Kavitha Kalvakuntla: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణలో తొలి అరెస్ట్‌తో గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. బోయినపల్లి అభిషేక్‌రావు అరెస్టు నేపథ్యంలో తదుపరి టార్గెట్ ఎవరనే చర్చ ఊపందుకుంది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ నేతలు ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి మరీ కవితపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌రావును సీబీఐ అరెస్టు చేయడంతో తదుపరి టార్గెట్ కవితేనన్న చర్చ ఢిల్లీ వర్గాల్లో ఊపందుకుంది.

సీబీఐ కస్డడీలో ఉన్న అభిషేక్..
బోయినపల్లి అభిషేక్‌రావు కవిత కలిసి పలు కంపెనీల్లో భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్ అరెస్ట్.. కోర్టులో ప్రవేశపెట్టడం, తర్వాత సీబీఐ కస్టడీకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు కస్టడీలో అధికారులు జరిపే విచారణలో ఇచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగనుంది.
అభిషేక్ అప్రూవర్‌గా మారితే..
సీబీఐ కస్టడీలో ఉన్న అభిషేక్‌రావు అప్రూవరగా మారితే కవిత గుంట్టంతా విప్పుతారన్న చర్చ జరుగుతోంది. అభిషేక్ ద్వారా సీబీఐ వాంగ్మూలాన్ని రికార్డు చేసే అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా కవితతో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె బంధువు శరణ్‌రెడ్డి తదుపరి టార్గెట్ అయ్యే అవకాశముంది. వారికి కూడా నోటీసులు జారీ చేసి, విచారణ చేసే అవకాశాలు లేకపోలేదని న్యాయవర్గాలు చెబుతున్నాయి.
అప్రూవర్‌గా పిళ్లై?

డిల్లీ లిక్కర్ కేసులో ఏ 14గా ఉన్న పిళ్లై సీబీఐకి అప్రూవర్‌గా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అతని ద్వారా కవితతోపాటు పలువురు టీఆర్‌ఎస్ నేతల గుట్టురట్టు చేయాలని సీబీఐ భావిస్తున్నట్లు సమాచారం. అభిషేక్‌రావు కవిత తరఫున ఢిల్లీలో లావాదేవీలు నిర్వహించారని, ఎవరెవరికి డబ్బులు ముట్టాయన్న సమాచారం ఆయనకు స్పష్టంగా తెలుసునని సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. కవితపై ఆరోపణలు వస్తున్నా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌లో ముఖ్యులెరూ ఎందుకు స్పందించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ కేసులో టీఆర్‌ఎస్ నేతలే కాకుండా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా నేతలు కేంద్రం తీరుపై ధ్వజమెత్తుతున్నారు. కానీ, టీఆర్‌ఎస్ వర్గాల నుంచి కనీస స్పందన రాకపోవడంతో అనేక సందేహాలకు తావిస్తోంది. బీజేపీపై యుద్ధం ప్రకటించానంటున్న సీఎం కేసీఆర్.. నేరుగా కవితపైనే ఆరోపణలు వచ్చినా ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని, ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
కవితను పక్కన పెట్టారా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టు తప్పదని ఆమె తండ్రి, సీఎం కేసీఆర్, మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అందుకే ఆమెను పూర్తిగా పక్కన పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కాం కారణంగానే దసరా రోజు బీఆర్‌ఎస్‌ను ప్రకటించిన కేసీఆర్ కవితను ఆహ్వానించలేదని తెలుస్తోంది. కవితను పక్కన పెట్టుకుని జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఊరెళ్తూ నల్లపిల్లిని వెంటపెట్టుకున్నట్లే అన్న అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నట్లు గులాబీ నేతలే చెబుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకే గులాబీ నేతలు కూడా కవిత లిక్కర స్కాంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని తెలుస్తోంది.
[…] Also Read: Kavitha Kalvakuntla: అభిషేక్ అప్రూవర్‌గా మారితే..… […]