెట్టింది. ఫలితంగా చంద్రుడి మీద విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన నాలుగవ దేశంగా చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం విజయవంతం అయ్యేందుకు ఇస్రో ఎన్నో మార్పులు చేర్పులు చేసింది. చంద్రయాన్_3 విజయవంతమైన నేపథ్యంలో ఒక్కసారి వాటి గురించి తెలుసుకుందాం.

డిజైన్‌ మార్పు

చంద్రయాన్‌-2లో ల్యాండర్‌ రూపకల్పనలో సక్సెస్‌ బేస్‌డ్‌ డిజైన్‌ను (అంటే అది విజయవంతం కావడానికి అనుసరించాల్సిన విధానాలను) ఉపయోగించిన ఇస్రో.. చంద్రయాన్‌-3లో ‘ఫెయిల్యూర్‌ బేస్‌డ్‌ డిజైన్‌’ను ఆశ్రయించింది. ల్యాండర్‌ విఫలం కావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ ముందే గుర్తించి, వాటిని తప్పించేలా వ్యవస్థలను అభివృద్ధి చేసుకునే విధానం ఇది.

థ్రస్టర్ల సంఖ్య తగ్గింపు

చంద్రయాన్‌-2లో ల్యాండర్‌ వేగాన్ని తగ్గించడానికి/అప్రోచ్‌ వెలాసిటీని కొనసాగించడానికి ఐదు థ్రస్టర్లను ఉపయోగించారు. దీనివల్ల పీడనం ఎక్కువై సమస్యలు వచ్చాయి. అందుకే ఈసారి థ్రస్టర్ల సంఖ్యను నాలుగుకు కుదించారు.

ల్యాండింగ్‌ ఏరియా విస్తరణ

చంద్రయాన్‌-2లో విక్రమ్‌ ల్యాండర్‌ దిగడానికి నిర్ణయించిన ప్రాంతం విస్తీర్ణం 500మీ. ఇది చాలా తక్కువ పరిధి. అందుకే ఈసారి ఆ తప్పు చేయకుండా.. ల్యాండింగ్‌ ఏరియా పరిధిని ఎక్కువగా నిర్ణయించారు. అంటే పరిస్థితులను బట్టి ఆ పరిధిలో ఎక్కడైనా ల్యాండర్‌ దిగొచ్చన్న మాట.

అధిక ఇంధనం

ల్యాండింగ్‌లో అవరోధాలు ఏర్పడినప్పుడు.. దారి మళ్లించుకుని వేరే చోట సురక్షితంగా దిగాలంటే ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది. అందుకే ఈసారి ల్యాండర్‌లో అధిక ఇంధనాన్ని ఉంచారు.

ల్యాండర్‌ లెగ్స్‌ బలోపేతం

ఒకవేళ ల్యాండర్‌ అనుకున్నదాని కన్నా వేగంగా చంద్రుడిపై దిగితే ఆ తాకిడి వల్ల కలిగే ప్రభావానికి దానిలోని వ్యవస్థలు దెబ్బతినకుండా ల్యాండర్‌ లెగ్స్‌ను బలోపేతం చేశారు.

మెరుగైన సెన్సర్లు

చంద్రయాన్‌-2తో పోలిస్తే.. ఈసారి ల్యాండర్‌లో చంద్రుడి ఉపరితలాన్ని మరింత సునిశితంగా విశ్లేషించే మెరుగైన సెన్సర్లను, సజావుగా ల్యాండ్‌ అయిన తర్వాత.. అధిక విద్యుదుత్పత్తికి వీలుగా అదనపు సౌర ఫలకాలను మన శాస్త్రజ్ఞులు అమర్చారు.

కొత్త కెమెరా

చంద్రయాన్‌-2 ల్యాండర్‌లో లేని విధంగా ఈసారి ల్యాండర్‌కు ప్రమాదాలను ముందే గుర్తించి వాటిని తప్పించుకునేలా ‘హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవాయిడెన్స్‌ కెమెరా’ను జోడించారు. ఇవి ఆర్బిటర్‌తో అనుసంధానమై పనిచేస్తుంటాయి. ల్యాండింగ్‌ ప్రక్రియలో ఇవి కీలకపాత్ర పోషించనున్నాయి. ల్యాండ్‌ అయ్యే క్రమంలో ఈ కెమెరా ఆ ప్రాంతాన్ని ఫొటో తీసి.. అక్కడ 30 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ పరిమాణం ఉండే రాళ్లు, రప్పల వంటివి ఉన్నాయేమో విశ్లేషిస్తుంది.

వర్టికల్‌ వెలాసిటీ కాంపొనెంట్‌ పెంపు

హయ్యర్‌ వెలాసిటీ సమస్యను అధిగమించేందుకు.. ల్యాండర్‌లో వర్టికల్‌ వెలాసిటీ కాంపొనెంట్‌ను సెకనుకు 3 మీటర్లకు పెంచారు. చంద్రయాన్‌-2లో ఇది సెకనుకు 2 మీటర్లుగా ఉండేది.

సొంత ఫొటోలు

చంద్రయాన్‌-2లో ల్యాండింగ్‌ ప్రదేశాన్ని పోల్చుకోవడానికి మన ల్యాండర్‌లోని కెమెరాలకు వేరే దేశాలు తీసిన ల్యాండింగ్‌ సైట్ల ఫొటోలను ఇన్‌పుట్‌గా ఇచ్చారు. కానీ, ఈసారి ఆ పొరపాటు చేయలేదు. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ తీసిన ల్యాండింగ్‌ సైట్‌ ఫొటోలను విక్రమ్‌ ల్యాండర్‌కు ఇస్తున్నారు.

..ఇవి ల్యాండర్‌కు చేసిన మార్పులు. ఇవి కాక.. చంద్రయాన్‌-2 మిషన్‌లో భాగంగా పంపిన ఆర్బిటర్‌ స్థానంలో ఈసారి ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ను పంపిన సంగతి తెలిసిందే. ఆర్బిటర్‌లో 9 పరికరాలు ఉండగా.. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌లో ‘షేప్‌ (స్పెకోట్రో-పోలార్‌మెట్రీ ఆఫ్‌ హాబిటబుల్‌ ప్లానెటరీ ఎర్త్‌)’ అనే ఒకే ఒక్క పరికరం ఉంటుంది. ఆర్బిటర్‌లోని 9 పరికరాలు చేసే పనినీ అది ఒక్కటే చేయగలదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular