Sukesh Chandrasekhar: కొన్ని ప్రేమలు విచిత్రంగా ఉంటాయి. ఆ కథలు చదువుతుంటే మనకు ఒక రకమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇతడిది కూడా అటువంటి కథనే. అతడు మామూలు ఉద్యోగిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆర్థిక నేరగాడిగా మారాడు. వందల కోట్లు సంపాదించాడు. అంతటితోనే ఆగలేదు.. బాలీవుడ్లో ప్రఖ్యాత నటి జాక్వలిన్ ఫెర్నాన్డేజ్ మీద మనసుపడ్డాడు. ఆమెకు దగ్గర కావడానికి అనేక ప్రయత్నాలు చేశాడు.
డబ్బును ఎరగా వేసి దగ్గరయ్యాడు. డబ్బుకు దాసోహం కాని వ్యక్తులు ఎవరుంటారు. ఆమె కూడా అతడి డబ్బుకు తలవంచింది. అతడికి లొంగిపోయింది. చివర్లో అతని ఆర్థిక నేరాలు తెలియడంతో ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదంతా చెబుతుంటే మీకు ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ గుర్తుకొస్తున్నాడు కదా.. ఇప్పుడు అతడు మళ్ళీ వెలుగులోకి వచ్చాడు. ఈసారి కూడా జాక్వెలిన్ ప్రస్తావన తీసుకొచ్చాడు.
ఢిల్లీ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తన ప్రియురాలి కోసం ఏకంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనికోసం వన్ బిలియన్ డాలర్లను అతడు ఖర్చు చేస్తాడట. జైలు నుంచి ఒక లేఖను తన న్యాయవాది ద్వారా చంద్రశేఖర్ బయటికి పంపించాడు. ఈ జట్టును కొనుగోలు చేసి తన ప్రియురాలు జాక్వలిన్ కు కానుకగా ఇస్తానని అతడు ప్రకటించాడు. లేఖ ద్వారా అతడు పంపిన ప్రకటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరోవైపు ఈ లేఖను చాలామంది వ్యంగ్యంగా షాజహాన్ ప్రేమతో పోల్చారు. వాస్తవానికి సుఖేష్ చంద్రశేఖర్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. అందులోంచి అతడు ఒక రూపాయి కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు బెంగళూరు జట్టును ఎలా కొనుగోలు చేస్తాడు.. అతని ప్రియురాలికి బహుమతిగా ఎలా ఇస్తాడు.. ఇప్పుడు ఈ ప్రశ్నలనే నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
అప్పట్లో చంద్రశేఖర్ ఆర్థిక నేరాలకు సంబంధించిన వ్యవహారాలను లేఖల ద్వారా బయటపెట్టాడు. తాను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు డబ్బులు ఇచ్చినట్టు సంచలన ఆరోపణలు చేశాడు. అప్పట్లో అతడు చేసిన ఈ ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇప్పుడు మళ్ళీ సుఖేశ్ చంద్రశేఖర్ బెంగళూరు జట్టును కొనుగోలు చేస్తామని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.