List Of Indian Cities Named Devi: నదులు పారినచోటే నగరాలు వెలిశాయి. నగరాలు వెలిసిన చోటే సాంస్కృతిక సౌరభాలు వెళ్లి విరిశాయి. సింధు నది ఒడ్డునే హరప్పా లాంటి నగరం, గొప్ప సంస్కృతి పరిడవిల్లింది. కంబోడియన్ విష్ణు దేవాలయం కూడా నది ఒడ్డున వెలసిందే. ఎక్కడి దాకా ఎందుకు మనదేశంలో కూడా చాలా ప్రాంతాలు అమ్మవారి పేరుతోనే వెలిశాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. ఏకంగా 10 రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో దుర్గమ్మను భక్తులు మనసారా కొలుస్తారు. ఈ సమయంలో అమ్మవారు వెలసిన ప్రాంతాలను భక్తులు సందర్శిస్తారు. దేశ వ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తి పీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అయితే ఆయా ప్రాంతాల్లో సాక్షాత్తు కొలువై ఉన్న ఆదిపరాశక్తి పేరుమీద వెలసిన నగరాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ మహా నగరానికి ఆ పేరు ఎలా వచ్చిందని ఆలోచించారా? అమ్మవారి పేరు మీద వెలసిన నగరాల గురించి, వాటి ప్రాశస్త్యం గురించి ఈ దసరా శుభ సందర్భాన తెలుసుకుందాం పదండి.

ముంబా దేవి పేరు మీద ముంబై ఏర్పడింది
ముంబాయి భారత దేశ ఆర్థిక రాజధాని గానే ఈ నగరం చాలామందికి తెలుసు. మరి ఆ నగరానికి ఆ పేరు ఎలా వచ్చిందని ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ వెలసిన ముంబాదేవి ఆలయం పేరు మీద దీనిని ముంబైగా పిలుస్తున్నారు. అయితే దీని వెనుక చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పార్వతి మాత కాళికాదేవిగా అవతారం ఎత్త గ్రామంలో ఆ పరమశివుడి ఆదేశం మేరకు ఇప్పుడు ముంబైగా పిలుస్తున్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో జన్మించింది. ఈ జన్మ ద్వారా పట్టుదల, ఏకాగ్రత అలవర్చుకోవాలని, మత్స్యకారులకు ఈ రెండు లక్షణాలు ఎంతో అవసరమని చెప్పేందుకే అమ్మవారు ఈ అవతారం ఎత్తినట్టు చెబుతారు. అలా మచ్చ అనే పేరుతో పుట్టిన అమ్మవారు అవతారం ఛాలెంజ్ సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు మహా అంబగా వెలిసిందని.. కాలక్రమేణా ఆమె పేరు ముంబాదేవిగా మారినట్టు స్థలపురాణం చెబుతోంది. ఆ అమ్మవారి పేరు మీదే మన దేశ ఆర్థిక రాజధానికి ముంబై అని పేరు వచ్చింది. దక్షిణ ముంబైలోని భువనేశ్వర్ ప్రాంతంలో కొలువైన ఈ ఆలయంలోని అమ్మవారు రాతి రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ దసరా ఉత్సవాలు మహా అద్భుతంగా జరుగుతాయి.

శ్యామల దేవి పేరు మీద సిమ్లా
సిమ్లా.. పేరు చెప్పగానే అందరికీ ఆపిల్ పండ్లు గుర్తుకొస్తాయి. తెల్లటి మంచి దుప్పటి కప్పుకున్న పర్వతాలు పర్యాటకుల మదిలో మెదులుతాయి. ఈ ప్రాంతంలో ఆ కాళీ మాతే సాక్షాత్తు శ్యామల దేవిగా వెలసినట్టు స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో అమ్మవారు ఉండేందుకు గుడిని 1845లో ఓ బెంగాలీ భక్తుడు నిర్మించాడు. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో, శ్యామ వర్ణంలో మెరిసే దుర్గామాత రూపం భక్తులను కట్టిపడేస్తుంది.

చండీమాత పేరు మీద చండీగఢ్
అటు పంజాబ్ కు, హర్యానాకు రాజధానిగా విరాజుల్లుతున్న ఈ నగరాన్ని స్విస్ ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లి – కార్బు సియర్ డిజైన్ చేశారు. 2015 లో నిర్వహించిన ఓ అధ్యయన ప్రకారం ఈ నగరానికి హ్యాపీ ఎస్ట్ సిటీగా పేరు వచ్చింది. ఈ నగరంలో పార్వతి దేవి తన ఉగ్రరూపమైన చండీ అవతారంలో కొలువై ఉంది. చండీగఢ్ కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో పట్టణంలో కొండపై అమ్మవారు వెలిశారు. ఇక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో మాతా మానసిదేవి ఆలయం ఉంది. ఈ గుడికి కనుచూపుమేరలో శివాలిక్ కొండలు ఉన్నాయి.
మంగళ దేవి పేరు మీద మంగళూరు
కర్ణాటకలోని ముఖ్య పట్టణాలలో మంగళూరు ఒకటి. తీర ప్రాంతంలో వెలసిన ఈ నగరాన్ని కన్నడ వాణిజ్య వ్యవస్థకు ఆయువుపట్టు అని వ్యాపారులు పరిగణిస్తారు. మంగళ దేవి పేరుమీద ఈ నగరానికి మంగళూరు అనే పేరు వచ్చింది. పురాణాల ప్రకారం మంగళ దేవి ఆలయాన్ని మహావిష్ణు దశావతారాల్లో ఆరవ అవతారమైన పరుశురాముడు నిర్మించినట్టు తెలుస్తోంది. నేపాల్ నుంచి వచ్చిన కొందరు సాధువుల సూచన మేరకు తొమ్మిదవ శతాబ్దంలో తులు నాడును పాలించిన అలుప రాజా వంశస్థుడు కుంద వర్మన్ అనే రాజు ఆలయాన్ని పునర్ నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రతిసారి దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళ దేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సప్తమి రోజున చండి లేదా మరికాంబగ అమ్మవారిని కొలుస్తారు. నవమి రోజున అమ్మవారి ఆయుధాలకు విశేష పూజలు నిర్వహిస్తారు. దశమి రోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించిన అనంతరం నిర్వహించే రథయాత్ర ఎంతో కన్నుల పండువగా సాగుతుంది.

కాళీమాత పేరు మీద కోల్ కతా
కోల్ కతా ఈ పేరు వింటే దుర్గామాత గుర్తుకొస్తుంది. దేశమంతా జరిగే దసరా ఉత్సవాలు ఒక ఎత్తు.. కోల్ కతాలో జరిగే ఉత్సవాలు మరో ఎత్తు. శరన్నవరాత్రి సందర్భంగా ఆ రాష్ట్ర రాజధాని కోల్ కతా లో ఎటు చూసినా అమ్మవారి మండపాలు కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో కాళీమాత ఆలయాలు చాలా ఉన్నాయి. కోల్ కతాకు పేరు రావడం వెనుక ఎన్నో పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కోల్ కతా అనేది బెంగాలీ భాషలోని కాళిక్షేత్ర అనే పదం నుంచి ఉద్భవించింది. కాలిక్ క్షేత్రా అంటే కాళికాదేవి నిలయమైన ప్రాంతం అని అర్థం. అలాగే కాళీ ఘాట్ అనే పదం నుంచి ఈ నగరానికి కోల్ కతా అనే పేరు వచ్చింది.

కాళీ ఘాట్ కాళీ దేవాలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలు ఆకాశమే హద్దుగా అన్నట్టుగా సాగుతుంటాయి ఇవే కాక పతన్ దేవి కొలువై ఉండడంతో బీహార్ రాజధాని పేరు పాట్నాగా, అలాగే నైనా దేవి పేరుమీద నైనిటాల్, త్రిపుర సుందరి పేరు మీద త్రిపుర, మహిషాసుర మర్దిని పేరుమీద మైసూరు, అంబ జోగేశ్వరి పేరు మీద అంబ జోగే, కన్యాకుమారి దేవి పేరుమీద కన్యాకుమారి, తుల్జా భవాని పేరు మీద తుల్జాపూర్, భవాని అంబాదేవి పేరుమీద అంబాలా, సమలేశ్వరి దేవి పేరుమీద సంబల్పూర్ వంటి ప్రాంతాలు వెలిశాయి. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి ఈ ప్రాంతాలను సందర్శిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని స్థల పురాణాలు పేర్కొంటున్నాయి.