Supreme Court Judge DY Chandrachud: దేశ అత్యున్నత న్యాయస్థానానికి కొత్త ప్రధాన న్యాయమూర్తి డీవై.చంద్రచూడ్ రాబోతోన్నారు. ఆయనే 50వ చీఫ్ జస్టిస్ కాబోతోన్నారు. ఈమేరకు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ఈ మేరకు సిఫారసు చేశారు. నవంబర్ 9వ తేదీన కొత్త సీజేఐ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సీనియర్ న్యాయవాది..
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తదుపరి సీజేఐగా నియామకం కానున్నారు. ఈ మేరకు ఆయన పేరును ప్రస్తుత సీజేఐ లలిత్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీనికి సంబంధించిన అధికారిక లేఖను జస్టిస్ చంద్రచూడ్ చేతికి అందజేశారు. ఇదే అంశంపై ఆయన కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాయనున్నారు. కొత్త సీజేఐ పేరును సిఫారసు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం కిందటి వారమే సీజేఐ లలిత్‌ను కోరింది.

50 సీజేఐగా చంద్రచూడ్.
ఇదివరకు సుప్రీంకోర్టు జస్టిస్‌గా పని చేసిన ఎన్వీ.రమణ ఆగస్టు 26వ తేదీన పదవీ విరమణ చేశారు. ఆయన తరువాత దేశ 49వ సీజేఐగా జస్టిస్ లలిత్ బాధ్యతలు స్వీకరించారు. న్యాయ మంత్రిత్వ శాఖ ప్రోటోకాల్ ప్రకారం తన వారసుడెవరనే విషయాన్ని సీజేఐ నెల రోజులు ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. సీజేఐ పదవీ విరమణ తేదీకి 28 నుంచి 30 రోజుల ముందుగానే వారసుడిని పేరును వెల్లడించాల్సి ఉంటుంది. ఈమేరకు సీజేఐ లలిత్ తన వారసుడిగా డీవై.చంద్రచూడ్‌ను సిఫారసు చేశారు. ఆయనే 50వ సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
2024 వరకు..
సీజేఐ యూయూ.లలిత్.. సీనియారిటీ పరంగా జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను తన వారసుడిగా సిఫారసు చేశారు. సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఇక లాంఛనప్రాయమే. సీజేఐగా చంద్రచూడ్ 2024 నవంబర్ 10వ తేదీ వరకు కొనసాగుతారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ 1998లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 2013లో తొలిసారిగా అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించారు.
నాడు తండ్రి..
2016లో చంద్రచూడ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నామినేట్ అయ్యారు. జస్టిస్ చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవీ.చంద్రచూడ్ కూడా సీజేఐగా పని చేశారు. 16వ సీజేఐగా ఆయన బాధ్యతలను నిర్వర్తించారు. 1978 ఫిబ్రవరి 2 నుంచి 1985 జులై 11వ తేదీన వరకు వైవీ.చంద్రచూడ్ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. నాడు తండ్రి – నేడు కుమారుడు ఈ అత్యున్నత పదవిని అధిరోహించినట్టయింది.
చారిత్రాత్మక తీర్పులు..
జస్టిస్ .చంద్రచూడ్ తన ఉదారవాద న్యాయమూర్తిగా గుర్తింపు ఉంది. 24 వారాల వరకు గర్భస్రావం చేయించుకునే హక్కును ఆయన సమర్థించారు. ఆర్టికల్ 21 ప్రకారం గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించింది ఆయన భాగస్వామిగా ఉన్న ధర్మాసనం. శబరిమల ఆలయంలోకి ప్రవేశించే అన్ని వయసుల మహిళల హక్కును సమర్థించిన ధర్మాసనం న్యాయమూర్తుల్లో ఆయనా ఉన్నారు. అయోధ్య–బాబ్రీ మసీదు కేసును పరిష్కరించిన అయిదు మంది సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ కూడా సభ్యుడు.