HomeజాతీయంMedical Seat Counseling: వైద్య విద్య ప్రక్షాళన.. కేంద్రం సంచలనం.. రాష్ట్రాల సీట్ల దోపిడీకి చెక్..!

Medical Seat Counseling: వైద్య విద్య ప్రక్షాళన.. కేంద్రం సంచలనం.. రాష్ట్రాల సీట్ల దోపిడీకి చెక్..!

Medical Seat Counseling: వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, డీమ్డ్‌ యూనివర్సిటీల్లోని అన్నిరకాల సీట్లకు తామే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శులతోపాటు వైద్య విద్య సంచాలకులకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ అతుల్‌ గోయల్‌ లేఖలు రాశారు. మెడికల్‌ అడ్మిషన్లకు సెంట్రలైజ్డ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు లేఖలో కేంద్రం పేర్కొంది. ఈ విధానంతో దేశవ్యాప్తంగా అన్ని మెడికల్‌ కాలేజీల్లో ఒకేసారి వైద్య విద్య కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. వైద్య విద్య సీట్ల బ్లాకింగ్‌ను నిరోధించడం కోసమే ఈ కేంద్రీకృత కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్లడించింది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ)తోపాటు పోస్టు గ్రాడ్యుయేట్‌ సీట్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియను కూడా కేంద్రమే చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన మాదిరిగానే లోకల్‌ రిజర్వేషన్లు, స్థానికత ఆధారంగానే కౌన్సెలింగ్‌ చేపడతామని పేర్కొంది. దీనిపై అభిప్రాయం తెలపాలని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది.

ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో..
ఇప్పటిదాకా యూజీ, పీజీ కౌన్సెలింగ్‌ ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ఎయిమ్స్‌తోపాటు జిప్‌మార్, కేంద్ర వైద్య సంస్థలు, డీమ్డ్‌ యూనివర్సిటీల్లోని యూజీ, పీజీ సీట్లన్నింటినీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీజీహెచ్‌ఎస్‌ భర్తీ చేస్తోంది. వీటితోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైద్య విద్య కళాశాలల్లోని 15 శాతం సీట్లను ఆలిండియా కోటా కింద భర్తీ చేస్తోంది. పీజీ సీట్లలోనూ 50 శాతాన్ని కేంద్రమే భర్తీ చేస్తుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆధ్వర్యంలోని 85 శాతం యూజీ సీట్లు, 50 శాతం పీజీ సీట్లతోపాటు ప్రైవేటులోని అన్ని సీట్లను స్థానిక హెల్త్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిర్వహించి భర్తీ చేస్తున్నాయి.

ఇక వందశాతం సీట్ల భర్తీ..
అయితే ఇక నుంచి ప్రభుత్వ, ప్రైవేటులోని వందశాతం సీట్లను కేంద్రమే భర్తీ చేయనుంది. కౌన్సెలింగ్‌ కోసం రాష్ట్రంలో అమలయ్యే రిజర్వేషన్‌ పాలసీలతోపాటు రాష్ట్రం నుంచి ఒక నోడల్‌ అధికారి పేరును పంపాలని లేఖలో కేంద్రం పేర్కొంది. ఆ నోడల్‌ అధికారికి ప్రస్తుత మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలోని నియమ నిబంధనలు పూర్తిగా తెలిసి ఉండాలని సూచించింది. ఆ అధికారే కేంద్ర బృందంతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ఈ విషయంపై అన్ని రాష్ట్రాలతో కేంద్రం పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకుంది.

వ్యతిరేకిస్తున్న తమిళనాడు..
మెడికల్‌ అడ్మిషన్‌ ప్రక్రియ మొత్తాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకోబోతుండటాన్ని కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు దీనిని అంగీకరించడం లేదు. నీట్‌నే తాము వ్యతిరేకిస్తున్నామని, అలాంటిది మెడికల్‌ అడ్మిషన్‌ ప్రక్రియను కేంద్రం చేతుల్లో ఎలా పెడతామని అంటోంది. అయితే ప్రస్తుతానికి తమిళనాడు ఒక్కటే ఈ విషయంలో కేంద్రంపై యుద్ధం చేస్తోంది. మున్ముందు మరిన్ని రాష్ట్రాలు ఆ జాబితాలో చేరే అవకాశం లేకపోలేదని వైద్య విద్య నిపుణులు అంటున్నారు. కాగా, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన వైఖరేంటో కేంద్రానికి స్పష్టం చేయలేదు.

నకిలీ సర్టిఫికెట్లతో సీట్లు పొందే అవకాశం
మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను దేశమంతా ఒకేసారి నిర్వహించడం ఒకందుకు మంచిదే అయినా.. దీనివల్ల అర్హులు సీటు కోల్పోయి అనర్హులు అడ్మిషన్లు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు ఆలిండియా కోటాలో ఉత్తర భారతదేశానికి చెందిన రాష్ట్రాల వారు రిజర్వేషన్‌ కేటగిరీలో తెలంగాణలో సీటు సంపాదిస్తారనుకుందాం. వారు తమ కులాన్ని బీసీగా చూపుతారు. ఇక్కడ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు వచ్చినప్పుడు హిందీ భాషలో ఉండే తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని చూస్తారు. ఇది సరైందో కాదో నిర్ధారించే పరిస్థితి ఇక్కడి నుంచి సాధ్యం కాదు. దీంతో తప్పుడు ధ్రువీకరణ పత్రంతో కూడా గతంలో కొందరు సీట్లు పొందిన సందర్భాలున్నాయి. ఒకేసారి అన్ని కాలేజీల్లో కౌన్సెలింగ్‌ చేపడితే ఇటువంటి పరిస్థితి తలెత్తవచ్చని నిపుణులు అంటున్నారు. మన రాష్ట్రంలో ఎంబీబీఎస్, డెంటల్‌ కలిపి సుమారు 70 మెడికల్‌ కాలేజీలున్నాయి. వాటిలో ఒకేసారి కౌన్సెలింగ్‌ జరిపి, మూడు రోజుల్లో జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇవ్వాలంటారు. అంటే సుమారు 10 వేల మంది కౌన్సెలింగ్‌ పూర్తి చేసి, వారి సర్టిఫికెట్లతోపాటు రిజర్వేషన్‌ ఉన్న అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలను వెరిఫికేషన్‌ చేయాలి. దీనిని ఎవరు చేస్తారన్న ప్రశ్నలకు కేంద్రం వద్ద సమాధానం లేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version